‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
కందనూలు/ అచ్చంపేట/ కల్వకుర్తి టౌన్: జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని పకడ్బందీ ఏర్పా ట్లు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించారు. నిమిషం నిబంధన లేనప్పటికీ విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. జిల్లాలో మొత్తం 10,598 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా అందులో 5,273 మంది బాలురు, 5,325 మంది బాలికలున్నారు. వీరి కోసం 60 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షల పర్యవేక్షణకు 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 62 మంది డిపార్టుమెంట్ అధికారులు, 36 మంది కస్టోడియన్లు, 510 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
వసతుల ఏర్పాటు
ఈ ఏడాది ఎండలు మండిపోతుండడంతో కేంద్రాల వద్ద తాగునీటి వసతి, ప్రతి గదిలో కరెంట్, ఫ్యాన్, ఫర్నిచర్, ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురైతే సత్వర సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని నియమించారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులు సమయానికి కేంద్రానికి చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.
అనుమతి లేదు..
పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులకు ఎలాంటి అనుమతి లేదు. సీఎస్, డీఓ ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ఈ నిబంధన ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి సైతం వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment