
కేజీబీవీ టీచర్ సస్పెన్షన్
కందనూలు: జిల్లాలోని నాగనూల్ కేజీబీవీలో పనిచేసే ఇంగ్లిష్ టీచర్‌ను విధుల నుంచి తొలగిస్తూ గురువారం సాయంత్రం డీఈఓ రమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంగ్లిష్ టీచర్ వేధింపులు భరించలేక కేజీబీవీలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిపై విద్యార్థినులు ఆందోళనలు చేపట్టి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశాల మేరకు ఇంగ్లిష్ టీచర్‌ను విధుల నుంచి తొలగిస్తూ.. సదరు ఉపాధ్యాయురాలిపై జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర వి చారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారన్నారు.
27న ప్రవేశ పరీక్ష
కోడేరు: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ (ఆదర్శ పాఠశాల)లో ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాఘవేంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తెలంగాణ మోడల్ స్కూల్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. 6వ తరగతి విద్యార్థులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షకు హాజరుకావాలని సూచించారు.
అడవి జంతువులకు
హాని కలిగించొద్దు
నాగర్‌కర్నూల్ క్రైం: అడవి జంతువులు గ్రామాలు, పొలాల్లోకి వస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని, జంతువులకు ఎలాంటి హాని తలపెట్టకూడదని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దేవరాజ్ అన్నారు. నాగర్‌కర్నూల్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అటవీ జంతువుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారాన్ని గురువారం ఆయన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దేవరాజ్ మాట్లాడుతూ అటవీ జంతువుల వల్ల నష్టం జరిగితే సంబంధిత అటవీ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి పరిహారం పొందవచ్చన్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో సమీప అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లోకి జంతువులు వస్తుంటాయని, వాటికి హాని కలిగించవద్దన్నారు. అనంతరం వెల్దండ మండలంలోని రవీందర్‌రెడ్డి, గంటల లక్ష్మయ్య, నర్సమ్మ, సైదమ్మ, ఊర్కొండ మండలానికి చెందిన ఆంజనేయులు, లక్ష్మయ్య, శ్రీనివాస్‌గౌడ్, పద్మ, వంగూరు మండలానికి చెందిన శ్రీనివాసులు, బిజినేపల్లి మండలానికి చెందిన ఉపేందర్‌రెడ్డి సహా మొత్తం పది మంది రైతులకు అటవీ జంతువుల కారణంగా పంటలు, పెంపుడు జంతువుల వల్ల కలిగిన నష్టానికి గాను రూ.3,12,000 పరిహారం అందజేసినట్లు వివరించారు. ఫారెస్ట్ సెక్షన్ అధికారి చంటి, సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు ఉన్నారు. వీరిలో నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న జి.సబిత యాదాద్రి–భువనగిరి జిల్లాలోని రామన్నపేటకు బదిలీ అయ్యారు. దీంతో ఆ బాధ్యతలను కల్వకుర్తి జడ్జికి అప్పగించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కోర్టులో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న నసీం సుల్తానాను నాగర్‌కర్నూల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పంపిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో అడిషనల్ జడ్జిగా పని చేస్తున్న వి.ఈశ్వరయ్యను మహబూబ్‌నగర్ జిల్లా కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వస్తున్నారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్ర జుడీషియల్ అకాడమిలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్.వెంకట్‌రాంను నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టుకు సీనియర్ సివిల్ జడ్జిగా రానున్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న జి.కళార్చన వనపర్తి జిల్లా కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వస్తున్నారు. ఇదే హోదాలో ఇక్కడ పనిచేస్తున్న కమలాపురం కవితను వనపర్తిలోని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న టి.లక్ష్మిని అక్కడే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. అలాగే ఇదే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న గంటా కవితాదేవిని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న గుండ్ల రాధికను ఇక్కడే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు.