
‘సంవిధాన్’ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కొల్లాపూర్ రూరల్: జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలాని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశం మంత్రి పాల్గొని మాట్లాడారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పాదయాత్రలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, చేసిన అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది.. వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేస్తుంది.. అప్రజాస్వామిక నిర్ణయాలు, తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు. అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని గ్రంథాలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నానని చెప్పారు. ఇందులో భాగంగా రూ.5 కోట్ల నియోజకవర్గ నిధుల నుంచి రూ.2 కోట్లు గ్రంథాలయాలు, క్రీడల అభివృద్ధికి వెచ్చిస్తానని ప్రకటించారు. ప్రతి గ్రామానికి రూ.లక్ష చొప్పున గ్రంథాలయాలకు కేటాయించామన్నారు. అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, మహాత్మగాంధీ వంటి మహనీయుల జీవిత చరిత్ర, వారి ఆశయాలు, సిద్ధాంతాలు తెలిపే పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు.