ఆయిల్‌పాం తోటల సాగుతో అధిక లాభాలు
తాడూరు: మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటల్లో భాగమైన ఆయిల్‌పాం తోటలతోపాటు వివిధ రకాల పండ్ల తోటల సాగుతో అధిక లాభాలు ఆర్జించవచ్చని ఉద్యానవన శాఖ ఆయిల్‌పాం తోటల సలహాదారు, శాస్త్రవేత్త బీఎన్ రావు అన్నారు. గురువారం మండలంలోని మేడిపూర్‌లో రైతు వెంకట్‌రెడ్డి సాగు చేసిన ఆయిల్‌పాం తోటలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక రైతులకు సూచనలు,సలహాలు ఇచ్చారు. అధిక దిగుబడుల కోసం తీసుకోవాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను వివరించారు. ప్రధానంగా వేసవిలో లేత ఆయిల్‌పాం తోటల్లో నీరు, ఎరువుల యాజమాన్యం గురించి తెలిపారు. బిందు సేద్యం ద్వారా నీటితోపాటు ఎరువులను అందించాలని సూచించారు. సమృద్ధిగా నీటి వసతి ఉన్న రైతులు అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్‌పాం తోటలను సాగుచేయాలన్నారు. మొదటి మూడేళ్ల వరకు అంతర పంటలుగా కూరగాయలు, బొప్పాయి, అరటి, పప్పుధాన్యలు, వేరుశనగ వంటి పంటలను సాగు చేయవచ్చన్నారు. 2020– 21 సంవత్సరంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద సాగు చేస్తున్న ఆయిల్‌పాం తోటల దిగుబడులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి దశలో తీసుకోవాల్సిన పురుగుల యాజమాన్యం, ఎరువుల మోతాదు, ఆడ, మగ పూల గుత్తులను తొలగించే విధానం, పక్కవారికి వచ్చిన గెలలను గుర్తించే విధానం రైతులకు క్షేత్రస్థాయిలో వివరించారు. ప్రధానంగా సూక్ష్మ పోషకాల సేంద్రియ ఎరువులను సిఫార్సున చేసిన మోతాదులో వాడుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్, ప్రీ యూనిక్ కంపెనీ డీజీఎం మల్లేశ్వరరావు, ఉద్యాన వన శాఖ అధికారులు మహేశ్వరి, స్రవంతి, లక్ష్మణ్, ఫణికుమార్, మేనేజర్ రాకేష్, క్లస్టర్ అధికారి శివభార్గవ్, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment