నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో నేరం చేసిన బాల, బాలికలందరినీ సాధారణ నేరస్తుల మాదిరిగా కాకుండా అబ్జర్వేషన్ హోంలో ఉంచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, నైపుణ్యాన్ని బట్టి వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించాలని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి అన్నారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన నాల్సా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీం సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ ఆధారంగా జువైనల్ బోర్డు ఏర్పాటు అయిందన్నారు. 6 నుంచి 14 ఏళ్లలోపు బాల, బాలికలందరూ బడిలో చదువుకోవాలని విద్యాహక్కు చట్టం చెబుతుందన్నారు. బాల, బాలికలకు ఏదైనా సమస్యలు ఉంటే 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవడం ద్వారా న్యాయ పరిష్కారం లభిస్తుందన్నారు. 18 సంవత్సరాలు నిండకుండా బాలికలు వివాహం చేసుకోకూడదని, ఒకవేళ ఎవరైనా బలవంతంగా వివాహం చేస్తే వారిపై చట్ట ప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్ ఖాజా, అబ్దుల్ రహీం, పారా లీగల్ వలంటీర్ బాలస్వామి పాల్గొన్నారు.
పన్నుల వసూళ్లు
వందశాతం చేరుకోవాలి
కల్వకుర్తి టౌన్: పట్టణంలో ఆస్తిపన్ను వసూళ్లు వందశాతం చేరుకోవాలని అదనపు కలెక్టర్, మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి దేవసహాయం వార్డు ఆఫీసర్లకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బందితో కలిసి సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఆస్తి పన్నులను చెల్లించని వారిపై ప్రత్యేక శ్రద్ధతో వసూళ్లను చేపట్టాలన్నారు. కమర్షియల్ దుకాణాదారులు విధిగా ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకోవాలని, లేకపోతే వారిపై మున్సిపల్ చట్టం–2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మ హమూద్ షేక్, మేనేజర్ రాజకుమారి, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
బీసీ బిల్లు దేశానికే
మార్గదర్శకం
కల్వకుర్తి టౌన్: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించి దేశానికే రాష్ట్రం మార్గదర్శకంగా నిలిచిందని మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ అన్నారు. శుక్రవారం కల్వకుర్తిలోని ఆయన స్వగహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కలిగించేలా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమన్నారు. ఈ బిల్లుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహుజన హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు హరిదాస్, మాజీ సర్పంచ్ ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రామన్‌పాడులో 1,017 అడుగుల నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం 1,017 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 48 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
వేరుశనగ క్వింటాల్ రూ.6,691
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శక్రవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,691, కనిష్టంగా రూ.5,611 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,935, కనిష్టంగా రూ.5,610, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,291, కనిష్టంగా రూ.1,951, జొన్నలు గరిష్టంగా రూ.4,011, కనిష్టంగా రూ.3,817 ధరలు పలికాయి.
నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణ ఇప్పించాలి
నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణ ఇప్పించాలి