● ‘పది’ పరీక్షలు ప్రారంభం
● కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్,
అదనపు కలెక్టర్, ఆర్జేడీ, డీఈఓ
కందనూలు/ అచ్చంపేట: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 10,557 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా.. వీరికోసం 60 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు తెలుగు పరీక్ష జరగగా 10,557 మంది విద్యార్థులకు గాను 10,528 మంది (99.70 శాతం) హాజరవగా.. 29 మంది గైర్హాజరయ్యారని డీఈఓ రమేష్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అమ్రాబాద్ మండలం దోమలపెంటలోని ప్రభుత్వ ప్రాజెక్టు పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలన్నారు. పరీక్ష కేంద్రంలోని అన్ని గదులను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత, సీఎన్‌ఆర్, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలను అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి డీఈఓ తనిఖీ చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్ పాకెట్లు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. కల్వకుర్తిలోని పరీక్ష కేంద్రాన్ని ఆర్జేడీ విజయలక్ష్మి తనిఖీ చేశారు. జిల్లావ్యాప్తంగా తొలిరోజు 37 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకున్నామని, ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ కేసులు నమోదు కాలేదని డీఈఓ తెలిపారు.
తొలిరోజు 99.70 శాతం