
ప్లాస్టిక్‌కు చెక్
నల్లమలలో పకడ్బందీగా ప్లాస్టిక్ నిషేధం అమలు
16 మంది స్వచ్ఛ సేవకులు
అడవిలోకి ప్రవేశించే వాహనాల్లో అత్యవసరంగా వినియోగించే వాటర్ బాటిళ్లను 2 లీటర్లు, అంతకన్నా పెద్ద సైజులో ఉండే సీసాలనే అనుమతిస్తున్నారు. ఖాళీ అయిన బాటిళ్లను అడవిలో ఎక్కడా పడవేయవద్దని వాహనదారులకు అవగాహన కల్పించిన తర్వాతే అడవిలోకి పంపుతున్నారు. ఫలితంగా చాలావరకు అడవిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గాయి. ఎక్కడైనా రోడ్డుకు ఇరువైపులా ఉండే వ్యర్థాలను 16 మంది స్వచ్ఛ సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. చెక్‌పోస్టులు, అడవిలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మన్ననూర్‌లోని ప్లాస్టిక్ బేయిలింగ్ కేంద్రంలో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని తుక్కుగూడలో ఉన్న హైపర్ ప్లాస్టిక్ పార్క్ రీసైక్లింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 34 వేల కిలోల ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయడం గమనార్హం. ఇప్పటికే ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేస్తుండగా.. ఇకముందు చిప్స్, ఇతర కవర్లను సైతం రీసైక్లింగ్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అనూహ్య స్పందన..
ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, వ్యర్థాలను అడవిలో పడేయకుండా ఉండేందుకు స్థానికులు, వాహనదారులకు అటవీశాఖ విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు స్థానికులు, వ్యాపారులు, వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నల్లమలలోని మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, వ్యాపారులు సైతం ప్లాస్టిక్ నిషేధానికి సహకారం అందిస్తున్నారు.
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలో ఉన్న వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం అటవీశాఖ రెండేళ్లుగా ప్లాస్టిక్‌పై నిషేధాన్ని అమలు చేస్తోంది. నల్లమల గుండా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోలకు సాగిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా వాహనదారులు, ప్రయాణికులు వేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్లాస్టిక్ కట్టడిపై చర్యలు కట్టుదిట్టం చేసింది. దట్టమైన నల్లమల అడవిలోకి రాకముందే ముఖద్వారం వద్ద వాహనదారుల నుంచి ప్లాస్టిక్‌ను సేకరించడంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో అడవిలో ప్లాస్టిక్ వేయవద్దని విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. అటవీశాఖ చేపడుతున్న ప్లాస్టిక్ నిషేధంతోపాటు అవగాహన కార్యక్రమాలకు స్థానిక ప్రజలు, వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇప్పటికే ఏటా అడవిలో పోగవుతున్న చెత్తలో సుమారు 80 శాతం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించగలిగారు.
వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ చర్యలు
మన్ననూరు, దోమలపెంట చెక్‌పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 80 శాతం వరకు తగ్గిన వ్యర్థాలు
ఇప్పటి వరకు 34 వేల కిలోల ప్లాస్టిక్ రీసైక్లింగ్ పూర్తి

ప్లాస్టిక్‌కు చెక్