రెండున్నరేళ్లలో ఎస్‌ఎల్‌బీసీని పూర్తిచేసి తీరుతాం | - | Sakshi
Sakshi News home page

రెండున్నరేళ్లలో ఎస్‌ఎల్‌బీసీని పూర్తిచేసి తీరుతాం

Apr 3 2025 1:28 AM | Updated on Apr 3 2025 1:28 AM

రెండున్నరేళ్లలో ఎస్‌ఎల్‌బీసీని పూర్తిచేసి తీరుతాం

రెండున్నరేళ్లలో ఎస్‌ఎల్‌బీసీని పూర్తిచేసి తీరుతాం

అచ్చంపేట/ఉప్పునుంతల: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ)ని రెండున్నరేళ్లలో పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గతనెల 22న ప్రమాదం చోటు చేసుకున్న దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ఇన్‌లెట్‌ను బుధవారం సందర్శించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపడుతున్న సహాయక చర్యల గురించి ప్రత్యేకాఽధికారి శివశంకర్‌ లోతేటి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌తో మంత్రి తెలుసుకున్నారు. అనంతరం సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సొరంగంలో ప్రమాదం చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని.. మరో 105 నుంచి 110 మీటర్ల వరకు మట్టి తవ్వకాలు పూర్తయితే సమస్య ఓకొలిక్కి వస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గడిచిన 40 రోజుల్లో వివిధ బృందాలకు చెందిన 700 నుంచి 800 మంది సహాయక సిబ్బంది, నిపుణులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం 550 నుంచి 600 మంది అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారన్నారు. సొరంగం లోపల భారీ డ్రిల్లింగ్‌ యంత్రానికి ఇనుము, ఇతర పరికరాలు అతుక్కుపోవడంతో అక్కడ బురద తొలగింపు కష్టంగా, ప్రమాదకరంగా మారిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహాయక సిబ్బందికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. మరో 15 రోజుల్లో సహాయక చర్యలను పూర్తిచేస్తామన్నారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యం కాగా.. మిగిలిన ఆరుగురి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. భవిష్యత్‌లో సొరంగం వల్ల ఎలాంటి నష్టాలు జరగకుండా సంపూర్ణ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సొరంగం పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేసేందుకు కృతనిశ్చయంతో ఉందన్నారు. సమావేశంలో డిజాస్టర్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్‌, విజయ్‌కుమార్‌, ఎన్‌డీఆర్‌ఎస్‌ అధికారి డా.హరీశ్‌, సింగరేణి మైన్స్‌ రెస్క్యూ జనరల్‌ మేనేజర్‌ బైద్య, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా అధికారి జయప్రకాశ్‌, దక్షిణమధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్‌, నీటిపారుదలశాఖ డీఈ శ్రీనివాసులు, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ ప్రతినిఽధి ఫిరోజ్‌ ఖరేషి, జీఎస్‌ఐ అధికారులు రాజశేఖర్‌, కాడవర్‌ డాగ్స్‌ ప్రతినిధి ప్రభాత్‌ తదితరులు ఉన్నారు.

లభించని కార్మికుల ఆచూకీ..

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో 45 రోజుల క్రితం ప్రమాదానికి గురైన కార్మికుల జాడ లభించడం లేదు. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండాపోతుంది. ఉబ్బికి వచ్చిన నీటితో కూలిన సొరంగం ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, బురద, బండరాళ్ల తొలగింపునకు మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సహాయక సిబ్బంది తెలిపారు. ఇప్పటికే టీబీఎం భాగాలు, శిథిలాలు, మట్టి, రాళ్ల తొలగింపు పనులను సహాయక బృందాలు వేగవంతం చేశాయి. సొరంగంలో 10వేల లీటర్లు నీటి ఊట వస్తుండగా.. 2.5 కి.మీ. ఒకటి చొప్పున 150 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన భారీ మోటార్లతో బయటకు పంపింగ్‌ చేస్తున్నారు. డీ–1 ప్రాంతం వరకు మట్టి తొలగింపు పూర్తి కాగా.. మరో 105 నుంచి 110 మీటర్ల మేర తవ్వకాలు చేపడితే సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

సొరంగంలో ప్రమాద ఘటన బాధాకరం

15 రోజుల్లో సహాయక చర్యలు పూర్తి

మృతుల కుటుంబాలకు త్వరలో పరిహారం

రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement