
ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా శిక్షపడేలా చూస్తాం
నాగర్‌కర్నూల్ క్రైం: ఉర్కొండ మండలం ఊర్కొండపేటలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్షపడేలా చూస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సభ్యసమాజం తలదించుకునే విధంగా మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారని అన్నారు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి పలు సెక్షన్ల కేసులు నమోదు చేయడంతో పాటు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలను ఎవరు సహకరించరని.. నిందితులను సమాజం బహిష్కరణ చేస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో భాగంగా జిల్లాలోని ప్రముఖ దేవాలయాలతో పాటు ట్యాంక్‌బండ్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పోలీసు నిఘా, పహారా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలపై అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే పోలీసు, ప్రభుత్వ పరంగానే కాకుండా సమాజంలోని ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి మానవీయ విలువల్లో మార్పు రావాలని అన్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
బాధితురాలికి రూ. 25,000 చెక్కు
కందనూలు: ఊర్కొండపేటలో అత్యాచారానికి గురైన మహిళకు మహిళా, శిశుసంక్షేమ శాఖ నుంచి రూ. 25,000 చెక్కు అందించినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.