
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
కల్వకుర్తి టౌన్: ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని గాంధీనగర్ కాలనీ రేషన్ దుకాణంలో ప్రజలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పీసీబీ మెంబర్ బాలాజీసింగ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వానికి భారమైనా తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే.. ప్రతిపక్షాలు పనిగట్టుకొని విమర్శలు, అనవసర రాద్దాంతాలు చేస్తున్నాయన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలుచేసి తీరుతామన్నారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా రేషన్ బియ్యాన్ని తూకం చేసి ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.