ఉత్సవాలకు ముస్తాబు..
సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి ఆలయాన్ని బ్రహ్మోత్సవాలకు ముస్తాబు చేస్తున్నారు. ఉత్సవాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు నల్లగొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరానున్నారు. వేసవి దృష్ట్యా భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులు అద్దారు. భక్తులకు తాగునీటి సదుపాయం మెరుగుపరిచారు. ఆలయ పరిసరాలను చదును చేశారు. మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేయడంతో పాటు గుట్టపైకి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలు తొలగించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు తెలిపారు.


