మోదం.. ఖేదం | - | Sakshi
Sakshi News home page

మోదం.. ఖేదం

Published Thu, Mar 20 2025 1:05 AM | Last Updated on Thu, Mar 20 2025 1:04 AM

ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకే ప్రాధాన్యం

సాక్షి, నాగర్‌కర్నూల్‌:

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉమ్మడి పాలమూరు జిల్లాకు నిరాశే మిగిల్చింది. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పూర్తి చేసేందుకు అధిక మొత్తంలో నిధులు సమకూరుస్తారని భావించగా, బడ్జెట్‌లో కేవలం రూ.2,514 కోట్ల మేరకే కేటాయింపులు దక్కాయి. ఈ ప్రాజెక్ట్‌ కింద చేపడుతున్న కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు బడ్జెట్‌లో ప్రస్తావించింది. ప్రధానంగా ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, కోయిల్‌సాగర్‌, సంగంబండ, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఇందుకోసం ఈసారి బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లావాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

కేఎల్‌ఐ పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు..

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, విస్తరణ పనులను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. ఇందుకోసం ఈసారి బడ్జెట్‌లో రూ.800 కోట్లను కేటాయించింది. గతేడాది సైతం రూ. 715 కోట్లు కేటాయించగా, ఈసారి మరికొంత నిధులను పెంచింది. కల్వకుర్తి కింద పెండింగ్‌లో ఉన్న 28, 29, 30వ ప్యాకేజీ లను పూర్తిచేయడం ద్వారా ఆయా ప్రాజెక్ట్‌లకు పూర్తిస్థాయి లో ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కురుమూర్తిస్వామి ఆలయాభివృద్ధికి

రూ.110 కోట్లు

పాలమూరు ప్రజల ఆరాధ్యదైవం అమ్మాపురంలో ఉన్న కురుమూర్తిస్వామి ఆలయానికి ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఘాట్‌రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాజీవ్‌ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం 20–25 ఎకరాల స్థలాన్ని కేటాయించి, నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు.

● రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్ల పంపిణీ పథకాలకు నిధులను సమకూర్చింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ. 31,605 కోట్లు కేటాయించడం ద్వారా గ్రామీణ రోడ్లు, గ్రామాల్లో మౌలిక వసతులకు పెద్దపీట వేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది లబ్ధిపొందనున్నారు.

● ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని చెబుతూ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దీంతో ఇప్పటివరకు రుణమాఫీ కాని రైతుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త టూరిజం పాలసీ ద్వారా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నల్లమల అటవీప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లను కేటాయించింది. ఈ నిధుల ద్వారా పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రణాళిక రూపొందించనుంది. టైగర్‌ సఫారీ, ఎకో టూరిజం, కృష్ణానదిపై లాంచీ స్టేషన్లు, జెట్టీలు, వాటర్‌ స్పోర్ట్స్‌, ఇతర మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి పర్చనున్నారు.

● నల్లమలలో పర్యాటక అభివృద్ధితో పాటు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో గెస్ట్‌ హౌస్‌ల నిర్మాణాలు, ట్రెక్కింగ్‌ మార్గాలను అభివృద్ధి చేయనుంది. కృష్ణాతీరంలోని సోమశిల వద్ద బోటింగ్‌, క్యాంపింగ్‌, కారవాన్‌ క్యాంపింగ్‌ సదుపాయాల కోసం ప్రణాళిక చేపట్టింది.

పెండింగ్‌లో ఉన్న కోయిల్‌సాగర్‌, సంగంబండ, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. కోయిల్‌సాగర్‌కు రూ.80.73 కోట్లు, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌కు రూ.144 కోట్లు, సంగంబండకు రూ.98.08 కోట్ల నిధులను కేటాయించింది. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్ట్‌కు అవసరమైన కేటాయింపులు దక్కడంతో పెండింగ్‌లో ఉన్న దేవరకద్ర గ్రావిటీ కెనాల్‌, ఎడమ కాల్వ, డిస్ట్రిబ్యూటరీ కాల్వల పనుల్లో వేగం పెరుగనుంది. సంగంబండ కింద చేపడుతున్న భూత్పూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు.

కోయిల్‌సాగర్‌, సంగంబండకు కేటాయింపులు

కేఎల్‌ఐకు రూ.800 కోట్లు కేటాయింపు

‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతలకు మరోసారి నిరాశే

నల్లమలలో పర్యాటక అభివృద్ధి కోసం రూ.242 కోట్లు

రాష్ట్ర బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

మోదం.. ఖేదం 1
1/2

మోదం.. ఖేదం

మోదం.. ఖేదం 2
2/2

మోదం.. ఖేదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement