బిజినేపల్లి: ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు కీలకమైన ఘట్టం ఇంటర్ విద్య అని.. ఈ దశలో విద్యార్థులు తప్పటడుగులు వేస్తే జీవితాంతం సర్దుకుపోతూ బతకాల్సి వస్తుందని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా వార్షిక పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పే టీ–శాట్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని డీఈఓ బిజినేపల్లి కేజీబీవీ పాఠశాల విద్యార్థులతో కలిసి వీక్షించారు. వీసీ అనంతరం డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకొని.. అందుగు తగు ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు షర్ఫుద్దీన్, శోభారాణి, నాగేందర్, ఎంఈఓ రఘునందన్‌రావు, ప్రత్యేకాధికారి నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.