
పొదుపు చేస్తేనే..!
కల్వకుర్తి: వేసవి నేపథ్యంలో ప్రజలు ఎండ వేడికి తాళలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపం నుంచి రక్షించుకోవడానికి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడుతుండటంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రతినెలా గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల లోపు జీరో బిల్లు జారీ చేస్తుంది. అయితే విద్యుత్‌ను విచ్చలవిడిగా వాడితే ఈ పథకం వర్తించకుండాపోయే ప్రమాదం ఉంది. 200 యూనిట్లకు ఒక్క యూనిట్ అదనంగా వచ్చినా మొత్తం బిల్లు కట్టాల్సిందే. ఈ క్రమంలో ఒకవైపు వేసవితాపం.. మరో వైపు విద్యుత్ బిల్లుల భారంలో ఒకటి కావాలంటే మరొకటి వదుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే విద్యుత్‌ను పొదుపు చేసుకోవడమే మార్గం. ఉపకరణాలను పూర్తిగా కట్టేయాల్సిన అవసరం లేకుండా విద్యు త్‌ను పొదుపుగా వాడుకుంటే నిరంతరాయంగా గృహజ్యోతిని సద్వినియోగం చేసుకోవచ్చు.
ప్రతి ఇంట్లో ప్రస్తుతం ఎల్‌ఈడీ బల్బులనే వినియోగిస్తున్నారు. అయితే ఇప్పటికీ కొందరు ఫ్లోర్‌సెంట్ ట్యూబ్‌లైట్లు వాడుతున్నారు. వీటి సామర్థ్యం 40 వాట్లు ఉండటంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. దీని దృష్ట్యా ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు వాడటమే మేలు.
● ఏసీలను 24 నుంచి 29 డిగ్రీల మధ్య ఉపయోగిస్తే చల్లదనంతోపాటు బిల్లు ఆదా అవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇన్వర్టర్‌తో నడిచే ఏసీలు లభిస్తున్నాయి. గది చల్లబడగానే ఆటోమేటిక్‌గా ఏసీ నిలిచిపోతుంది. వీటితో కొంత విద్యుత్ వినియోగం తగ్గే అవకాశం ఉంది. సాధారణ ఏసీలు కరెంటు పోయి వచ్చినప్పుడు పునఃప్రారంభమయ్యే సమయంలో లోడ్ పెరుగుతుంది. ఇది విద్యుత్ సరఫరాపై భారం పడుతుంది.
● సీజన్ మేరకు ఫ్రిజ్‌లో ఫ్రీజర్ దశలు మారుస్తూ ఉండాలి. వేసవిలో ఎక్కువ ఉంచినా మిగిలిన కాలాల్లో తగ్గించుకోవాలి.
● ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఎల్‌ఈడీ బల్బులు, రిఫ్రిజరేటర్లు తదితర విద్యుత్ గృహోపకరణాలు 5 స్టార్ ఉంటేనే విద్యుత్ వినియోగం తగ్గి బిల్లు ఆదా అవుతుంది.
● కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు అవసరం లేని సమయంలో స్విచ్ ఆఫ్ చేయాలి. ఫోన్ చార్జింగ్ పూర్తయ్యాక చార్జర్‌ను ఫ్లగ్ నుంచి తొలగించాలి.
ఇలా చేస్తే ఆదా..
వేసవిలో విద్యుత్ ఆదా చేస్తేనే గృహజ్యోతి
200 యూనిట్లు దాటితే వర్తించని పథకం
చిట్కాలు పాటిస్తే బిల్లు భారం నుంచి గట్టెక్కే అవకాశం