ఇంటర్ పరీక్షలకు 141 మంది గైర్హాజరు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. శనివారం జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 5,063 మంది విద్యార్థులకు గాను 4,922 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 3,756 మందికి గాను 3,638, ఒకేషనల్ విభాగంలో 1,307 మందికి గాను 1,284 మంది హాజరై పరీక్షలు రాశారు. ఆయా విభాగాల్లో మొత్తం 141 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను డీఐఈఓ వెంకటరమణ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
నేడు ప్రవేశ పరీక్ష
వెల్దండ: మండలంలోని గుండాల గ్రామం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 6వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పర్దీప్‌కుమార్ తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒకే పాఠశాల ఉండగా 394 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఆదివారం ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. 6వ తరగతి ప్రవేశానికి 60 సీట్లు మాత్రమే ఉండటంతో అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేద్రానికి హాజరుకావాలని ప్రిన్సిపల్ సూచించారు.
శనేశ్వరుడికి
శాస్త్రోక్త పూజలు
బిజినేపల్లి: జేష్ట్యాదేవి సమేత శనేశ్వరుడికి మండలంలో నందివడ్డెమాన్ గ్రామంలో ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలినాటి శనిదోష నివారణ కోసం భక్తులు శనివారం తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని తిలతైలాభిషేకాలతో తమ గోత్రనామార్చనలతో పూజలు జరిపారు. బ్రహ్మసూత్ర పరమ శివుడిని దర్శించుకున్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.
రేపు శిర్సనగండ్లలో వేలం పాట
చారకొండ: మండలంలోని శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో కొబ్బరికాయలు, కొబ్బరి ముక్కలు, తలానీలాలు, లడ్డు, పులిహోరా ప్రసాదాలకు సంబంధించి సోమవారం బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి కల్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో వేలం పాట కొనసాగుతుందన్నారు. ఔత్సాహికులు కొబ్బరికాయలకు రూ.5 లక్షలు, తలనీలాలకు రూ.లక్ష, కొబ్బరి ముక్కలకు రూ.50 వేలు, లడ్డు, పులిహోర ప్రసాదాలకు రూ.లక్ష చొప్పున డిపాజిట్ చెల్లించాలని సూచించారు.
సోమశిల ఆలయంలో..
కొల్లాపూర్: మండలంలోని సోమశిల లలితాంబికా సోమేశ్వరాలయంలో టెంకాయలు, లడ్డూ ప్రసాద విక్రయాల కోసం సోమవారం వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.50 వేలు డిపాజిట్ చెల్లించి ముందస్తుగా తమ పేర్లు ఆలయ కమిటీ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. వేలం దక్కించుకున్న వారు ఏడాదిపాటు ఆలయంలో టెంకాయలు, లడ్డు ప్రసాదాలు విక్రయించాల్సి ఉంటుందన్నారు.
ఇంటర్ పరీక్షలకు 141 మంది గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment