జంటలే లక్ష్యంగా దోపిడీలు | - | Sakshi
Sakshi News home page

జంటలే లక్ష్యంగా దోపిడీలు

Published Wed, Apr 2 2025 12:25 AM | Last Updated on Wed, Apr 2 2025 12:25 AM

జంటలే లక్ష్యంగా దోపిడీలు

జంటలే లక్ష్యంగా దోపిడీలు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో మహిళపై సామూహిక అత్యాచార కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆలయ సమీపంలో కొన్నాళ్లుగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టు తెలిసింది. తాజాగా మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన ఏడుగురు నిందితులే ముఠాగా ఏర్పడి కొన్నాళ్లుగా ఇదే తరహాలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుత కేసులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఇప్పటికే పలుమార్లు నేరాలకు పాల్పడినట్టుగా తేల్చారు. ఆలయానికి వచ్చే ప్రేమ జంటలే లక్ష్యంగా చేసుకుని బెదిరించి, దోపిడీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. గతంలో ఎన్నిసార్లు ఇలాంటి నేరాలకు పాల్పడ్డారు.. ఇంకా బాధితులు ఎంత మంది ఉన్నారన్న కోణంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు.

చట్టం తెలిసిన నేరస్తులు..

మైనర్ల జోలికి వెళ్లరు

మహిళపై అత్యాచారం కేసులో పోలీసులు ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆలయ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి మహేశ్‌గౌడ్‌తోపాటు ఊర్కొండపేట గ్రామానికి చెందిన బంగారు ఆంజనేయులు, మట్ట ఆంజనేయులు, సాదిక్‌ బాబా, హరీశ్‌, వాగుల్దాస్‌, మణికంఠ ఉన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి కొన్ని రోజులుగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ దోపిడీలు చేస్తున్నారు. అయితే వీరు మైనర్లు ఎవరైనా జంటలుగా కనిపిస్తే అప్రమత్తంగా ఉంటారు. వారిపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో ద్వారా కఠిన శిక్షలు అమలు అవుతుండటంతో వారిని బెదిరించి, డబ్బులు మాత్రమే వసూలు చేస్తారు. వివాహిత మహిళలు, మేజర్లు అయితే దోపిడీ చేసి అత్యాచారానికి పాల్పడుతున్నారు. బంగారు ఆభరణాలను తీసుకున్నా బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం ఎక్కువగా ఉండటంతో చాలా వరకు డబ్బులకే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది. ఈ ముఠా ఇప్పటి వరకు ఎంత మందిపై నేరాలకు పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

కనీస వసతులకూ దిక్కులేదు..

ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి ఉమ్మడి జిల్లాతోపాటు నల్లగొండ, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే భజన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడే రాత్రి బస చేస్తారు. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో మహిళలకు కనీస వసతులు కూడా కరువయ్యాయి. అరకొరగా ఉన్న బాత్‌రూంలు, టాయిలెట్లను సైతం మూసి వేస్తుండటం, నిర్వహణ లేకపోవడంతో మహిళలు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. తాగునీరు, టాయిలెట్లు, వసతి గదులు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాలు లేక ఆరుబయటకు వెళ్తున్న మహిళలను బెదిరిస్తూ కొందరు అఘాయిత్యాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు.

నిఘా వైఫల్యమేనా..?

ఊర్కొండపేట ఆలయ సమీపంలో గత కొన్ని నెలలుగా అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఆలయంలోని సిబ్బంది, గ్రామానికి చెందిన కొందరు ఆటోడ్రైవర్లు, యువకులు ఆలయానికి వచ్చే ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారు ఒంటరిగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ, వారి వద్ద ఉన్న నగదును దోచుకుంటున్నారు. ఎవరికై నా చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫొటోలు, వీడియోలు బయట పెడుతామంటూ బెదిరిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ తరహా నేరాలు చోటుచేసుకుంటున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పెట్రోలింగ్‌ పెంచుతాం: ఐజీ

కల్వకుర్తి టౌన్‌: ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి చాలా మంది భక్తులు ఊర్కొండపేట ఆలయానికి వస్తారని, వీరి రక్షణ కోసం పోలీస్‌ పెట్రోలింగ్‌ పెంచుతామని మల్టీజోన్‌–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అత్యాచార ఘటన జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ రఘునాథ్‌ వైభవ్‌తో కలిసి పరిశీలించారు. ఊర్కొండ పోలీస్‌స్టేషన్‌కు సిబ్బందిగా ఎక్కువగా కేటాయించి, ఆలయం వద్ద పికెటింగ్‌ నిత్యం ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. స్థానికులు, ఆలయ పాలక మండలి, ఆలయ పరిసర ప్రాంత ప్రజలతో ఐజీ మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. అత్యాచార ఘటనలో పాల్గొన్న ఆలయ ఉద్యోగి గురించి తెలుసుకొని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు సహకారం అవసరమని ఐజీ పేర్కొన్నారు. ఐజీ వెంట కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున, ఎస్‌ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, పోలీస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో

బ్లాక్‌మెయిల్‌ ముఠా

వీడియోలు, ఫొటోలతో

బెదిరించి డబ్బుల వసూళ్లు

తాజాగా మహిళపై అత్యాచారానికి ఒడిగట్టింది ఈ ముఠానే..

ప్రముఖ ఆలయం వద్ద

కరువైన పోలీసుల నిఘా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement