సంపూర్ణ టీకాకరణే లక్ష్యం
తెలకపల్లి: మానవాళికి వ్యాధినిరోధక టీకాలే ప్రాణరక్ష అని.. ప్రతి గర్భిణి, శిశువుకు సంపూర్ణ టీకాకరణే లక్ష్యంగా వైద్యసిబ్బంది పనిచేయాలని జిల్లా టీకాల అధికారి డా.రవికుమార్ నాయక్ అన్నారు. ఆదివారం జాతీయ టీకా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ నిల్వలను పరిశీలించారు. గర్భిణులు, రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి చిన్నారికి 12 ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు టీకాకరణ చేస్తున్నామన్నారు. టీకా తయారీ నుంచి లబ్ధిదారుకు అందే వరకు శీతలీకరణ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ఐఎల్‌ఆర్‌డీఎఫ్ ఫ్రిజర్స్, వ్యాక్సిన్ క్యారియర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలోని వ్యాక్సిన్ సెంటర్లలో ప్రతి బుధ, శనివారాల్లో చిన్నారులు, గర్భిణులకు వ్యాధినిరోధక టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఆరు రకాల క్యాటగిరీకి చెందిన వారందరికీ అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ కార్యక్రమంతో పాటు మహిళల్లో గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ, 12–17 ఏళ్లలోపు బాలికల్లో వ్యాధినిరోధక శక్తి పెంపొందించేందుకు అవసరమైన టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డాక్టర్ నీరజ్ కుమార్, సూపర్‌వైజర్ పసియొద్దీన్, ఆరోగ్య కార్యకర్త యాదగిరి, రవీందర్‌రావు, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment