మానసిక దివ్యాంగుల కు ప్రేమానురాగాలు పంచాలి
నాగర్‌కర్నూల్ క్రైం: సమాజంలో మానసిక వైకల్యం చెందిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా సుహృద్భావంతో మెలగాలని సీనియర్ సివిల్ జడ్జి సబిత అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో నాల్సా లీగల్ సర్వీసెస్ టు పర్సన్స్ విత్ మెంటల్ ఇల్నేస్ అండ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబులిటీస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానసిక వైకల్యం ఉన్న వ్యక్తుల పట్ల కూడా మానవత దృక్పథంతో మెలగడంతోపాటు ప్రేమానురాగాలు పంచాలని, వారికి ఆరోగ్యం బాగోలేని పక్షంలో తోటి రోగులకు ఎలా అయితే చికిత్స అందిస్తారో వీరికి కూడా అలాగే అందించాలన్నారు. మానసిక దివ్యాంగులకు ప్రత్యేకమైన రిజర్వేషన్ సదుపాయాలు ఉంటాయని, 21 రకాలుగా శారీరక, మానసిక వ్యక్తులు గుర్తించబడ్డారన్నారు. ఎవరైనా మానసిక దివ్యాంగులను వేధించడం, నిర్బంధించడం, ఆహారం ఇవ్వకుండా ఉంటే ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తారని హెచ్చరించారు. దివ్యాంగులను తల్లిదండ్రులు, కుటుంబం నుంచి దూరం చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. దివ్యాంగులకు సైతం ఓటు వేసే హక్కు ఉందని, వీరికి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గౌసియా, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment