
బాధితురాలికి ప్రభుత్వం అండ
ఊర్కొండ: ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో అత్యాచార ఘటన జరగడం దారుణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానిక ఆలయ అధికారులు, పోలీసులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆలయ సమీపంలో జరిగిన ఈ సంఘటనను సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఈ విషయమై తనతో ఫోన్‌లో మాట్లాడారని వివరించారు. ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి విచారణ వేగవంతం చేస్తున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. స్థానికంగా గంజాయి విక్రయాలు జరుగుతుంటే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. స్థానికులు దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో లైటింగ్‌ను మెరుగుపర్చడంతోపాటు ఆలయ ప్రాంతానికి చుట్టూ కంచె ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. అలాగే ప్రతిరోజు పోలీస్ పికెట్ నిర్వహించేలా ఎస్పీతో మాట్లాడానని చెప్పారు.