కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జనరల్ విభాగం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒకేషనల్ ప్రథమ సంవత్సరం పరీక్షలు శనివారంతో ముగియనున్నాయి. బుధవారం జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. 7,058 మంది విద్యార్థులకు గాను 6,634 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,604 మందికి గాను 5,310 మంది, ఒకేషనల్ విభాగంలో 1,454 మందికి గాను 1,324 మంది హాజరై పరీక్షలు రాశారు. ఆయా విభాగాల్లో 424 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగ కుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
22న బియ్యానికి వేలం
నాగర్‌కర్నూల్: జిల్లాలో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వారిపై 6ఏ కేసులు నమోదు చేశామని.. వారి నుంచి స్వాధీనం చేసుకున్న 981.55 క్వింటాళ్ల బియ్యానికి ఈ నెల 22న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ అమరేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనే వారు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ పేరుపై రూ. 5లక్షల డీడీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు నిర్ణీత గడువులోగా డీడీ తీసి.. కలెక్టరేట్‌లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో 22న మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించే వేలంలో పాల్గొనాలని సూచించారు.
26న వాసెక్టమీ శిబిరం
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 26న పురుషులకు ఎలాంటి కుట్టు, కోత లేకుండా (నో స్కాల్పెల్ వాసెక్టమీ) కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రఘు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాసెక్టమీ చేయించుకోవాల్సిన వారు తమవెంట ఆధార్ కార్డు జిరాక్స్, సెల్ నంబర్‌తో హాజరు కావాలని సూచించారు. ప్రత్యేక వైద్యనిపుణులచే ఎన్‌ఎస్‌వీ ఆపరేషన్లు ఉచితంగా చేయనున్నట్లు పేర్కొన్నారు. కేవలం రెండు నిమిషాల్లో ఆపరేషన్ చేసి.. మందులు అందించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు హెల్ప్ డెస్క్ ఇన్‌చార్జి టి.యాదగిరి (90149 32408)ని సంప్రదించాలని సూచించారు.
ఆదివాసీ చెంచుల
సమస్యలపై పోరాటం
మన్ననూర్: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆదివాసీ చెంచులకు కనీస సౌకర్యాల కల్పన కోసం మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలంగాణ చెంచు ఐక్యవేదిక అధ్యక్షుడు చిగుర్ల మల్లికార్జున్ అన్నారు. బుధవారం చెంచు పెంటల్లో పర్యటించిన ఆయన.. అగర్లపెంటలో చెంచులతో సమావేశమై మాట్లాడారు. పాలకులు, అధికారులు చెంచుల సంక్షేమాన్ని కాగితలకే పరిమితం చేశారని విమర్శించారు. పండగలు, జాతర్ల పేరుతో చెంచు పెంటలకు వస్తున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు.. అరచేతిలో వైకుంఠం చూపించి చేతులు దులుపుకొంటున్నారని ఎద్దేవా చేశారు. చెంచులకు మౌలిక వసతుల కల్పన కోసం పాలకులు నిధులు మంజూరు చేస్తుంటే.. ఆంక్షల పేరుతో అధికారులు అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అప్పాపూర్, సార్లపల్లి గ్రామాలను ప్రత్యేక పంచాయతీగా గుర్తించినప్పటికీ.. ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమన్నారు. వేసవి కాలం వచ్చిందంటే చెంచు పెంటల్లో నివసిస్తున్న చెంచులు ఆకలి దప్పులతో అలమటించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెంచు పెంటలకు రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు ఐటీడీఏ తరఫున మోడల్ జీపీ పాఠశాలలు, వైద్యం, అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందించాలని, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.