కొల్లాపూర్: నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు పులుల గణన చేపట్టారు. కొల్లాపూర్ సమీపంలోని నల్లమల అడవిలో రెండు రోజుల క్రితం గణన ప్రారంభించినట్లు ఫారెస్టు రేంజర్ చంద్రశేఖర్ తెలిపారు. ఫేజ్–4లో భాగంగా కొల్లాపూర్ రేంజ్‌లో బయాలజిస్టు రవికాంత్ నేతృత్వంలో పులులు, చిరుతల పాదముద్రలు సేకరిస్తున్నట్లు వివరించారు. అటవీ ప్రాంతంలో ప్రతి రెండు చదరపు కిలోమీటర్లకు ఒక కెమెరా ఏర్పాటు చేశామని, కెమెరాలో రికార్డు అయిన వన్యప్రాణులతోపాటు పాదముద్రల ఆధారంగా గణన కొనసాగుతుందని చెప్పారు. పులుల గణనలో స్థానిక ఫారెస్టు అధికారులతోపాటు బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. గతేడాది కొల్లాపూర్ రేంజ్ పరిధిలో 9 పులులను గుర్తించామని ఆయన వెల్లడించారు. అనుమతి లేకుండా ఎవరూ అడవిలోకి వెళ్లవద్దని సూచించారు.