
అర్హుల గుర్తింపు షురూ
●
ఇందిరమ్మ ఇళ్ల పథకం
ఎల్–1 జాబితా పునఃపరిశీలన
● పైలెట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం
● మిగతా గ్రామాలు, మున్సిపాలిటీల్లో లబ్ధిదారుల గుర్తింపునకు చర్యలు
● ప్రత్యేక బృందాలతో రీవెరిఫికేషన్ ప్రక్రియ
పైలెట్ గ్రామాల్లో
పనులు ప్రారంభం..
జిల్లాలోని పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం. ఏడు మండలాల పరిధిలో 18 మంది లబ్ధిదారులకు ముగ్గు పోశాం. వారు నిర్మాణపు పనులు చేపట్టారు. బేస్‌మెంట్ వరకు నిర్మాణం చేసిన వారికి రెండు, మూడు రోజుల్లో బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తాం. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో లబ్ధిదారుల గుర్తింపునకు రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. రెండు, మూడు రోజుల్లో పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం.
– సంగప్ప, పీడీ, గృహనిర్మాణశాఖ
అచ్చంపేట: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల ఎంపికలో భాగంగా అధికారులు రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల మంజూరుకు నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే జనవరి 26న జిల్లావ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 20 గ్రామపంచాయతీలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. గ్రామ, మున్సిపల్ వార్డు సభల్లో అర్హుల జాబితాను వెల్లడించింది. తొలి విడతలో 850 మందికి ఇళ్లను మంజూరు చేశారు. అయితే గతంలో అర్హుల జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి.. మిగిలిన గ్రామాలు, పట్టణాల్లో అర్హుల ఎంపికపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. జిల్లాలో అందిన దరఖాస్తుల మేరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే చేపట్టి పూర్తి వివరాలు నమోదు చేశారు. దరఖాస్తుదారులను మూడు రకాలుగా విభజించి జాబితాలు తయారు చేశారు. సొంత స్థలాలు ఉన్నవారిని ఎల్–1గా, సొంత స్థలం, ఇల్లు లేని వారిని ఎల్–2గా, ఇతరులను ఎల్–3గా గుర్తించారు. ఆ వివరాలు మండల పరిధిలో ఎంపీడీఓ, మున్సిపాలిటీలో కమిషనర్ల లాగిన్‌కు చేరాయి. ఇలా తొలి విడత పరిశీలన పూర్తికాగా.. ఇప్పుడు ఎల్–1 జాబితాను రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ జాబితాలో 56,486 మంది దరఖాస్తుదారులు ఉన్నారు.
మండలానికి నాలుగైదు బృందాలు..
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పునఃపరిశీలన కోసం ఒక్కో మండలానికి నాలుగైదు బృందాలను ఏర్పాటు చేశారు. ఎల్–1 జాబితాలో ఉండాల్సిన తమ పేర్లను ఎల్–2, ఎల్–3లో చేర్చారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇలాంటి దరఖాస్తుదారుల వివరాలు సైతం ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ల లాగిన్‌కు వెళ్లాయి. మండలాల వారీగా ఏర్పాటు చేసిన బృందాలు.. ఈ ఫిర్యాదులపై కూడా పునఃపరిశీలన చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 850 మంది అర్హులను మినహాయించి.. మిగతా వారి ఇళ్లకు వెళ్లి రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు.
పైలెట్ గ్రామాల్లో నిర్మాణాలు..
జిల్లాలోని 20 పైలెట్ గ్రామపంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. బిజినేపల్లి మండలం అల్లాపూర్‌లో ఇద్దరు, చారకొండ మండలం గోకారంలో ఇద్దరు, వంగూరు మండలం మిట్టసదగోడులో ముగ్గురు, కల్వకుర్తి మండలం రంగాపూర్‌లో ఐదుగురు, బల్మూర్ మండలం జిన్‌కుంటలో నాలుగు, ఊర్కొండ మండలం నర్పంపల్లిలో ఒకటి, ఉప్పనుంతల మండలం మొల్గరలో ఒకరు.. మొత్తం 18 మంది ఇళ్ల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇంకా 13 పైలెట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలకు పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో జియో ఫెన్సింగ్ చేశారు. ఇళ్లకు ముగ్గు పోసుకున్న ప్రాంతం ఫొటోలు, అక్షాంశ రేఖాంశాల ఆధారంగా వివరాలను ప్రత్యేక యాప్‌లో నిక్షిప్తం చేశారు. తదుపరి తనిఖీలకి వచ్చినప్పుడు అదే ప్రాంతంలో నిర్మాణం ఉండాలి. చోటు మారితే జియో ఫెన్సింగ్ ఆధారంగా సులభంగా గుర్తిస్తారు. ఆ నిర్మాణ ఫొటో యాప్‌లో క్యాప్చర్ కాదు. దీంతో ఇంటి స్థలాన్ని మార్చినట్టుగా అధికారులు గుర్తించి.. లబ్ధిదారులను అనర్హత జాబితాలోకి మార్చి ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తారు. ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టిన లబ్ధిదారులకు తొలి విడత ఆర్థిక సాయాన్ని ఈ నెల 15 నాటికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. కొంత అలస్యమైంది. రెండు, మూడు రోజుల్లో ఇంటి నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థికసాయం జమ చేయనున్నట్లు గృహనిర్మాణశాఖ అధికారులు వెల్లడించారు.
స్థలం ఉండి పక్కా ఇల్లు లేని వారు (ఎల్–1): 56,486
ఇంటి స్థలం, ఇల్లు లేని వారు (ఎల్–2): 15,812
పక్కా ఇళ్లు
కలిగిన వారు:
1,29,392
జిల్లాలో
దరఖాస్తులు:
2,33,124
ఇతరులు
(ఎల్–3) :
31,434
ఒక్కో నియోజకవర్గానికి
మంజూరు చేసిన ఇళ్లు:
3,500
ఎట్టకేలకు మోక్షం..
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం మొదలుపెడతామని ఎన్నికల ప్రచారంలో పార్టీ చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన 16నెలల తర్వాత గాని ఇళ్ల నిర్మాణాలు మొదలుకాలేదు. లబ్ధిదారుల గుర్తింపులో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఏడాది క్రితం దరఖాస్తులు అందితే అర్హులను తేల్చి.. గ్రామసభల ద్వారా జాబితా రూపొందించడానికి ఏడాది సమయం పట్టింది. ఐదేళ్లలో సంవత్సరానికి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. తొలి ఏడాది ఎలాంటి పురోగతి లేకుండా గడిచిపోయింది.

అర్హుల గుర్తింపు షురూ

అర్హుల గుర్తింపు షురూ