నాగర్‌కర్నూల్: సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన పరిహాసంగా మారింది. ధాన్యం కొనుగోలు చేసి దాదాపు రెండు నెలలు గడిచిపోయినా ఇప్పటి వరకు సన్నాలకు సంబంధించి రైతుల ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆమాట నిలబెట్టుకోవడం లేదు. సన్నరకం పండించిన రైతులందరికీ క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాల్సి ఉంది. దీంతో సీజన్ ముందే వరి సాగు చేస్తే బోనస్ చెల్లిస్తామని ప్రకటించడంతో రైతులు సన్నాల సాగుకు మొగ్గు చూపారు. అయితే కొనుగోళ్లు ముగిసి దాదాపు రెండు నెలల పైబడినా పూర్తిస్థాయిలో బోనస్ జమ కాపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయాలంటే రైతులు ఎక్కువ శాతం సన్నబియ్యాన్ని సాగు చేయాల్సి ఉంటుంది. అందుకే సన్నబియ్యం సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించింది.
బోనస్ డబ్బులు రాలేదు
నాకున్న కొద్దిపాటి పొలంలో 10 క్వింటాళ్ల సన్నరకం వడ్లు పండించాను. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు సంబంధించి డబ్బులు పడ్డాయి. కానీ, ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులు పడలేదు. క్వింటాల్‌కు రూ.500 చొప్పున రూ.5 వేల బోనస్ రావాల్సి ఉంది.
– మనోహర్‌రెడ్డి, రైతు,
అప్పాజిపల్లి, తిమ్మాజిపేట
ప్రభుత్వం నుంచే రావాలి
జిల్లాలో సన్నాలకు సంబంధించి బోనస్ డబ్బులు రైతులకు ఇంకా రూ.7.19 కోట్లు రావాల్సి ఉంది. రైతుల వివరాలన్నీ ఉన్నతాధికారులకు అప్పట్లోనే పంపించడం జరిగింది. పైనుంచే నిధులు జమచేస్తారు.
– శ్రీనివాస్, డీఎస్‌ఓ
రెండు నెలలైనా జమ చేయని ప్రభుత్వం
త్వరగా చెల్లించాలని రైతుల వేడుకోలు
సన్నాలకు బోనస్ ఎప్పుడో..?


