
సెలవు దినంగా ప్రకటించాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌సాగర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన జీవితాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పోరాటయోధుడు మహాత్మ జ్యోతిరావుపూలే అని, భార్య సావిత్రిబాయితో కలిసి దేశంలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. అలాంటి మహానుభావుని జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి కార్యక్రమాలు నిర్వహించి అతని గొప్పతనాన్ని అందరికీ తెలియజేసే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు. రిటైర్డ్ డీఈఓ విజయ్‌కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావుపూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో సత్యశోధక్ అనే సంస్థను ఏర్పాటు చేసి అన్ని కులాలు, మతాలను భాగస్వామ్యం చేసి అణగారిన వర్గాల పక్షాన పోరాటం చేసిన మహాయోధుడు అన్నారు. ఆ మహానీయుని జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ప్రముఖ కవి భీంపల్లి శ్రీకాంత్, రమేష్‌గౌడ్, డాక్టర్ ఎంఎస్ విజయ్‌కుమార్, సారంగి లక్ష్మీకాంత్, బుగ్గన్న, అశ్విని సత్యం, మహేష్‌గౌడ్, నరహరి తదితరులు పాల్గొన్నారు.