నాగర్‌కర్నూల్ రూరల్: రైతు సమస్యల పరిష్కారమే ఎజెండాగా రాష్ట్ర రైతు సంఘం ఆవిర్భవించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని లక్ష్మణాచారి భవన్ వద్ద నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా మూడో మహాసభలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులను రక్షించుకుందాం.. వ్యవసాయాన్ని పరిరక్షించుకుందాం.. గ్రామాలను కాపాడుకుందాం.. అంటూనే దేశానికి అన్నం పెట్టే రైతుకు పాలకులు సున్నం పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిన బీజేపీ ప్రభుత్వం రైతుల పోరాటాల వల్లే వాటిని వెనక్కి తీసుకుందని గుర్తుచేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయాలని, అలాగే రైతు భరోసా అందరికీ అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కేశవులుగౌడ్, వెంకటయ్య, కృష్ణాజీ, బాలమురళి, రవీందర్, శ్రీను, భరత్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.