
ఎల్‌ఆర్‌ఎస్.. తిరకాసు!
ఫీజు చెల్లించేందుకు వెళ్తే నిషేధిత జాబితాలో ఉన్నట్లు వెల్లడి
● అధికారుల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు
● రుసుము, ఇతరత్రా సమస్యలతో సతమతం
● దరఖాస్తుల అప్‌లోడ్‌లో శాఖల మధ్య కొరవడిన సమస్వయం
కల్వకుర్తి టౌన్: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) ప్రజలకు మంచి చేస్తుందని అనుకుంటే.. ఇప్పుడు అదే వారికి గుదిబండగా మారింది. అనధికార లే అవుట్‌లు చేసి ప్రజలకు అంటగట్టిన వెంచర్ల యజమానులు బాగానే ఉండగా.. వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. రూ.1000 రుసుముతో 2020లో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25శాతం రాయితీతో రెగ్యులరైజ్ చేసేందుకు అనుమతి ఇచ్చినా.. అధికారుల సమన్వయ లోపంతో ఇబ్బందులు తప్పడం లేదు. మున్సిపాలిటీల్లో హెల్ప్‌డెస్క్‌లు, గ్రామపంచాయతీల్లో ఎల్‌ఆర్‌ఎస్ సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా.. అది ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అనేక సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయి.
భారీగా షార్ట్‌ఫాల్ దరఖాస్తులు..
ఎల్‌ఆర్‌ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో 20–30 శాతం వరకు మాత్రమే క్లియర్ చేశారు. వాటిలో పేమెంట్ చేస్తున్న, పేమెంట్ జనరేట్ కాని వారి వివరాలన్నీ షార్ట్‌ఫాల్‌లో కనిపిస్తూ.. డాక్యుమెంట్లను మళ్లీ అప్‌లోడ్ చేయాలని ఆన్‌లైన్‌లో చూయిస్తుంది. అయితే ఎలాంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలనే వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్‌డెస్క్‌లకు వెళ్లే ప్రజలకు నిరాశే ఎదురవుతుంది. అక్కడి అధికారులు ఇష్టం వచ్చినట్టుగా చెబుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసిన షార్ట్‌ఫాల్ దరఖాస్తుదారులకు పేమెంట్‌కు సంబంధించిన వివరాలు ఎల్–1 లెవల్‌లో ఎప్పుడు వస్తాయో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే, కొందరు దరఖాస్తులను నింపే సమయంలో వారి ప్లాటులో ఉన్న గజాలను తక్కువగా ఎంటర్ చేయడం.. ఇతరత్రా సమస్యలకు పరిష్కారం లభించడం గగనంగా మారింది.
కొరవడిన సమన్వయం..
ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియకు సంబంధించి మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. నిషేధిత జాబితాలో ఉన్నట్లు కనిపిస్తున్న సర్వే నంబర్లకు సంబంధించి దరఖాస్తుదారులు హెల్ప్‌డెస్క్‌లో సంప్రదిస్తే.. సదరు సర్వే నంబర్ నిషేధిత జాబితాలో లేదని రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి లెటర్ తీసుకురావాలని సూచిస్తున్నారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దరఖాస్తుదారులు సంప్రదిస్తే.. మున్సిపాలిటీ నుంచి సంబంధిత సర్వే నంబర్ ఎఫ్‌టీఎల్/బఫర్ జోన్‌లో లేనట్టుగా ధృవీకరణ పత్రం తీసుకురావాలని చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో పాటు ఇరిగేషన్ శాఖలో అసలు ఎఫ్‌టీఎల్/బఫర్ జోన్‌కు సంబంధించిన పలు వివరాలు లేకపోవటం ప్రజలకు మరో శాపంగా మారింది. అధికారులు మాత్రం పేమెంట్ చేయడానికి వచ్చిన వారి దరఖాస్తులను మాత్రమే క్లియర్ చేస్తూ కార్యాలయాలకే పరిమితయ్యారు. మిగతా దరఖాస్తులకు మోక్షం లభించక ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారుల ఫోన్ నంబర్‌కు ఎలాంటి సమాచారం రావడం లేదు. ఆన్‌లైన్‌లో చెక్ చేస్తేనే దరఖాస్తు స్థితి తెలుస్తుంది. దరఖాస్తు రుసుములో చాలా మంది కేవలం రెగ్యులరైజేషన్ ఫీజు మాత్రమే చెల్లిస్తున్నారు. ఓపెస్ స్పేస్ చార్జీలను చెల్లించడానికి చాలా మంది వెనకాడుతున్నారు. అందుకు సంబంధించి ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించడం లేదు. రెగ్యులరైజేషన్ చార్జీలను ప్రస్తుతం 25 శాతం రాయితీతో చెల్లిస్తున్నా.. 14శాతం ఓపెన్ స్పేస్ చార్జీలను ఎప్పుడు చెల్లిస్తారో అప్పటి మార్కెట్ విలువ ప్రకారం చెల్లించాల్సి ఉంటుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు ఇలా..
ఆన్‌లైన్‌లో చెక్ చేస్తేనే..
కల్వకుర్తి మున్సిపాలిటీలోని 55వ సర్వే నంబర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన పలువురు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ప్రారంభమయ్యాక అదే సర్వే నంబర్‌లో మున్సిపల్ అధికారులు భవన నిర్మాణ అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించేందుకు వెళ్తే.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ కింద ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంచారు. భవన నిర్మాణ అనుమతుల సమయంలో అధికారులకు కనపడని నిషేధిత జాబితా.. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో కనిపించింది. ఇలా చాలా సర్వే
నంబర్లలో ఇదే పరిస్థితి నెలకొంది.
అనుమతులు ఎలా వచ్చాయి..
మున్సిపాలిటీలో చాలా చోట్ల ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో ఉంచిన సర్వే నంబర్లలో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇంటి నిర్మాణ అనుమతులు ఎలా ఇచ్చారో అధికారులకే తెలియాలి. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు మాత్రం ప్రొహిబిటెడ్ చూయించడం ఎంటో అర్థం కావడం లేదు. మున్సిపాలిటీలోని హెల్ప్‌డెస్క్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌పై అసంపూర్తిగా సమాచారం అందిస్తున్నారు.
– మజహర్, సుభాష్‌నగర్, కల్వకుర్తి
ఇబ్బందులు లేకుండా చూస్తాం
ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హెల్ప్‌డెస్క్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాం. షార్ట్‌ఫాల్ దరఖాస్తుల విషయంలో సదరు దరఖాస్తుదారులకు మళ్లీ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలని సూచిస్తున్నాం. పేమెంట్ విషయంలో రెగ్యులరైజేషన్ ఫీజులు మాత్రమే కాకుండా, మొత్తం ఫీజు చెల్లిస్తేనే ప్రజలకు మేలు. శాఖల మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదు. – మహమూద్ షేక్,
మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి

ఎల్‌ఆర్‌ఎస్.. తిరకాసు!

ఎల్‌ఆర్‌ఎస్.. తిరకాసు!