
‘పది’ పరీక్షలకు 99.76 శాతం హాజరు
కందనూలు: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన గణితం పరీక్షకు 10,560 మంది విద్యార్థులకు గాను 10,535 మంది హాజరు కాగా.. 25 మంది గైర్హాజయ్యారు. 99.76 శాతం హాజరు నమోదైనట్లు డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. కాగా, పరీక్షల నిర్వహణపై ప్రాంతీయ విద్యాశాఖ సంచాలకులు, జిల్లా పరిశీలకురాలు విజయలక్ష్మి చీఫ్ సూపరింటెండెంట్లతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడంలో సీఎస్‌లదే కీలక పాత్రని.. ఉదాసీనతకు వీల్లేదన్నారు. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష హాల్‌లోకి పంపించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఏమాత్ర నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతకుముందు జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు డీఈఓ రమేష్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్‌రావు తనిఖీ చేశారు.
పకడ్బందీగా మూల్యాంకనం..
పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం, కోడింగ్ ప్రక్రియ అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ రమేష్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన మూల్యాంకనం కేంద్రానికి వివిధ జిల్లాల నుంచి చేరిన జవాబు పత్రాలను పరిశీలించారు. అనంతరం కోడింగ్, సహాయ కోడింగ్ అధికారులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. మూల్యాంకనం కంటే ముందు నిర్వహించే కోడింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. జవాబు పత్రాలపై విద్యార్థి వివరాలను తీసివేసి.. కోడింగ్, మూల్యాంకనం అనంతరం ఆ విద్యార్థి వివరాలను జవాబు పత్రాలపై ఉంచే ప్రక్రియ కీలకమైనదని అన్నారు. కోడింగ్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు నిబద్ధతతో పనిచేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్‌రావు, నాగరాజు, కుర్మయ్య, లత, కృష్ణారెడ్డి, వెంకటయ్య, సత్యనారాయణరెడ్డి, పాండు పాల్గొన్నారు.