కల్వకుర్తి టౌన్: డిపో పరిధిలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా డీఎం సుభాషిణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని ప్రజలు, ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ సలహాలు, సూచనలు ఉంటే తెలియజేయాలని ఆమె కోరారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు కార్యక్రమం ఉంటుందని, సెల్ నం.99592 26292కు ఫోన్ చేయాలని సూచించారు.
జైలులో ఖైదీలకు
వసతులు కల్పించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: సబ్‌జైలులో ఖైదీలకు మెరుగైన సేవలు అందించడంతోపాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సబిత అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని సబ్‌జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. జైలు పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఖైదీలకు వండే ఆహార పదార్థాలు, వంట గదిని పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడుతూ న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవారికి, ఆర్థిక స్తోమత లేని వారికి ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని, పిల్లలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు సంవత్సర ఆదాయం రూ.3 లక్షలలోపు ఉన్నవారికి ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జైల్ సూపరింటెండెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు శనివారం ముగియనున్నాయి. గురువారం జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 5,996 మంది విద్యార్థులకు గాను 5,786 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 4,842 మందికి 4,674 మంది, ఒకేషనల్ విభాగంలో 1,154 మందికి 1,115 మంది హాజరై పరీక్షలు రాశారు. ఆయా విభాగాల్లో 207 మంది గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో జిల్లాకేంద్రంలోని పద్మావతి, రవితేజ, గీతాంజలి జూనియర్ కళాశాలల్లో పరీక్షల విధానాన్ని డీఐఈఓ వెంకటరమణ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరి రోజు పరీక్ష రాసిన అనంతరం కేంద్రం నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ.. కేరింతలు కొడుతూ.. విజయ సూచిక చూపుతూ వెళ్లిపోయారు.
నేడు డయల్ యువర్ డీఎం