సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గద్వాలలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు కాంగ్రెస్‌లో అలజడిని సృష్టిస్తున్నాయి. గద్వాల జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మధ్య వర్గ పోరు ఆ పార్టీని అతలాకుతలం చేస్తోంది. ఇటీవల ప్రాజెక్ట్‌ల సందర్శనలో సరిత వర్గీయులు మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై ‘హస్తం’లో దుమారం చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లగా.. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే ఇలా చేయడం ఏమిటంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాల క్రమంలో బండ్లపై ఆయన వర్గీయుల్లో అసంతృప్తి నెలకొంది.
తొలి నుంచీ వైరం.. పై‘చేయి’ కోసం..
బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు సరిత, బండ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం తారస్థాయికి చేరింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న సరిత గులాబీ టికెట్ ఆశించగా నిరాశ ఎదురైంది. దీంతో కాంగ్రెస్‌లో చేరిన ఆమె గద్వాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి బండ్ల చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పరిణామ క్రమంలో కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఇరువురి మధ్య మళ్లీ పోరు తారస్థాయికి చేరింది. ఆయన చేరికను చివరి వరకు అడ్డుకోగా.. అధిష్టానం నచ్చజెప్పడంతో ఆమె వెనక్కి తగ్గారు. అయినా పార్టీలో బండ్ల చేరిక కార్యక్రమానికి ఆమె దూరంగానే ఉన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ పదవీ కాలం ముగిసినా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో తన ఆధిపత్యం ప్రదర్శించేలా సరిత, ఆమె వర్గీయులు ముందుకు సాగుతుండడంతో పార్టీలో చేరిన ఎమ్మెల్యే బండ్ల సైతం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
భేటీలోనూ ఘాటు సంభాషణ..?
జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి ఇటీవల గద్వాల నియోజకవర్గానికి వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా ఆయన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఇరువురు కలిసి ప్రాజెక్ట్‌లను సందర్శించేందుకు వెళ్తున్న క్రమంలో సరిత ఇంటికి వెళ్లకుండా ఎలా వెళ్తారని ఆమె వర్గీయులు మంత్రి వాహనాన్ని అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మంత్రి చేసేదేమీ లేక సరిత ఇంటికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. ఏ సందర్భంలో రావడం జరిగిందో సరితకు మంత్రి వివరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేరిక నేపథ్యంపై పాత దోస్తాన్‌తో పార్టీలోకి తీసుకొచ్చారనే అంశం చర్చకు రాగా.. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరిగిందని మంత్రి సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య సంభాషణ ఘాటుగానే సాగినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment