బుధవారం జడ్చర్లలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ. చిత్రంలో రేవంత్, భట్టి, ఉత్తమ్, మాణిక్‌రావ్ ఠాక్రే, వంశీచంద్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ / సాక్షి, నాగర్‌కర్నూల్/కల్వకుర్తి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఓబీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. దేశంలో 50 శాతానికి పైగా ఉన్న ఓబీసీలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారని తెలిపారు. అయితే దేశంలో ఎంతమంది ఓబీసీలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఉన్నారో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.
బీజేపీ పాలనలో దేశాన్ని నడిపించేది లోక్‌సభ, రాజ్యసభలోని ఎంపీలు కాదని, కేవలం 90 మంది అధికారుల చేతుల్లోనే ఈ ప్రభుత్వం ఉందని చెప్పారు. వీరిలో ముగ్గురు మాత్రమే ఓబీసీలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఓబీసీ అధికారులకు తగిన ప్రాధాన్యత లేదని.. ఓబీసీలకు శక్తి ఇవ్వడానికి బీజేపీ, బీఆర్‌ఎస్ ఇష్టపడవంటూ మండిపడ్డారు. దేశాన్ని నడిపించే అవకాశం ఓబీసీ, దళిత, గిరిజన, మైనార్టీలకు రాకూడదా? అని ప్రశ్నించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ విజయ భేరి బహిరంగ సభతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో, సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో ఆయన మాట్లాడారు.
మోదీ, కేసీఆర్‌లు ఉలిక్కిపడేలా చేశా..
‘దేశంలో, రాష్ట్రాల్లో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ విద్వేషాలను పెంచాయి. వీటికి ఎక్కడా స్థానం లేదు. అందుకే నేను ప్రేమ, ఆప్యాయతలు పెంచేలా దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేశా. ఒక బజార్‌లో నేను ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచా. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఓ వైపు దొరలు, కేసీఆర్, కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు.. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒకటిగా కలిసి పనిచేస్తున్నాయి. ఎక్కడైనా కాంగ్రెస్ పోటీ చేస్తే అక్కడ ఎంఐఎం అభ్యర్థులు ప్రత్యక్షమవుతారు. వారికి బీజేపీ నేతలే డబ్బులు పంపుతారు.
కాళేశ్వరంలో కేసీఆర్ దోచుకున్న సొమ్ము కూడా ఆయా రాష్ట్రాల్లోని అభ్యర్థులకు చేరుతోంది. విపక్ష నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయి. సీఎం కేసీఆర్‌పై మాత్రం ఏ దాడులూ ఉండవు. ఇదెందుకో గ్రహించాలి. ప్రధాని మోదీ నన్ను రోజూ తిడుతూనే ఉంటారు. ఆయనతో యుద్ధం చేస్తున్నా. 24 గంటలు తిట్టేలా కదిలించా. నాపై 24 కేసులు పెట్టారు.. నా లోక్‌సభ సభ్వత్వాన్ని రద్దు చేశారు.. ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కూడా లాక్కున్నారు. అయినా నేను భయపడలేదు. యావత్ హిందుస్తాన్, తెలంగాణే నా ఇల్లు.. అవసరమైతే కోట్లాది మంది ప్రజలే నన్ను అక్కున చేర్చుకుంటారు. కేసీఆర్ కూడా ప్రతి క్షణం ఉలిక్కి పడేలా చేశా. నా పేరు వినపడితే చాలు.. నిద్రలోనూ ఉలిక్కిపడుతున్నారు..’ అని రాహుల్ అన్నారు.
ఒక్క ప్రాజెక్టు కూడా సరిగ్గా కట్టలేదు
‘రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచారు. లక్ష కోట్ల సొమ్మును సీఎం కేసీఆర్ పేదల జేబు నుంచి లాక్కొని కనీసం ఒక్కదానిని కూడా సరిగ్గా కట్టలేదు. కుంగిపోయిన కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణాన్ని సీఎం సమీక్షించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఒక రాజులా పేదలపై పెత్తనం చెలాయిస్తున్నారు. మంత్రిత్వ శాఖల్లో ఎక్కువ డబ్బులు వచ్చే మద్యం, ఇసుక, భూమి వంటి వాటిని కేసీఆర్ కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి తప్ప ప్రజలకు లాభం జరగలేదు. అందుకే ప్రజలంతా కేసీఆర్‌కు బైబై అంటున్నారు. కేసీఆర్ దోచిన సొమ్ము కక్కించి ప్రతి పైసా పేదల ఖాతాల్లో వేస్తాం. నేను ప్రధాని మోదీలా కాదు. ఆయనలా మాట తప్పను. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తాం..’ అని చెప్పారు.
ప్రతి ఎకరా తిరిగి పేదలకు పంచుతాం..
‘భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో తీసుకొచ్చిన ధరణి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కేసీఆర్ కుటుంబం, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లక్ష ఎకరాలు మాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఎకరాను తిరిగి స్వా«దీనం చేసుకుంటాం. ఆ భూములను మళ్లీ పేదలకు పంచి పెడతాం. పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేస్తాం..’ అని హామీ ఇచ్చారు.
కేవలం 2% ఓట్లతో ఓబీసీని సీఎం ఎలా చేస్తారు?
‘తెలంగాణలో బీజేపీ లీడర్లు భుజాలు ఎగిరేసి తిరిగేటోళ్లు. కాంగ్రెస్ పార్టీ వాళ్ల గ్యాస్ తీసేసింది. కారు నాలుగు టైర్లను పంక్చర్ చేసింది. రాష్ట్రంలో ఓబీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ చెబుతోంది. కేవలం 2 శాతం ఓట్లతో సీఎంని ఎలా చేస్తారు. మోదీ అమెరికా వెళ్లి ఓబీసీని ప్రెసిడెంట్ చేస్తామని చెప్పినట్టుగా ఉంది. అమెరికాలో ఓబీసీ ప్రెసిడెంట్‌ను, ఇక్కడ మీరు.. సీఎంను ఏర్పాటు చేయలేరు..’ అని రాహుల్ ఎద్దేవా చేశారు.
మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి: రేవంత్
రాష్ట్రంలో అభివృద్ధితో పాటు మార్పు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు మింగి కాళేశ్వరం ప్రాజెక్టు సరిగా కట్టలేకపోయారని ఆరోపించారు. మొన్న మేడిగడ్డ కుంగితే, నిన్న సుందిళ్ల పగుళ్లు బారిందని అన్నారు. పని మంతుడు పందిరేస్తే, కుక్క తోక తగిలి కూలిపోయినట్టుగా సీఎం కేసీఆర్ పనితీరు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి లక్షలాది ఎకరాలకు నీరందించింది కాంగ్రెస్సేనని చెప్పారు.
జన గణనతోనే బీసీల అభివృద్ధి: భట్టి
నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కన్నీళ్లే మిగిలాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీసీల జనగణన జరిగితేనే బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఇంటికీ చేర్చాలని, భూసంస్కరణలు తీసుకొచ్చి పేదలకు భూములు పంచిన కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
సభల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మల్లురవి, పార్టీ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, అనిరుధ్‌రెడ్డి, జి. మధుసూదన్‌రెడ్డి, వీర్లశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన కల్వకుర్తి మండలం జిల్లెలకి చెందిన రైతు చంద్రయ్య కుటుంబసభ్యులను రాహుల్ పరామర్శించారు. చంద్రయ్య భార్య తిరుపతమ్మ, కొడుకు నితిన్‌తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందంటూ ధైర్యం చెప్పారు.
నేడు అంబట్‌పల్లిలో 5వేల మంది మహిళలతో సభ
రాహుల్ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లికి రానున్నారు. ఇక్కడ 5 వేల మంది మహిళలతో మహిళా సాధికారతపై సభ నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ బ్యారేజీ)లో పియర్లు కుంగిన ప్రాంతాన్ని కూడా రాహుల్ సందర్శించనున్నారు. దాదాపు మూడు గంటలపాటు అక్కడ ఉంటారని సమాచారం. కాగా హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం కాంగ్రెస్ చేసిన విజŠక్షప్తి మేరకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారు.
రాహుల్‌తో నేతల భేటీ
బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్‌లో కాంగ్రెస్ కీలక నేతలు పలువురు రాహుల్‌తో సమావేశమయ్యారు. రేవంత్, భట్టితో పాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య, షబ్బీర్ అలీ తదితరులు వీరిలో ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌కు చెందిన సుమారు రెండొందల మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment