kalvakurthi
-
Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ (ఫోటోలు)
-
అధికారంలోకి రాగానే ఓబీసీ గణన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ / సాక్షి, నాగర్‌కర్నూల్/కల్వకుర్తి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఓబీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. దేశంలో 50 శాతానికి పైగా ఉన్న ఓబీసీలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారని తెలిపారు. అయితే దేశంలో ఎంతమంది ఓబీసీలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఉన్నారో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. బీజేపీ పాలనలో దేశాన్ని నడిపించేది లోక్‌సభ, రాజ్యసభలోని ఎంపీలు కాదని, కేవలం 90 మంది అధికారుల చేతుల్లోనే ఈ ప్రభుత్వం ఉందని చెప్పారు. వీరిలో ముగ్గురు మాత్రమే ఓబీసీలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఓబీసీ అధికారులకు తగిన ప్రాధాన్యత లేదని.. ఓబీసీలకు శక్తి ఇవ్వడానికి బీజేపీ, బీఆర్ఎస్ ఇష్టపడవంటూ మండిపడ్డారు. దేశాన్ని నడిపించే అవకాశం ఓబీసీ, దళిత, గిరిజన, మైనార్టీలకు రాకూడదా? అని ప్రశ్నించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ విజయ భేరి బహిరంగ సభతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో, సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో ఆయన మాట్లాడారు. మోదీ, కేసీఆర్‌లు ఉలిక్కిపడేలా చేశా.. ‘దేశంలో, రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ విద్వేషాలను పెంచాయి. వీటికి ఎక్కడా స్థానం లేదు. అందుకే నేను ప్రేమ, ఆప్యాయతలు పెంచేలా దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేశా. ఒక బజార్లో నేను ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచా. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఓ వైపు దొరలు, కేసీఆర్, కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు.. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒకటిగా కలిసి పనిచేస్తున్నాయి. ఎక్కడైనా కాంగ్రెస్ పోటీ చేస్తే అక్కడ ఎంఐఎం అభ్యర్థులు ప్రత్యక్షమవుతారు. వారికి బీజేపీ నేతలే డబ్బులు పంపుతారు. కాళేశ్వరంలో కేసీఆర్ దోచుకున్న సొమ్ము కూడా ఆయా రాష్ట్రాల్లోని అభ్యర్థులకు చేరుతోంది. విపక్ష నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయి. సీఎం కేసీఆర్‌పై మాత్రం ఏ దాడులూ ఉండవు. ఇదెందుకో గ్రహించాలి. ప్రధాని మోదీ నన్ను రోజూ తిడుతూనే ఉంటారు. ఆయనతో యుద్ధం చేస్తున్నా. 24 గంటలు తిట్టేలా కదిలించా. నాపై 24 కేసులు పెట్టారు.. నా లోక్‌సభ సభ్వత్వాన్ని రద్దు చేశారు.. ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కూడా లాక్కున్నారు. అయినా నేను భయపడలేదు. యావత్ హిందుస్తాన్, తెలంగాణే నా ఇల్లు.. అవసరమైతే కోట్లాది మంది ప్రజలే నన్ను అక్కున చేర్చుకుంటారు. కేసీఆర్ కూడా ప్రతి క్షణం ఉలిక్కి పడేలా చేశా. నా పేరు వినపడితే చాలు.. నిద్రలోనూ ఉలిక్కిపడుతున్నారు..’ అని రాహుల్ అన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా సరిగ్గా కట్టలేదు ‘రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచారు. లక్ష కోట్ల సొమ్మును సీఎం కేసీఆర్ పేదల జేబు నుంచి లాక్కొని కనీసం ఒక్కదానిని కూడా సరిగ్గా కట్టలేదు. కుంగిపోయిన కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణాన్ని సీఎం సమీక్షించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఒక రాజులా పేదలపై పెత్తనం చెలాయిస్తున్నారు. మంత్రిత్వ శాఖల్లో ఎక్కువ డబ్బులు వచ్చే మద్యం, ఇసుక, భూమి వంటి వాటిని కేసీఆర్ కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి తప్ప ప్రజలకు లాభం జరగలేదు. అందుకే ప్రజలంతా కేసీఆర్‌కు బైబై అంటున్నారు. కేసీఆర్ దోచిన సొమ్ము కక్కించి ప్రతి పైసా పేదల ఖాతాల్లో వేస్తాం. నేను ప్రధాని మోదీలా కాదు. ఆయనలా మాట తప్పను. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తాం..’ అని చెప్పారు. ప్రతి ఎకరా తిరిగి పేదలకు పంచుతాం.. ‘భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో తీసుకొచ్చిన ధరణి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష ఎకరాలు మాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఎకరాను తిరిగి స్వా«దీనం చేసుకుంటాం. ఆ భూములను మళ్లీ పేదలకు పంచి పెడతాం. పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేస్తాం..’ అని హామీ ఇచ్చారు. కేవలం 2% ఓట్లతో ఓబీసీని సీఎం ఎలా చేస్తారు? ‘తెలంగాణలో బీజేపీ లీడర్లు భుజాలు ఎగిరేసి తిరిగేటోళ్లు. కాంగ్రెస్ పార్టీ వాళ్ల గ్యాస్ తీసేసింది. కారు నాలుగు టైర్లను పంక్చర్ చేసింది. రాష్ట్రంలో ఓబీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ చెబుతోంది. కేవలం 2 శాతం ఓట్లతో సీఎంని ఎలా చేస్తారు. మోదీ అమెరికా వెళ్లి ఓబీసీని ప్రెసిడెంట్ చేస్తామని చెప్పినట్టుగా ఉంది. అమెరికాలో ఓబీసీ ప్రెసిడెంట్‌ను, ఇక్కడ మీరు.. సీఎంను ఏర్పాటు చేయలేరు..’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి: రేవంత్ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు మార్పు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు మింగి కాళేశ్వరం ప్రాజెక్టు సరిగా కట్టలేకపోయారని ఆరోపించారు. మొన్న మేడిగడ్డ కుంగితే, నిన్న సుందిళ్ల పగుళ్లు బారిందని అన్నారు. పని మంతుడు పందిరేస్తే, కుక్క తోక తగిలి కూలిపోయినట్టుగా సీఎం కేసీఆర్ పనితీరు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి లక్షలాది ఎకరాలకు నీరందించింది కాంగ్రెస్సేనని చెప్పారు. జన గణనతోనే బీసీల అభివృద్ధి: భట్టి నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కన్నీళ్లే మిగిలాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీసీల జనగణన జరిగితేనే బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఇంటికీ చేర్చాలని, భూసంస్కరణలు తీసుకొచ్చి పేదలకు భూములు పంచిన కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సభల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మల్లురవి, పార్టీ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, అనిరుధ్‌రెడ్డి, జి. మధుసూదన్‌రెడ్డి, వీర్లశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన కల్వకుర్తి మండలం జిల్లెలకి చెందిన రైతు చంద్రయ్య కుటుంబసభ్యులను రాహుల్ పరామర్శించారు. చంద్రయ్య భార్య తిరుపతమ్మ, కొడుకు నితిన్‌తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందంటూ ధైర్యం చెప్పారు. నేడు అంబట్పల్లిలో 5వేల మంది మహిళలతో సభ రాహుల్ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లికి రానున్నారు. ఇక్కడ 5 వేల మంది మహిళలతో మహిళా సాధికారతపై సభ నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ బ్యారేజీ)లో పియర్లు కుంగిన ప్రాంతాన్ని కూడా రాహుల్ సందర్శించనున్నారు. దాదాపు మూడు గంటలపాటు అక్కడ ఉంటారని సమాచారం. కాగా హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం కాంగ్రెస్ చేసిన విజŠక్షప్తి మేరకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారు. రాహుల్‌తో నేతల భేటీ బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ కీలక నేతలు పలువురు రాహుల్‌తో సమావేశమయ్యారు. రేవంత్, భట్టితో పాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య, షబ్బీర్ అలీ తదితరులు వీరిలో ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గం బీఆర్ఎస్కు చెందిన సుమారు రెండొందల మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. -
రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ బలపడదు
సాక్షి, హైదరాబాద్: రేవంత్ నాయక త్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాదని,, ఆ పార్టీని వీడి వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేసిన కల్వకుర్తికి చెందిన యువనేత చీమర్ల అర్జున్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో తన అనుచరులతో కలిసి చీమర్ల అర్జున్ రెడ్డి పార్టీలో చేరారు. ఆయనకు షర్మిల కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అర్జున్‌రెడ్డి మాట్లాడుతూ.. మొదట పాలేరు.. ఆ తర్వాత కుల్వకుర్తిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని అర్జున్ రెడ్డి జోస్యం చెప్పారు. చదవండి: కాంగ్రెస్‌లోకి చెరుకు సుధాకర్.. మునుగోడు కోసమేనా? -
స్థల వివాదం; వెంటాడి.. వివస్త్రను చేసి
సాక్షి, కల్వకుర్తి: ఇంటి స్థలవివాదంలో కొందరు ఓ మహిళపై దాడికి పాల్పడి వివస్త్రను చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జేపీనగర్ తండాలోని ఓ ప్లాట్‌లో ఇటీవల ఓ మహిళ ఇంటి నిర్మాణం చేపట్టింది. వివాదాస్పదస్థలంలో నిర్మాణం వద్దంటూ తండావాసులు అభ్యంతరం చెప్పగా ఆమె మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసింది. వారి అనుమతితో తిరిగి ఇంటి నిర్మాణం కొనసాగించింది. ఈ నెల 9న మళ్లీ తండావాసులు వచ్చి అడ్డుకోబోగా ఓ వ్యక్తితో ఆమె వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే 10వ తేదీ మధ్యాహ్నం పలువురు మహిళలు ఆమె ఇంటికి వెళ్లి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారిని విడిపించేందుకు విఫలయత్నం చేశారు. బాధితురాలిని బైక్‌పై వేరేచోటుకు తరలిస్తుండగా పలువురు తండావాసులు వెంబడించి వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులు ఆమెను రక్షించి ఇంటికి పంపారు. ప్రస్తుతం తండాలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనలో ఇరువర్గాలపై వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ మహేందర్ తెలిపారు. చదవండి: క్షుద్ర పూజల పేరిట నిలువు దోపిడీ మొబైల్ దొంగతనం.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది -
మానవత్వం చాటుకున్న యువకులు
కల్వకుర్తి టౌన్: ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందగా కరోనా సోకిందన్న అనుమానంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆ గ్రామస్తులెవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న కొందరు ముస్లిం యువకులు పీపీఈ కిట్లు వేసుకుని ఖననం చేసి మానవత్వం చాటుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని పంజుగులకు చెందిన షమీంబీ (65), గఫార్ (78) లకు సంతానం లేదు. స్థానికంగా ఇంటివద్దే చిన్నపాటి కిరాణం కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వయసు మీదపడటంతో ఇటీవల దుకాణం సైతం మూసివేశారు. ఈ నెల 12న గఫార్ అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా, షమీంబీ ఈనెల 15వ తేదీన ఉదయం అనారోగ్యం కారణంగా కల్వకుర్తిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చూపించుకుని తిరిగి స్వగ్రామం చేరుకుంది. అయితే పరిస్థితి విషమించటంతో అదే రాత్రి ఆమె మృతి చెందింది. ఈ విషయం గ్రామస్తులకు తెలిసినా కరోనా సోకిందనే అనుమానంతో దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు కల్వకుర్తి పట్టణానికి చెందిన మక్బూల్, ఖదీర్, కరీముల్లా, అతావుల్లా వారి స్నేహితులు కలిసి అదే అర్ధరాత్రి అక్కడికి వెళ్లారు. పీపీఈ కిట్లు ధరించి వృద్ధురాలి మృతదేహాన్ని రిక్షాలో వేసుకుని జేసీబీ సాయంతో శివారులో గుంతను తీసి, ఖననం చేశారు. ‘సావెల్’ను వణికిస్తున్న కరోనా.. బాల్కొండ: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ గ్రామంలో కరోనా కారణంగా రెండు రోజుల్లో నలుగురు మృతి చెందారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ఏర్పాటు చేసినా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఇక్కడ పది రోజుల్లో వందకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దులో మెండోరా మండలం ఉంది. అందులో సావెల్ గ్రామం గోదావరి తీరాన చివరన ఉంది. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కరోనా నిబంధనలను పాటించాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో రమేశ్ సూచించారు. చదవండి: కరోనా వేగం తగ్గాలంటే టీకా వేగం పెరగాల్సిందే! -
మాయమాటలు చెప్పి బంగారం అపహరణ
సాక్షి, కల్వకుర్తి : వృద్ధ దంపతులకు మాయమాటలు చెప్పి, వారి వద్ద నుంచి 4 తులాల బంగారం అపహరించిన సంఘటన శనివారం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని యంగంపల్లికి చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు కల్వకుర్తికి వారి సొంత పని నిమిత్తం వచ్చారు. పట్టణంలోని మహబూబ్‌నగర్ చౌరస్తాకు చేరుకున్న వృద్ధల వద్దకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు చేరుకుని వృద్ధ దంపతులతో మాటమాట కలిపారు. మీకు లాటరీ వచ్చిందని, మాయమాటలు చెప్పి నమ్మించారు. బ్యాంక్‌కు వెళ్తే మీకు లాటరీకి సంబంధించిన డబ్బులు ఇస్తారని, ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసి వెళ్లండని చెప్పి నమ్మించి పట్టణంలోని ఓ బ్యాంక్‌కు తీసుకెళ్లారు. అనంతరం భర్తను బయట ఉంచి, భార్యను లోనికి వెళ్లమని చెప్పి పంపించారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆ వృద్ధుడి వద్దకు వెళ్లి మీ భార్య బంగారాన్ని తీసుకొని రావాలని చెప్పిందని, అతని వద్ద ఉన్న బంగారాన్ని తీసుకొని ఇద్దరూ ఉడాయించారు. బంగారంతో ఉడాయించిన వ్యక్తులతో వృద్ధ దంపతులు మోసపోయామని గ్రహించి, లబోదిబోమన్నారు. వెంటనే దంపతులిద్దరూ వారికి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. వివరాలు తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మహేందర్ తెలియజేశారు. -
అదనపు బ్యాంకు వచ్చేనా..?
సాక్షి, వంగూరు: మండల కేంద్రంలో ఒకేబ్యాంకు ఉండడంతో మండల ప్రజలు నిత్యం ఇబ్బందులకు గు రవుతున్నారు. పంట రుణాలు, పాల బిల్లులు, పింఛన్లు, పంట నష్టపరిహారం, బంగారు రుణా లు తదితర లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరపాల్సి ఉండడంతో ఖాతాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో వ్యవసాయ, వా ణిజ్య ఖాతాలు కలిపి దాదాపుగా పది వేల ఖా తాలు ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత.. నోట్ల రద్దు తర్వాత ప్రజలు బ్యాంకు లావాదేవీలు జరపడం తప్పని సరైంది. పది రోజులకోసారి వ చ్చే పాలబిల్లును బ్యాంకు నుంచి డ్రా చేసుకునేం దుకు పాడి రైతులకు ఒకరోజు టైం పడుతుంది. బంగారు రుణం తీసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడున్న తీవ్ర కరువు పరిస్థితులతో రై తులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వ్యవసాయ పంట రుణాలు రెన్యూవల్ చేసుకోవడం తలకు మించిన భారంగా మారింది. పంట రుణం చెల్లిస్తే మళ్లీ రుణం తీసుకునేందుకు 15 నుంచి నెలరోజు ల సమయం పడుతుంది. మండలంలోని 17 పంచాయతీలు.. మండలంలో 20 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 17 పంచాయతీలు ఐఓబీ బ్యాంకుపరిధిలోనే లావాదేవీలు జరుపుతున్నారు. ఇంతకు మించి వృ ద్ధులు బ్యాంకుల వద్దకు వచ్చి పింఛన్ పొందడం కష్టంగా మారింది. ఇంత పెద్దమొత్తంలో లావాదేవీలు ఉన్నప్పటికీ ఇక్కడ అదనపు బ్యాంకు ఏర్పా టు చేసేందుకు నేతల కృషి శూన్యమయ్యింది. ఒకవైపు అంతా ఆన్లైన్ సేవలు, బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరపాలని చెబుతున్నప్పటికీ మండల కేంద్రంలో ఇతర ఏదైనా బ్యాంకు ఏర్పాటు చేస్తే ప్రజలకు లావాదేవీలు జరపడం సులువవుతుంది. నిత్యం రద్దీగా ఉండడంతో.. బ్యాంకు నిత్యం ఖాతాదారులతో రద్దీగా ఉండడంతో సబ్సిడీ రుణాలు, వాణిజ్య రుణాలు, ఇతర కా ర్పొరేషన్ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రావడంలేదు. ఉన్న బ్యాంకు పక్కనే ఏర్పాటు చేసిన ఏటీఎం ఎప్పుడూ పని చేయదు. బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు డ్రా చేయాలంటే రెండు గంటలకు పైగానే క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తుంది. కొందరు ఖాతాదారులు వామ్మో ఈ బ్యాంకులో లావాదేవీలు జరపడం కష్టమంటున్నారు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు గతంలో వంగూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉ పాధ్యాయుడు విష్ణుమూర్తి ఎస్బీఐ శాఖ ఏర్పాటు చేయాలని కేంద్ర కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కానీ ప్రజాప్రతినిధులు పెద్దగా ప ట్టించుకోకపోవడంతో బ్యాంకు అధికారుల నుంచి స్పందన కరువైంది. గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చే స్తే మహిళా సంఘాలు, రైతులకు సులువుగా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉం టుందని కొందరు నాయకులు రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం రావడంలేదు. పంచాయతీల తీర్మానాలతో.. మండలంలోని అన్ని గ్రామపంచాయతీల సర్పం చ్‌లు పంచాయతీ తీర్మానాలతో ఆయా బ్యాంకుల కేంద్ర కార్యాలయాలను సంప్రదిస్తే బ్యాంకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. కానీ అటుగా ప్రయత్నం చేసే సర్పంచ్‌లు కనిపించడంలేదు. ఏదేమైనా వంగూరులో మరో శాఖకు సంబం«ధించిన బ్యాంకు ఏర్పాటు చేస్తే అదనపు రుణాలు దొరకడంతోపాటు బ్యాంకులో రద్దీ కూడా తగ్గుంది. వ్యాపారపరంగా కూడా మండల కేంద్రం అభివృద్ధి చెందుతుంది. మరో బ్యాంకు ఏర్పాటు చేయాలి వంగూరు మండల కేంద్రంలో ఎస్బీఐ కానీ సంగమేశ్వర గ్రామీణ బ్యాంకు లేదా ఆంధ్రా బ్యాంకు ఏర్పాటు చేస్తే ప్రజలకు కొంత ఉపయోగంగా ఉంటుంది. ఇందుకోసం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మండల కేంద్రంలో మరో బ్యాంకు ఏర్పాటు చేయాలి. – బాల్‌రెడ్డి, వంగూరు -
ప్రాణం తీసిన వేగం
వెల్దండ (కల్వకుర్తి): రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా భూములు పరిశీలించేందుకు బయలుదేరిన వారిని మృత్యువు వెంటాడింది.. వేగంగా దూసుకెళ్లిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని చెర్కూరు గేట్ సమీపంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే క్రమంలో కల్వకుర్తిలో ఉన్న భూములను చూసేందుకు కల్వకుర్తి పట్టణానికి చెందిన కుడుముల రవీందర్‌రెడ్డి(50), హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడ గ్రామ మాజీ సర్పంచ్ చల్లా సుధాకర్‌రెడ్డి(55), సింహారెడ్డి, సుదర్శన్‌రెడ్డి మంగళవారం ఉదయం వచ్చి పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో తిరిగి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. వేగంగా దూసుకెళ్లిన కారు మార్గమధ్యలో వెల్దండ మండలం చెర్కూర్‌గేట్ సమీపంలో హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెల్దండ ఎస్ఐ వీరబాబు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో రవీందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డిలను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన సింహారెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. సుదర్శన్‌రెడ్డి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రవీందర్‌రెడ్డికి భార్యతోపాటు కుమార్తె ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌రెడ్డికి భార్య కవితతోపాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పౌష్టికాహారం పక్కదారి!
కల్వకుర్తి టౌన్ : భావిభారతమైన చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. రూ.లక్షలు వెచ్చించి సమకూరుస్తున్న ఎంతో విలువైన ’బాలామృతం’ పశువుల పాలు అవుతోంది. చిన్నారుల పోష్టికాహార లోపాన్ని తొలగించడానికి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 12రకాల పోషక పదార్థాలతో కూడిన బాలామృతంను పంపిణీ చేస్తోంది. అయితే దీన్ని ఎక్కువగా పాడిపశువులకు దాణాగా వాడుతున్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఈ బాలామృతాన్ని ప్రతి చిన్నారికి పుట్టిన ఏడవ నెల నుంచి మూడేళ్ల వరకు అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కువగా వలసలు వెళుతూ వారి పిల్లలను ముసలోళ్ల వద్ద ఇంటి వద్దే ఉంచుతున్నారు. ఆ చిన్నారులకు అత్యధిక పోషక విలువలు కలిగిన తల్లి పాలు లేకపోవడంతో వారికోసం పంపిణీ చేరాల్సిన బాలామృతం పాకెట్లు పక్కదారి పడుతున్న విషయం బయటపడింది. కార్డెన్‌సెర్చ్‌లో భాగంగా శనివారం రాత్రి కల్వకుర్తి పట్టణంలోని బలరాంనగర్ కాలనీలో పోలీసులు ఇంటింటి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలనీలోని యాదగిరి అనే వ్యక్తి ఇంట్లో భారీగా 46పాకెట్ల అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ చేసే బాలామృతం పాకెట్లు దొరికాయి. అది చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని, ఈ పాకెట్లు ఎక్కడవనే విషయంపై ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన తనిఖీల్లో గతంలో చార్మినార్ ప్రాంతంలో, తర్వాత కల్వకుర్తి పట్టణంలో బాలామృతం దొరికిందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే యాదగిరిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అంగన్వాడీ టీచర్ల నుంచే ఈ పాకెట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాకెట్లను యాదగిరి తన పొలంలోని షెడ్డులో ఉన్న పశువులకు దాణాగా వేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో చాలా ప్రాంతాల్లో బాలామృతంపాకెట్లను పాడిపశువులకు దాణాగా వేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 18 ప్రాజెక్టులు ఉండగా అందులో 4,322అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 7 ప్రాజెక్టులు ఉండగా అందులో 1,889 అంగన్వాడీ కేంద్రాల్లో 73,368మంది చిన్నారులు ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 5 ప్రాజెక్టులు ఉండగా అందులో 1,131 అంగన్వాడీ కేంద్రాల్లో 10,275 మంది చిన్నారులు ఉన్నారు. అలాగే వనపర్తి జిల్లాలో 3 ప్రాజెక్టులకు గాను 589 అంగన్వాడీ కేంద్రాల్లో 25,523 మంది చిన్నారులు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 3 ప్రాజెక్టుల పరిధిలో 713 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 24,900 మంది చిన్నారులు ఉన్నారు. ఇలా ఉమ్మడి జిల్లాతో కలుపుకొని 1,64,911మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ కలిపి ప్రతినెలా ఒక్కో చిన్నారికి 2.5 కిలోల బాలామృతాన్ని ఇస్తారు. ఇంటింటి విచారణ.. కార్డెన్ సెర్చ్‌లో దొరికిన బాలామృతం ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయమై ఐసీడీఎస్ అధికా రులు ఇంటింటి విచారణ చేపట్టారు. రాష్ట్ర పౌష్టికాహార సంస్థ ప్రతినిధి ఎలక్షన్ రెడ్డి కూడా ఈ విషయమై కల్వకుర్తి పోలీసుల నుంచి సమాచారం తీసుకున్నారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని ఐసీడీఎస్ అధికారులకు ఆదేశించారు. బలరాంనగర్ కాలనీలో మొత్తం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అందులో ఎంతమంది బాలామృతం తీసుకున్నారు, ఎవరెవరికి అందలేదో.. ఇంటింటికి వెళ్లి విచారణ చేపట్టారు. అయితే విచారణ చేస్తున్న అధికారులు అక్కడి లబ్ధిదారులు చెప్పే విషయాలు విని నివ్వెరపోతున్నారు. స్థానిక అంగన్వాడి కేంద్రానికి వెళ్లి బాలామృతం అడిగితే అసలు మీ బిడ్డపేరు రిజిస్టర్లో లేదని అంగన్వాడీ టీచర్ చెప్పినట్లు ఓ మహిళ తెలిపింది. ఐసీడీఎస్ అధికారులు రికార్డులు పరిశీలించగా.. సదరు మహిళ పేరు రిజిస్టర్లో ఉందని, బాలామృతం క్రమం తప్పకుండా తీసుకుంటున్నట్లు సంతకాలు చేసినట్లు గుర్తించారు. అలాగే కాలనీలో చాలామంది మహిళలు సంతకాలు చేసి, ప్రతినెలా బాలామృతం తీసుకున్నట్లు రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో దొంగ సంతకాలతో బాలమృతం పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని అధికారులు తెలిపారు. రిజిస్టర్లో పేరులేదని చెప్పి.. ఈమె బలరాంనగర్‌కు చెందిన అనిత. ఆమెకు 2016లో బిడ్డ పుట్టింది. అప్పుడు అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేయించుకుంది. బిడ్డ పుట్టిన ఆరు నెలల తర్వాత బాలామృతం ఇస్తారని తెలిసి.. నా బిడ్డకు ఎందుకు ఇవ్వడం లేదని అంగన్వాడీ టీచర్‌ను అడిగింది. నీ పేరు రికార్డుల నుంచి తొలగించాం అని చెబితే.. ఆమె మళ్లీ అడగలేదు. అయితే ఏడాదిగా అనిత ప్రతి నెలా సంతకం చేసి బాలామృతం తీసుకున్నట్లుగా రికార్డుల్లో నమోదు చేశారని ఐసీడీఎస్ అధికారులు వచ్చి చెబితే గానీ విషయం బయటపడలేదు. తాను ఏరోజు రికార్డుల్లో సంతకం పెట్టలేదని, బాలామృతం తీసుకోలేదని అనిత చెబుతోంది. చర్యలు తీసుకుంటాం బలరాంనగర్ కాలనీలో దొరికిన బాలామృతం పాకెట్లపై విచారణ ప్రారంభించాం. అసలు అతని దగ్గరికి అవి ఎలా చేరాయి, అంగన్వాడీ కేంద్రాల నుంచి ఎలా బయటకు వెళ్లిందనే విషయాన్ని లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి విచారణ చేస్తున్నాం. ఈ విషయాలన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయి. – చందనేశ్వరీ, కల్వకుర్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి -
అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన సెల్‌ఫోన్
తలకొండపల్లి(కల్వకుర్తి): పిల్లల సెల్‌ఫోన్ గొడవ ఏకంగా ఓ ప్రాణాన్ని తీసింది. పిల్లల కొట్లాటలో పెద్దలు కలుగజేసుకోవడంతో మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఈ గొడవలో గాయపడిన వ్యక్తి నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని వెల్జాల్లో చోటు చేసుకుంది. వివరాలు ఎస్సై సురేష్‌యాదవ్ కథనం ప్రకారం.. వెల్జాల్ గ్రామానికి చెందిన మంద అంజయ్య(42), మంద రాములు స్వయానా అన్నదమ్ములు. వారి కుటుంబాలతో వీరు వేర్వేరుగా ఉంటున్నారు. ఈనెల 18న సాయంత్రం 6 గంటల సమయంలో అంజయ్య ఇంటికి ఆయన తమ్ముడి కూతురు శ్రీవాణి వచ్చి అంజయ్య కొడుకును ఏడ్పించసాగింది. దీంతో కోపం వచ్చిన అంజయ్య భార్య పార్వతమ్మ వచ్చి తమ్ముడిని ఎందుకు ఏడిపిస్తున్నావని శ్రీవాణిని నిలదీసింది. దీంతో ఆవేశానికిలోనైన శ్రీవాణి అక్కడున్న సెల్‌ఫోన్‌ను తీసుకొని గోడకేసి బలంగా కొట్టడంతో పగిలిపోయింది. అప్పుడే ఇంటికొచ్చిన అంజయ్యకు సెల్‌ఫోన్ పగిలిన విషయం గురించి భార్య పార్వతమ్మ చెప్పింది. కోపోద్రిక్తుడైన అంజయ్య పగిలిన సెల్‌ఫోన్ మనకెందుకు ఆ ఫోన్‌ను వారికి ఇచ్చిరమ్మని భార్య పార్వతమ్మను తన తమ్ముడు రాములు ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్లగానే రాములు భార్య సుమిత్ర.. పార్వతమ్మతో గొడవ పడింది. పైగా పార్వతమ్మను నానా మాటలతో తిట్టి పోసింది. విషయం తెలుసుకున్న అంజయ్య కూడా అక్కడికి వచ్చాడు. అంజయ్య రాగానే తమ్ముడు రాములు కూడా రంగంలోకి దిగాడు. భార్యాభర్తలు(రాములు, సుమిత్ర) ఇరువురు కలిసి అంజయ్యను తిట్టారు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో తమ్ముడు రాములు తన అన్న అంజయ్య గొంతు పట్టుకుని గోడకు బలంగా కొట్టాడు. అంజయ్య తలకు బలమైన దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు. మెరుగైన చికిత్స నిమిత్తం అంజయ్యను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ అంజయ్య గురువారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. సంఘటనా స్థలాన్ని సీఐ వెంకటేశ్వర్లు సందర్శించి కేస్ వివరాలు తెలుసుకున్నారు. -
ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను ఓ భార్య దారుణంగా అంతమొందించింది. అనంతరం శవాన్ని ముక్కలుగా చేసి గోనె సంచిలో కుక్కి సిమెంట్ కడ్డీని సంచికి కట్టి చెరువులో పడేసింది. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్‌నగర్ కాలనీకి చెందిన కావలి మల్లయ్య (42)కి వంగూరు మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన పార్వతమ్మ (38)తో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె శ్రీలత(13), కుమారుడు శ్రీకాంత్(16) ఉన్నారు. భర్త మల్లయ్య హైదరాబాద్‌లో కూలి పని చేస్తూ ప్రతి 15 రోజులకోసారి ఇంటికి వచ్చేవాడు. ఇదిలాఉండగా నాగర్‌కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మేస్త్రీ రాము(37) కుటుంబం కావలి మల్లయ్య ఇంటి పక్కనే అద్దెకు దిగారు. దీంతో రాము, ఆయన భార్య పనిచేసే చోటుకే మల్లయ్య భార్య పార్వతమ్మ కూడా వెళ్లేది. ఈ క్రమంలో రాము–పార్వ తమ్మ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన పార్వతమ్మ భర్త మల్లయ్య కల్వకుర్తికి వచ్చేశాడు. అయినా రాముతో తన బంధాన్ని అలాగే కొనసాగించింది. భర్తను అడ్డు తప్పిస్తే తమ సంబంధం సాఫీగా సాగుతుందనుకున్న పార్వత్వమ్మ ప్రియుడితో కలసి పథకం రచించింది. ఈ క్రమంలో గత ఏప్రిల్ 20న రాత్రి ఇంట్లోనే ప్రియుడు రాము, కుమారుడు శ్రీకాంత్ సాయంతో భర్తను హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి సంచిలో కుక్కి దానికి సిమెంట్ కడ్డీ కట్టి నాగనూల్ నాగసముద్రం చెరువులో పడేశారు. చాలా రోజులుగా మల్లయ్య ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి బాలమ్మ ఈ నెల 7న కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మరుసటి రోజే భర్త కనిపించడం లేదని పార్వతమ్మ కూడా పోలీసులను ఆశ్రయించింది. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు పార్వతమ్మపై అనుమానంతో ఆమె సెల్‌ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. తరచూ పార్వతమ్మ రాముతో మాట్లాడుతున్నట్టు గుర్తించారు. ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా శుక్రవారం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో శనివారం నాగనూల్ నాగ సముద్రంలో నుంచి మృతదేహన్ని బయటకు తీయించారు. నాగర్‌కర్నూల్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, కల్వకుర్తి డీఎస్పీ ఎల్సీ.నాయక్ ఆధ్వర్యంలో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. -
కల్వకుర్తి ‘గులాబీ’లోకి ఆరో కృష్ణుడు
కల్వకుర్తి రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. అనూహ్య పరిణామాలతో అధికార పార్టీలో సమీకరణలు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఉనికి కోసం పాకులాడిన ఆ పార్టీ.. ప్రస్తుతం ఆశావహుల తాకిడితో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే అసమ్మతి రాజకీయాలతో కుతకుతలాడుతున్న గులాబీ శిబిరంలోకి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి రావడం కొత్త సమీకరణలకు తెరలేపింది. ఆమనగల్లు : కల్వకుర్తి నియోజకర్గంలో టీఆర్ఎస్కు చెందిన ముఖ్యనాయకుల సంఖ్య పెరిగిపోతోంది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, సీనియర్ నేతలు గోలి శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీసింగ్, విజితారెడ్డిలతో ‘కారు’ ఓవర్‌లోడ్ కాగా.. తాజాగా ఎడ్మ కిష్టారెడ్డి రాకతో కుదుపునకు గురవుతోంది. రానున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు పాత నేతలు ప్రయత్నాలు చేస్తుండగా ఆరో కృష్ణుడి రంగప్రవేశంతో టీఆర్ఎస్లో రాజకీయం రసవత్తరంగా మారింది. నివురుగప్పిన నిప్పులా.. మూడు గ్రూపులు.. ఆరు వర్గాలుగా అధికారపార్టీ నిలువునా చీలిపోయింది. ఎవరికివారు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండడంతో పార్టీ కార్యకర్తల మధ్య కూడా విభజన రేఖ ఏర్పడింది. ఈ పరిణామాలను గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యనాయకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అగ్రనాయకత్వం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. టీఆర్ఎస్ గాలి వీచినా.. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కొనసాగినా కల్వకుర్తిలో మాత్రం చతికిలపడింది. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్.. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి చేతిలో పరాజయం పాలై మూడో స్థానానికి పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత కసిరెడ్డి నారాయణరెడ్డి గణనీయంగా ఓట్లు సాధించారు. ఎన్నికల అనంతర పరిణామాల నేపథ్యంలో కసిరెడ్డి అధికారపార్టీ తీర్థం పుచ్చుకోవడం.. ఎమ్మెల్సీగా విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. పదవి రావడంతో విస్తృతంగా పర్యటించి నియోజకవర్గంపై పట్టు సాధించారు. కసిరెడ్డి చేరికతో డీలా పడ్డ జైపాల్‌యాదవ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రత్యేకవర్గాన్ని తయారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇరువురు నేతల మధ్య అభిప్రాయబేధాలు పొడచూపాయి. రెండేళ్ల క్రితం ఆమనగల్లు మండలం మైసిగండిలో మండల టీఆర్ఎస్ ఎన్నికల సందర్భంగా రెండు గ్రూపుల నాయకులు బహిరంగంగా గొడవకు దిగారు. ఆమనగల్లులో గతేడాది టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇటీవల తలకొండపల్లి మండలం మక్తమాదారంలో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలోనూ కీచులాడుకున్నారు. ఆఖరికి సోషల్ మీడియాలో సైతం వైరివర్గాల మధ్య ‘వాట్సప్ వార్’ కొనసాగుతోంది. పాంచ్ పటాకా! తొలినాళ్లలో పార్టీ కోసం పనిచేసిన నియోజకవర్గ మాజీ ఇన్చార్జి బాలాజీసింగ్ చివరి నిమిషంలో పార్టీలో చేరిన జైపాల్‌యాదవ్‌కు అభ్యర్థిత్వం ఖరారు కావడంతో నిరుత్సాహపడ్డప్పటికీ, పార్టీ కోసం పనిచేశారు. అదేసమయంలో కాంగ్రెస్‌ను వీడి గోలి శ్రీనివాస్‌రెడ్డి కూడా గులాబీ కండువా వేసుకున్నారు. ఈయన కూడా టికెట్టు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. అనూహ్య పరిస్థితుల్లో జైపాల్ యాదవ్ ‘బీ’ ఫారం ఎగురేసుకుపోవడంతో నీరుగారారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా.. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయలేదు. మహిళా కోటలో కల్వకుర్తి మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు ద్యాప విజితారెడ్డి కూడా కల్వకుర్తి టికెట్టుపై దృష్టిపెట్టారు. ఈ నలుగురు కూడా కదనకుతుహలం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్న కసిరెడ్డి కూడా వచ్చే శాసనసభ ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించునే దిశగా పావులు కదుపుతున్నారు. పాత గూటికి ‘సూదిని’వర్గం..? కల్వకుర్తి కాంగ్రెస్ టికెట్టు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ అగ్రనేత సూదిని జైపాల్‌రెడ్డి సోదరుడు సూదిని రాంరెడ్డి వర్గానికి తాజా పరిణామాలు మింగుడుపడడంలేదు. గత ఎన్నికల్లో వంశీకి సీటు దక్కడంతో నిరాశకు గురైన ఆయన స్వతంత్ర అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి అండగా నిలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే, కసిరెడ్డి తమ వర్గానికి మునుపటి ప్రాధాన్యమివ్వడంలేదని కినుక వహించిన ఆయన.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల చంపాపేట్‌లో తన సన్నిహితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే జైపాల్, కసిరెడ్డితో పొసగకపోవడం.. తాజాగా మరోనేత ఎడ్మ కూడా పార్టీలోకి వస్తుండడం.. ఆయనతోను విభేదాలున్న నేపథ్యంలో పాత గూటికి చేరే అవకాశం లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. కిష్టారెడ్డి రాకతో... ఎడ్మ కిష్టారెడ్డి చేరికతో కల్వకుర్తిలో టీఆర్ఎస్ బలపడుతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇదే అంచనాతో కిష్టారెడ్డిని మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి ఆయనను టీఆర్ఎస్లోకి ఆహ్వనించారు. అయితే కల్వకుర్తి టికెట్టును ఐదుగురు నేతలు ఆశిస్తున్న తరుణంలో ఎడ్మ కిష్టారెడ్డి రాకతో ఆశావహుల సంఖ్య ఆరుకు పెరిగింది. టికెట్ ఎవరికి వచ్చినా మరో వర్గం సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. -
వెలగని దీపం
చారకొండ : దీపం సిలిండర్లు అందక మండల పరిధిలోని గ్రామీణ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంటచెరుకుకోసం మహిళలు, వృద్ధులు పడరాని పా ట్లు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు గ్యాస్ సిలిండర్లు మంజూరు చేస్తున్నామని ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నారు. కాని నేటికి వంటగ్యాస్ రాక ఇబ్బందులు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. మంజూరు కాని సిలిండర్లు... మండలంలో ప్రస్తుతం 8 గ్రామ పంచాయతీలలో 2000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 160 మంది దీపం పథకం క్రింద దరఖాస్తు చేసుకున్నారు. ఇంత వరకు మంజూరు కాలేదు. వీరి బాధలు అధికారులు, ప్రజాప్రతినిదులకు పట్టడం లేదు. గ్యాస్ గోదాముల్లో కొనుగోలు చేయడానికి డబ్బులు లేక అడవుల్లో వంట చెరుకు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. సిలిండర్లు కొనుగోలు చేయడానికి అదిక ధరలు ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు నేటికి వాటిని వినియోగించడం లేదు. వంటగ్యాస్ కనెక్షన్‌కు రూ.4500 నుంచి రూ5500 వరకు ఉండడంతో ఎంతో మంది వీటికి దూరమవుతున్నారు. గ్యాస్ ఒక సారి నింపడానికి రూ.850 రూ పాయలు ఖర్చవుతున్నాయి. నగదు బది లీ ద్వారా 177 రూపాయలు మాత్రమే బ్యాంకు ఖాతాలలో జమచేస్తున్నారు. కట్టెల పొయ్యితో కష్టాలు.. ఆధునిక ప్రపంచంలో నేటికీ మండల పరిధిలోని అనేక గ్రామాల్లో మహిళలు కట్టెల పొయ్యిలు వాడుతూ అనారోగ్య పాలవుతున్నారు. కళ్లు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. దీ పం సిలిండర్లను పంపిణీ చేయాల్సిన అధికారులు, ప్ర జాప్రతినిధులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక గ్రామాల్లో వంటచెరు కు కోసం కొన్ని సందర్భాల్లో ఇంటిల్లిపాది అడవుల వెంట తిరుగుతున్నారు. అధికారులు స్పందించాలి చారకొండ: మా గ్రామంలో చాలా మందికి సిలిండర్లు లేవు. సిలిండర్లు లేక కట్టెల పొయ్యిలతో ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న సిలిండర్లు పేదలకు అందడం లేదు. దీంతో మహిళలు కట్టెల కోసం అడవులకు వెళ్తూ అనేక పాట్లు పడుతున్నారు. అదికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా కనికరించడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి సబ్సిడీపై నిరుపేద కుటుంబాలకు సిలిండర్లు మంజూరు చేయాలి. మహిళల పాట్లు తొలగించాలి. – కొండల్, జూపల్లి -
‘ఆ ఎమ్మెల్యే ఓ చీడపురుగు’
సాక్షి, హైదరాబాద్ : ఏమాత్రం ఆత్మగౌరవం లేని కాంగ్రెస్ పార్టీలో కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఓ చీడపురుగని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. వంశీచంద్ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని, మంత్రి కేటీఆర్‌పై వంశీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ప్రజలకు పౌరుషం, ఆత్మగౌరవం ఉంది కాబట్టే అప్పట్లో ఎన్టీఆర్‌ను ఓడించారని, చరిత్రలోకి వెళితే కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సింది చాలా ఉంటుందన్నారు. కాంగ్రెస్ కోర్టులను నమ్ముకుందని, టీఆర్ఎస్ ప్రజలను నమ్ముకుందని పేర్కొన్నారు. పెద్దవాళ్ళను విమర్శిస్తే తానూ పెద్దవాడిని అవుతాననే తప్పుడు వ్యూహాంలో వంశీ వెళ్తున్నాడని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌పై విమర్శలు మానకపోతే ఆయనను స్థానిక ప్రజలే కల్వకుర్తికి రానివ్వని పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు పెరగడాన్ని జీర్ణించుకోలేకే ఎమ్మెల్యే వంశీ విమర్శలకు దిగుతున్నారన్నారు. పొరుగు రాష్ట్రం సీఎం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రను గ్రహించే టీఆర్ఎస్లోని దళిత ఎమ్మెల్యేలమంతా ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరును ప్రతిపాదించామని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే దళితుడిని సీఎం చేస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ మనిషి అయిన వంశీని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించామా అని కల్వకుర్తి ప్రజలు ఇపుడు బాధపడుతున్నారని అన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటైతే స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, కానీ, కల్వకుర్తి ఎమ్మెల్యేకు అది ఇష్టంలేక అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే వంశీచంద్ వెంట ఆయన బంధువులు తప్ప చివరకు ఎవరు మిగిలే పరిస్థితి లేదని, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. మండలిలో విపక్ష నేత ప్రభుత్వాన్ని పొగుడుతుంటే తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చిన వంశీ పబ్లిసిటీ కోసం ప్రభుత్వాన్ని తిడుతున్నాడని ధ్వజమెత్తారు. కల్వకుర్తికి సాగునీరిచ్చిన ప్రభుత్వాన్ని పొగడాల్సింది పోయి వంశీ విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. కల్వకుర్తిలో కాంగ్రెస్‌కు బీటలు పడుతున్నాయనే అక్కసుతోనే ఆయన దిగజారి మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. -
కల్వకుర్తి నియోజకవర్గంలో రీ పోలింగ్
-
కల్వకుర్తి నియోజకవర్గంలో రీ పోలింగ్
కల్వకుర్తి : మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం జూపల్లిలో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది. 119వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు కొనసాగనుంది. మరోవైపు రీ పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. కాగా ఈ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో రీపోలింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
‘బంగారు తల్లి’కి ఆదరణ
కల్వకుర్తి, న్యూస్‌లైన్: ఆడపిల్లల సంరక్షణార్థం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా ప్రారంభించిన బంగారు తల్లి పథకం ఫలాలు పొందడంలో రాష్ట్రంలోనే పాలమూరు ప్రథమస్థానంలో నిలిచింది. జిల్లావాసులు ఎక్కువమంది ఈ పథకం ద్వారా ప్రయెజనాలను పొందారు. బంగారు తల్లి కింద లబ్ధిపొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,15,741 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 91,666 మంది అర్హత సాధించగా చిన్నారుల ఖాతాల్లో రూ 15.86 కోట్లు జమఅయ్యాయి. మన జిల్లాలోని 64 మండలాల్లో 10,047 మంది చిన్నారుల కోసం దరఖాస్తులు రాగా రూ. 1.39లక్షలు మంజూరయ్యాయి. జిల్లాలో అత్యధికంగా బంగారుతల్లి ఫలాల కోసం 282 దరఖాస్తు చేసుకోగా, 268 మంది అర్హత సాధించడంలో బిజినేపల్లి మం డలం అగ్రస్థానంలో నిలిచింది. అయితే జిల్లాలోనే అత్యధికంగా నవాబ్‌పేట మం డలానికి చెందిన 169 మంది చిన్నారుల కోసం రూ.4,22,500 మంజూరైంది.కల్వకుర్తి నియోజకవర్గం ఐదు మండలాలకు చెందిన 786 మంది దరఖాస్తు చేసుకోగా రూ.13,80,000 ఆయా బ్యాంకు ఖాతాల్లో జమఅయ్యాయి. కల్వకుర్తి మండలంలో ఇప్పటికే 16 మంది చిన్నారుల ఖాతాల్లో డబ్బులు జమఅయ్యా యి. 109 మంది ఇప్పటికే డబ్బులు తీసుకున్నారు. మండలానికి మొత్తం రూ. 2,72,500 మంజూరైంది. ఆమనగల్లు మండలంలో 109 మంది ఇప్పటికే డబ్బు లు తీసుకున్నారు. మండ లానికి మొత్తం రూ.2,72,500 మంజూరైంది. మాడ్గుల మండలంలో 153 మంది డబ్బు తీసుకున్నారు. ఈ మండలానికి నియోజకవర్గం లో నే అత్యధికంగా రూ.3,82,500 మం జూరైంది. వెల్దండ మండలంలో 113 మంది ఇప్పటికే డ బ్బు తీసుకున్నారు. ఈ మండలానికి రూ. 2,82,500 మంజూరయ్యాయి. తలకొండపల్లి మండలానికి రూ.1.70 లక్షలు మంజూరయ్యా యి. 68 మంది ఇప్పటికే డబ్బు తీసుకున్నారు. పథకం అమలు తీరు ఇలా.. తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్న కుటుంబంలో 2013 మే 1వ తేదీ తర్వాత పుట్టిన ఆడపిల్లలకు బంగారు పథకం వర్తిస్తుంది. ఒక కుంటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. ముందుగా గ్రామంలో గర్భిణుల జాబితాను గ్రామసంఘం ఎఫ్-1 ఫార్మాట్లో తయారుచేసి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యునిచే జాబితాను ధ్రువీకరించుకోవాలి. పేరు నమోదుకాగానే బ్యాంకుఖాతా తీసుకోవాలి. ఆడపిల్ల పుట్టగానే చిన్నారికి ‘బంగారు తల్లి’ అని పేరుపెట్టాలి. గ్రామ పంచాయతీ లేక మునిసిపాలిటీలో జనన ధ్రువీకరణపత్రం పొం దాలి. పాప జన్మించగానే ఎఫ్-2 ఫార్మాట్లో నమోదు చే యడానికి అవసరమైన జనన ధ్రువీకరణపత్రం, రేషన్, ఆధార్‌కార్డులు, తల్లీబిడ్డల ఫొటో, బ్యాంకు ఖాతా నెంబర్ సమర్పించారు. ఆ తరువాత అధికారి ధ్రువీకరణ పొంది రూ.2,500 మనం సూచిం చిన ఖాతాలో నేరుగా జమఅవుతాయి. చిన్నారికి ఏడేళ్లు నిండగానే ఆధార్ కార్డును పొంది ఆ నెంబర్‌ను డాటాబేస్‌లో పొందుపర్చాలి. అదే ఏడాది పాప పేరును తల్లి పేరుతో జతపర్చి జాయింట్ ఖాతాగా మార్చాల్సి ఉం టుంది. ఆ తరువాత ఆడపిల్ల పుట్టగానే రూ 2,500, మొదటి, రెండో ఏడాది వెయ్యి చొ ప్పు న, 3,4,5 ఏళ్లలో చిన్నారి అంగన్వాడీ కేం ద్రా ల్లో చేరిన తరువాత రూ 1500 చొప్పున, ఆరు నుంచి 10 ఏళ్లవరకు 5వ తరగతి పూర్తి చేసే నా టికి ఏడాదికి రెండువేల చొప్పున, 11 నుంచి 13 ఏళ్ల వరకు 6,7,8 తరగతులు పూర్తి చే సిన బాలికకు ఏడాదికి రూ 2500, దీంతో పాటు 9, 10వ తరగతులు పూర్తిచేసి, 14 నుంచి 15 బాలికకు ఏడాదికి మూడువేల చొప్పున, 16,17 ఏళ్లు నిండి ఇంటర్ పూర్తయ్యే వరకు రెండేళ్ల పాటు రూ 3,500 చొప్పున మంజూరవుతాయి. ఆ తరువాత 18 నుంచి 21 ఏళ్లు ఉండి డిగ్రీ పూర్తిచేస్తే ఏడాదికి నాలుగువేల చొప్పన 21 ఏళ్లు నిండగానే ఇంటర్ పూర్తయిన వారికి రూ 50 వేలు, డిగ్రీ పూర్తయిన వారికి లక్ష రూపాయలు అందుతుంది. ప్రచారం లోపం.. లబ్ధిదారులకు శాపం అయితే బంగారు తల్లి పథకం ద్వారా ఫలాలు పొందేందుకు అర్హులైనప్పటికీ పథకంపై ఇప్పటికీ గ్రామీణ ప్రాంతప్రజల్లో అవగాహన కల్పించేవారు కరువయ్యారు. దీంతో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కావాల్సిన అర్హతలు తెలియక తికమక పడుతున్నారు. బంగారుతల్లి పథకంపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరు బాలికలపై లైంగికదాడి
కల్వకుర్తి, న్యూస్‌లైన్: ఓ బాలికపై ముగ్గురు యువకులు కలిసి లైంగికదాడికి ఒడిగట్టారు. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటన శుక్రవారం మండలంలోని తుర్కలపల్లి గ్రామంలో వెలుగుచూసిం ది. కల్వకుర్తి సీఐ భిక్షపతిరావు వివరాల ను వెల్లడించారు. తుర్కలపల్లి గ్రామం లో ఓ చిన్నారి తన అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ రెండోతరగతి చదువుతోంది. గురువారం పాఠశాలలకు సెలవుదినం కావడంతో బాలిక ఇంటివద్ద ఆడుకుంటోంది. ఇంటి సమీపంలో ఉన్న ముగ్గురు యువకులు జామకాయ ఇస్తామని చెప్పి చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. ఆ బాలిక కేకలు వేయడంతో ఇంట్లోనుంచి ఆ ముగ్గురు పారిపోయారు. ఇంటికి వచ్చిన తన తాతకు చిన్నారి జరిగిన విషయాన్ని విలపిస్తూ చెప్పింది. బాలిక తాత ఫిర్యాదు మేరకు నిర్భయచట్టం కింద కేసునమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే లైంగికదాడికి ఒడిగట్టిన వారిలో ఒకరు 9వ తరగతి, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. మరొకరికి 14 ఏళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. దోరేపల్లిలో పెళ్లిపేరుతో మోసం మద్దూరు, న్యూస్‌లైన్: మండలంలోని దోరేపల్లి గ్రామంలో గత కొంతకాలంగా ఓ మైనర్ బాలిక(15)ను పెళ్లిపేరుతో మోసంచేసిన వ్యక్తిపై శుక్రవారం కేసునమోదు చేశారు. ఎస్ఐ కథనం మేరకు.. గ్రామానికి చెందిన వెంకటప్ప అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను కొంతకాలంగా ప్రేమ, పెళ్లిపేరుతో మోసంచేశాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో బాధితురాలి తండ్రి వివాహం చేసుకోవాలని వెంకటప్పను కోరారు. అందుకు అతడు నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదుచేయగా, నిందితుడిపై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ఫర్హాద్హుసేన్ తెలిపారు.