పీపీఈ కిట్లు ధరించి రిక్షాలో వృద్ధురాలి మృతదేహాన్ని తీసుకెళుతున్న ముస్లిం యువకులు
కల్వకుర్తి టౌన్: ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందగా కరోనా సోకిందన్న అనుమానంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆ గ్రామస్తులెవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న కొందరు ముస్లిం యువకులు పీపీఈ కిట్లు వేసుకుని ఖననం చేసి మానవత్వం చాటుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని పంజుగులకు చెందిన షమీంబీ (65), గఫార్ (78) లకు సంతానం లేదు. స్థానికంగా ఇంటివద్దే చిన్నపాటి కిరాణం కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వయసు మీదపడటంతో ఇటీవల దుకాణం సైతం మూసివేశారు.
ఈ నెల 12న గఫార్ అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా, షమీంబీ ఈనెల 15వ తేదీన ఉదయం అనారోగ్యం కారణంగా కల్వకుర్తిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చూపించుకుని తిరిగి స్వగ్రామం చేరుకుంది. అయితే పరిస్థితి విషమించటంతో అదే రాత్రి ఆమె మృతి చెందింది. ఈ విషయం గ్రామస్తులకు తెలిసినా కరోనా సోకిందనే అనుమానంతో దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు కల్వకుర్తి పట్టణానికి చెందిన మక్బూల్, ఖదీర్, కరీముల్లా, అతావుల్లా వారి స్నేహితులు కలిసి అదే అర్ధరాత్రి అక్కడికి వెళ్లారు. పీపీఈ కిట్లు ధరించి వృద్ధురాలి మృతదేహాన్ని రిక్షాలో వేసుకుని జేసీబీ సాయంతో శివారులో గుంతను తీసి, ఖననం చేశారు.
‘సావెల్’ను వణికిస్తున్న కరోనా..
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ గ్రామంలో కరోనా కారణంగా రెండు రోజుల్లో నలుగురు మృతి చెందారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ఏర్పాటు చేసినా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఇక్కడ పది రోజుల్లో వందకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దులో మెండోరా మండలం ఉంది. అందులో సావెల్ గ్రామం గోదావరి తీరాన చివరన ఉంది. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కరోనా నిబంధనలను పాటించాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో రమేశ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment