![Cell Phone Dispute..Man Killed - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/23/man-dead-body.jpg.webp?itok=HZNtrXld)
మృతిచెందిన అంజయ్య
తలకొండపల్లి(కల్వకుర్తి): పిల్లల సెల్‌ఫోన్ గొడవ ఏకంగా ఓ ప్రాణాన్ని తీసింది. పిల్లల కొట్లాటలో పెద్దలు కలుగజేసుకోవడంతో మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఈ గొడవలో గాయపడిన వ్యక్తి నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు.
ఈ సంఘటన మండల పరిధిలోని వెల్‌జాల్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఎస్సై సురేష్‌యాదవ్ కథనం ప్రకారం.. వెల్‌జాల్ గ్రామానికి చెందిన మంద అంజయ్య(42), మంద రాములు స్వయానా అన్నదమ్ములు. వారి కుటుంబాలతో వీరు వేర్వేరుగా ఉంటున్నారు.
ఈనెల 18న సాయంత్రం 6 గంటల సమయంలో అంజయ్య ఇంటికి ఆయన తమ్ముడి కూతురు శ్రీవాణి వచ్చి అంజయ్య కొడుకును ఏడ్పించసాగింది. దీంతో కోపం వచ్చిన అంజయ్య భార్య పార్వతమ్మ వచ్చి తమ్ముడిని ఎందుకు ఏడిపిస్తున్నావని శ్రీవాణిని నిలదీసింది.
దీంతో ఆవేశానికిలోనైన శ్రీవాణి అక్కడున్న సెల్‌ఫోన్‌ను తీసుకొని గోడకేసి బలంగా కొట్టడంతో పగిలిపోయింది. అప్పుడే ఇంటికొచ్చిన అంజయ్యకు సెల్‌ఫోన్ పగిలిన విషయం గురించి భార్య పార్వతమ్మ చెప్పింది.
కోపోద్రిక్తుడైన అంజయ్య పగిలిన సెల్‌ఫోన్ మనకెందుకు ఆ ఫోన్‌ను వారికి ఇచ్చిరమ్మని భార్య పార్వతమ్మను తన తమ్ముడు రాములు ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్లగానే రాములు భార్య సుమిత్ర.. పార్వతమ్మతో గొడవ పడింది.
పైగా పార్వతమ్మను నానా మాటలతో తిట్టి పోసింది. విషయం తెలుసుకున్న అంజయ్య కూడా అక్కడికి వచ్చాడు. అంజయ్య రాగానే తమ్ముడు రాములు కూడా రంగంలోకి దిగాడు. భార్యాభర్తలు(రాములు, సుమిత్ర) ఇరువురు కలిసి అంజయ్యను తిట్టారు.
ఇద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో తమ్ముడు రాములు తన అన్న అంజయ్య గొంతు పట్టుకుని గోడకు బలంగా కొట్టాడు. అంజయ్య తలకు బలమైన దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు. మెరుగైన చికిత్స నిమిత్తం అంజయ్యను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ అంజయ్య గురువారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. సంఘటనా స్థలాన్ని సీఐ వెంకటేశ్వర్లు సందర్శించి కేస్ వివరాలు తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment