సాక్షి, కల్వకుర్తి : వృద్ధ దంపతులకు మాయమాటలు చెప్పి, వారి వద్ద నుంచి 4 తులాల బంగారం అపహరించిన సంఘటన శనివారం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని యంగంపల్లికి చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు కల్వకుర్తికి వారి సొంత పని నిమిత్తం వచ్చారు. పట్టణంలోని మహబూబ్‌నగర్ చౌరస్తాకు చేరుకున్న వృద్ధల వద్దకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు చేరుకుని వృద్ధ దంపతులతో మాటమాట కలిపారు. మీకు లాటరీ వచ్చిందని, మాయమాటలు చెప్పి నమ్మించారు. బ్యాంక్‌కు వెళ్తే మీకు లాటరీకి సంబంధించిన డబ్బులు ఇస్తారని, ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసి వెళ్లండని చెప్పి నమ్మించి పట్టణంలోని ఓ బ్యాంక్‌కు తీసుకెళ్లారు. అనంతరం భర్తను బయట ఉంచి, భార్యను లోనికి వెళ్లమని చెప్పి పంపించారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆ వృద్ధుడి వద్దకు వెళ్లి మీ భార్య బంగారాన్ని తీసుకొని రావాలని చెప్పిందని, అతని వద్ద ఉన్న బంగారాన్ని తీసుకొని ఇద్దరూ ఉడాయించారు. బంగారంతో ఉడాయించిన వ్యక్తులతో వృద్ధ దంపతులు మోసపోయామని గ్రహించి, లబోదిబోమన్నారు. వెంటనే దంపతులిద్దరూ వారికి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. వివరాలు తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మహేందర్ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment