కార్డెన్‌సెర్చ్‌లో దొరికిన బాలామృతం పాకెట్లును పరిశీలిస్తున్న ఎస్పీ సన్‌ప్రీత్ పింగ్
కల్వకుర్తి టౌన్ : భావిభారతమైన చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల కోసం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. రూ.లక్షలు వెచ్చించి సమకూరుస్తున్న ఎంతో విలువైన ’బాలామృతం’ పశువుల పాలు అవుతోంది. చిన్నారుల పోష్టికాహార లోపాన్ని తొలగించడానికి ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపు 12రకాల పోషక పదార్థాలతో కూడిన బాలామృతంను పంపిణీ చేస్తోంది.
అయితే దీన్ని ఎక్కువగా పాడిపశువులకు దాణాగా వాడుతున్నారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో ఈ బాలామృతాన్ని ప్రతి చిన్నారికి పుట్టిన ఏడవ నెల నుంచి మూడేళ్ల వరకు అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కువగా వలసలు వెళుతూ వారి పిల్లలను ముసలోళ్ల వద్ద ఇంటి వద్దే ఉంచుతున్నారు. ఆ చిన్నారులకు అత్యధిక పోషక విలువలు కలిగిన తల్లి పాలు లేకపోవడంతో వారికోసం పంపిణీ చేరాల్సిన బాలామృతం పాకెట్లు పక్కదారి పడుతున్న విషయం బయటపడింది.
కార్డెన్‌సెర్చ్‌లో భాగంగా శనివారం రాత్రి కల్వకుర్తి పట్టణంలోని బలరాంనగర్ కాలనీలో పోలీసులు ఇంటింటి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలనీలోని యాదగిరి అనే వ్యక్తి ఇంట్లో భారీగా 46పాకెట్ల అంగన్‌వాడీ కేంద్రంలో పంపిణీ చేసే బాలామృతం పాకెట్లు దొరికాయి. అది చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని, ఈ పాకెట్లు ఎక్కడవనే విషయంపై ఆరా తీస్తున్నారు.
అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన తనిఖీల్లో గతంలో చార్మినార్ ప్రాంతంలో, తర్వాత కల్వకుర్తి పట్టణంలో బాలామృతం దొరికిందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే యాదగిరిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అంగన్‌వాడీ టీచర్ల నుంచే ఈ పాకెట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాకెట్లను యాదగిరి తన పొలంలోని షెడ్డులో ఉన్న పశువులకు దాణాగా వేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో చాలా ప్రాంతాల్లో బాలామృతంపాకెట్లను పాడిపశువులకు దాణాగా వేస్తున్నట్లు సమాచారం.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 18 ప్రాజెక్టులు ఉండగా అందులో 4,322అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 7 ప్రాజెక్టులు ఉండగా అందులో 1,889 అంగన్‌వాడీ కేంద్రాల్లో 73,368మంది చిన్నారులు ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 5 ప్రాజెక్టులు ఉండగా అందులో 1,131 అంగన్‌వాడీ కేంద్రాల్లో 10,275 మంది చిన్నారులు ఉన్నారు.
అలాగే వనపర్తి జిల్లాలో 3 ప్రాజెక్టులకు గాను 589 అంగన్‌వాడీ కేంద్రాల్లో 25,523 మంది చిన్నారులు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 3 ప్రాజెక్టుల పరిధిలో 713 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా అందులో 24,900 మంది చిన్నారులు ఉన్నారు. ఇలా ఉమ్మడి జిల్లాతో కలుపుకొని 1,64,911మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ కలిపి ప్రతినెలా ఒక్కో చిన్నారికి 2.5 కిలోల బాలామృతాన్ని ఇస్తారు.
ఇంటింటి విచారణ..
కార్డెన్ సెర్చ్‌లో దొరికిన బాలామృతం ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయమై ఐసీడీఎస్ అధికా రులు ఇంటింటి విచారణ చేపట్టారు. రాష్ట్ర పౌష్టికాహార సంస్థ ప్రతినిధి ఎలక్షన్ రెడ్డి కూడా ఈ విషయమై కల్వకుర్తి పోలీసుల నుంచి సమాచారం తీసుకున్నారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని ఐసీడీఎస్ అధికారులకు ఆదేశించారు. బలరాంనగర్ కాలనీలో మొత్తం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అందులో ఎంతమంది బాలామృతం తీసుకున్నారు, ఎవరెవరికి అందలేదో.. ఇంటింటికి వెళ్లి విచారణ చేపట్టారు. అయితే విచారణ చేస్తున్న అధికారులు అక్కడి లబ్ధిదారులు చెప్పే విషయాలు విని నివ్వెరపోతున్నారు.
స్థానిక అంగన్‌వాడి కేంద్రానికి వెళ్లి బాలామృతం అడిగితే అసలు మీ బిడ్డపేరు రిజిస్టర్‌లో లేదని అంగన్‌వాడీ టీచర్ చెప్పినట్లు ఓ మహిళ తెలిపింది. ఐసీడీఎస్ అధికారులు రికార్డులు పరిశీలించగా.. సదరు మహిళ పేరు రిజిస్టర్‌లో ఉందని, బాలామృతం క్రమం తప్పకుండా తీసుకుంటున్నట్లు సంతకాలు చేసినట్లు గుర్తించారు. అలాగే కాలనీలో చాలామంది మహిళలు సంతకాలు చేసి, ప్రతినెలా బాలామృతం తీసుకున్నట్లు రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో దొంగ సంతకాలతో బాలమృతం పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని అధికారులు తెలిపారు.
రిజిస్టర్‌లో పేరులేదని చెప్పి..
ఈమె బలరాంనగర్‌కు చెందిన అనిత. ఆమెకు 2016లో బిడ్డ పుట్టింది. అప్పుడు అంగన్‌వాడీ కేంద్రంలో పేరు నమోదు చేయించుకుంది. బిడ్డ పుట్టిన ఆరు నెలల తర్వాత బాలామృతం ఇస్తారని తెలిసి.. నా బిడ్డకు ఎందుకు ఇవ్వడం లేదని అంగన్‌వాడీ టీచర్‌ను అడిగింది. నీ పేరు రికార్డుల నుంచి తొలగించాం అని చెబితే.. ఆమె మళ్లీ అడగలేదు. అయితే ఏడాదిగా అనిత ప్రతి నెలా సంతకం చేసి బాలామృతం తీసుకున్నట్లుగా రికార్డుల్లో నమోదు చేశారని ఐసీడీఎస్ అధికారులు వచ్చి చెబితే గానీ విషయం బయటపడలేదు. తాను ఏరోజు రికార్డుల్లో సంతకం పెట్టలేదని, బాలామృతం తీసుకోలేదని అనిత చెబుతోంది.
చర్యలు తీసుకుంటాం
బలరాంనగర్ కాలనీలో దొరికిన బాలామృతం పాకెట్లపై విచారణ ప్రారంభించాం. అసలు అతని దగ్గరికి అవి ఎలా చేరాయి, అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ఎలా బయటకు వెళ్లిందనే విషయాన్ని లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి విచారణ చేస్తున్నాం. ఈ విషయాలన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయి.
– చందనేశ్వరీ, కల్వకుర్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి
Comments
Please login to add a commentAdd a comment