Balamrutham scheme
-
‘బ్లాక్‌మార్కెట్‌కు బాలామృతం’పై సమగ్ర విచారణ
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో చిన్నారులకు అందించే బాలామృతం పంపిణీలో అక్రమాలు జరుగుతున్న తీరుపై ‘బ్లాక్‌మార్కెట్‌కు బాలామృతం’ అనే శీర్షికతో ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. చిన్నారులకు పంపిణీ చేసే బాలామృతం కవర్లు పొలాల్లో కుప్పలుగా దొరకడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపిణీ ఎలా జరుగుతుందనే అంశంపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జగదీశ్వర్‌ను ఆదేశించారు. దీంతో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారిని విచారణ అధికారులుగా ఆయన నియమించారు. బాలామృతం ప్యాకెట్లు పంపిణీ జరిగిన తీరు, వినియోగంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. రైతు పొలంలో కుప్పలుగా ఉన్న ప్యాకెట్లు ఎక్కడివో కూడా పరిశీలించాలన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పంపిణీ, లబ్ధిదారులు, వినియోగం తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించడంతో అధికారులు సైతం హుటాహుటిన విచారణ క్రమాన్ని మొదలుపెట్టారు. మరోవైపు బాలామృతం పంపిణీపై నిఘా ఏర్పాటు చేయాలని, నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ‘బాలామృతం పక్కదారి’పై ఆరా కేశంపేట: ‘బ్లాక్ మార్కెట్‌కు బాలామృతం’శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు స్పందించారు. హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సునంద, రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ మోతీ తదితరులు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రికార్డులను, బాలామృతంను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులు బాలామృతంను సక్రమంగా తీసుకెళ్తున్నారా లేదా అని చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి ఆరా తీశారు. పొలంలో పడేసిన బాలామృతం ఖాళీ ప్యాకెట్లను పరిశీలించారు. ఎవరైనా బాలామృతం ప్యాకెట్లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొత్తపేట సర్పంచ్ కమ్లేకర్ నవీన్‌కుమార్, షాద్‌నగర్ ఐసీడీఎస్ సీడీపీఓ నాగమణి, సూపర్వైజర్లు పద్మ, విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా పంపిణీలో భారీగా గోల్మాల్
సాక్షి, హైదరాబాద్ : బాలల్లో పోషక సమస్యలను అధిగమించే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బాలామృతం దారి తప్పుతోంది. అధికారుల నిఘా కొరవడటం, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ లోపించడంతో అంగన్వాడీలకు చేరుతున్న బాలామృతం లబ్ధిదారుల చెంతకు చేరకుండానే గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతోంది. అంగన్వాడీ కేంద్రాలను సకాలంలో తెరవకపోవడం, లబ్ధిదారులకు పంపిణీలో జాప్యం చేస్తుండటంతో పేరుకుపోయిన స్టాకును వెనక్కి పంపకుండా నిర్వాహకులు టోకుగా వ్యాపారులు, రైతులకు విక్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బాలామృతం పంపిణీ ప్రక్రియ తంతు ఇదే తరహాలో జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే గుడ్లు, నూనె ప్యాకెట్లు, బియ్యం కోటాను కూడా అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. మెనూ ప్రకారం ఇవ్వాల్సి ఉన్నా... రాష్ట్రంలో 149 సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ప్రాజెక్టులున్నాయి. ఇందులో 99 ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 25 ప్రాజెక్టులు పట్టణ ప్రాంతాల్లో, మరో 25 ప్రాజెక్టులు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గత నెల గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 4,31,310 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. అలాగే ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు ఉన్న చిన్నారులు 10,42,675 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులు 6,54,165 మంది ఉన్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మెనూ ప్రకారం పాలు, గుడ్డు, భోజనంతోపాటు బాలామృతంతో చేసిన పదార్థాలను పంపిణీ చేయాలి. దీనికి అదనంగా ఇంటి వద్ద కూడా తినేందుకు వీలుగా నిర్దేశిత మొత్తాన్ని ప్యాకెట్ రూపంలో ఇవ్వాలి. కానీ చాలా చోట్ల బాలామృతం పంపిణీ జరగట్లేదు. అంగన్వాడీ కేంద్రాల్లో సమయపాలన సాగకపోవడం, తెరిచిన సమయంలో పిల్లల హాజరు లేకపోవడంతో బాలామృతం పంపిణీ ఆశించిన స్థాయిలో లేదు. పంపిణీ కాదు... వెనక్కు రాదు... అంగన్వాడీలకు సరఫరా చేసే బాలామృతం స్టాకును చిన్నారులకు ఇవ్వడంలో అవకతవకలు జరుగుతున్న అంశంపై ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులు దాదాపు 17 లక్షల మంది నమోదైనప్పటికీ వారి హాజరు శాతం ఆధారంగా బాలామృతాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నెలకు సగటున 325 మెట్రిక్ టన్నుల బాలామృతాన్ని పంపుతున్నా ఇందులో సగం కూడా పిల్లలకు చేరడం లేదనే ఆరోపణలున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు హాజరయ్యే చిన్నారుల్లో మూడేళ్లలోపు వారికి రోజుకు వంద గ్రాములు, ఆరేళ్లలోపు వారికి రోజుకు 50 గ్రాముల చొప్పున బాలామృతాన్ని ఇవ్వాలి. వాటికి అధనంగా ప్రతిరోజూ పాలు, ఉడికించిన కోడిగుడ్డు, మినీ మీల్ ఇవ్వాలి. మూడేళ్లలోపు చిన్నారికి అదనంగా తల్లిపాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మెజారిటీ అంగన్వాడీ కేంద్రాలు సమయానికి తెరుచుకోవడం లేదు. కొన్నిచోట్ల తెరిచినప్పటికీ చిన్నారుల హాజరు శాతం ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో బాలామృతం, ఇతర ఆహారాల పంపిణీ అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే నెలావారీగా ఈ కేంద్రాలకు ప్రభుత్వం స్టాకు పంపిణీ చేస్తున్నప్పటికీ అంతటా పూర్తిస్థాయి కోటాను లబ్ధిదారులకు ఇస్తున్నట్లు రికార్డులున్నాయి. ఎక్కడ కూడా స్టాకు మిగిలిందంటూ తిరిగి వెనక్కు పంపడమో లేదా తదుపరి కోటాను తగ్గించి తీసుకోవడమో చోటుచేసుకోవట్లేదు. మరి పంపిణీ కాని స్టాకు ఎక్కడికి వెళ్తోందనే దానిపై అధికారులకు సందేహాలున్నప్పటికీ ఇప్పటిదాకా చర్యలు మాత్రం లేవు. చాలాచోట్ల బాలామృతం కోటాను రైతులకు, ఇతర ఫీడ్ దుకాణాలకు నిర్వాహకులు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బాలామృతాన్ని పశువుల దాణాగా చాలా మంది రైతులు వినియోగిస్తున్నట్లు సమాచారం. బాలామృతం అంటే... చిన్నారులకు అత్యధిక పోషకాలు అందేందుకు వీలుగా ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారమే బాలామృతం. పాలపొడితోపాటు బియ్యం, గోదుమలు, శనగలు, చక్కెర ముడిపదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. వంద గ్రాముల బాలామృతం తినిపించే బాలలకు 11 గ్రాముల ప్రొటీన్లు, 367 మిల్లీగ్రాముల కాల్షియం అందడంతోపాటు మొత్తంగా 414 కేలరీల శక్తి లభిస్తుంది. మూడేళ్లలోపు చిన్నారులకు రోజుకు సగటున వంద గ్రాముల బాలామృతాన్ని (బాలామృతంతోపాటు తల్లిపాలు, ఘనాహారం కూడా ఇవ్వాలి) అందిస్తే సమతుల్య పోషకాహారం అందినట్లే. ఆకస్మిక తనిఖీలు... అంగన్వాడీల ద్వారా పిల్లలకిచ్చే పోషకాహార పంపిణీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండటంతో అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ ఎలా ఉందనే అంశంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్రాథమికంగా నిర్ణయించారు. తనిఖీలకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని, గోప్యంగా పర్యటనలు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం. తనిఖీలు ఎలా చేయాలి? తనిఖీల్లో ఎవరెవరు ఉండాలనే అంశంపై ఆ శాఖలో చర్చ జరుగుతోంది. త్వరలోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రాల స్థితిని తేల్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. సెంటర్ తెరవరు... సరుకు ఇవ్వరు మా ఊర్లోని అంగన్వాడీ కేంద్రం ఎన్నడూ టైమ్‌కు తెరుచుకోదు. బాలామృతం, గుడ్లు, బియ్యం, నూనె ప్యాకెట్లను పంపిణీ చేయరు. ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే సరుకులు రాలేదని చెబుతున్నారు. సరుకులు వచ్చేదెన్నడో, ఇచ్చేదెన్నడో అర్థమే కాదు. అందుకే సెంటర్‌కు రావడమే మానేశాం. – శ్రీనివాస్, ఓ రెండేళ్ల బాలుడి తండ్రి పాపకు అనారోగ్యం... మా దగ్గరున్న అంగన్వాడీ సెంటర్లో బాలామృతం ఇస్తున్నా అది తినిపించిన వెంటనే పాపకు విరేచనాలవుతున్నాయి. నాలుగైదు సార్లు తినిపిస్తే మోషన్స్ కావ డంతో తినిపించడం మానేశా. బాలామృ తం బదులు ఇంటి దగ్గరే ఇతర ఆహారం తినిపిస్తున్నా. – స్వాతి, ఏడాదిన్నర బాలిక తల్లి -
ఇక బాలామృతం ‘ప్లస్’!
సాక్షి, హైదరాబాద్: చిన్నారుల్లో తీవ్ర పోషక లోపాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త పౌష్టికాహారం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అన్నిరకాల పోషక విలువలున్న ఆహారంగా ‘బాలామృతా’న్ని చిన్నారులకు అందిస్తున్నారు. దీంతో చిన్నారుల పెరుగుదల సంతృప్తికరంగా ఉంటోంది. అయితే పోషకలోపాలున్న చిన్నారులకు బాలామృతం కంటే మరింత అధిక పోషణ గుణాలున్న ఆహారాన్ని ఇవ్వాలని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘బాలామృతం ప్లస్’ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం తార్నాకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ (ఎన్ఐఎన్)లో జరిగిన కార్యక్రమంలో ‘బాలామృతం ప్లస్’ను వినియోగంలోకి తెచ్చారు. ముందుగా రెండు జిల్లాల్లో... అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారుల ఆరోగ్య స్థితిని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. వారి బరువు, ఎదుగుదలను క్రమం తప్పకుండా కొలవడంతో పాటు వారి ఆరోగ్య స్థితిని సైతం రికార్డు చేస్తుంది. ఈక్రమంలో రాష్ట్రస్థాయి నివేదికను విశ్లేషించగా... కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఎక్కువ మంది చిన్నారులు తీవ్ర పోషక లోపాల బారిన పడినట్లు గుర్తించారు. ఇలాంటి వారికి సాధారణ ఆహారంతో పాటు అధిక పోషక విలువలున్న ఆహారాన్ని ఇవ్వాలి. అలా అయితేనే వారు ఐదేళ్ల వయసొచ్చేసరికి పోషక లోపాలు అధిగమించడంతో పాటు ఆ తర్వాత ఎదుగుదల సాధారణంగా మారుతుంది. ఈ అంశంపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ యంత్రాంగంతో పాటు ఎన్ఐఎన్, టీఎస్ ఫుడ్స్, యూనిసెఫ్ అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి పోషక విలువలు ఎక్కువగా ఉన్న బాలామృతం ప్లస్‌ను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్, యూనిసెఫ్ దక్షిణాది రాష్ట్రాల చీఫ్ మిషల్ రాస్డియా తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆహారంలో... కొత్తగా తీసుకొచ్చిన బాలామృతం ప్లస్‌లో పాలపొడి, పల్లీ నూనె, రైస్, వీట్, బెంగాల్‌గ్రామ్, చక్కెరతో పాటు కొవ్వు పదార్థాలు సమృద్ధిగా ఉండే మిశ్రమాలను జత చేస్తారు. దీంతో పోషక విలువలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం బాలామృతం ప్లస్‌ను కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రెండు జిల్లాల్లో నెలకు సగటున టన్ను బాలామృతం ప్లస్ సరఫరా చేసేలా తయారు చేస్తున్నారు. డిమాండ్‌కు తగినట్లు పరిమాణాన్ని పెంచేందుకు టీఎస్‌ఫుడ్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్లస్ ఆహారాన్ని అందిస్తూ చిన్నారుల ఎదుగుదల, పోషక లోపాల తీరును వరుసగా మూడు నెలల పాటు పరిశీలిస్తారు. ఫలితాల ఆధారంగా వచ్చే ఏడాది మరో 10 జిల్లాల్లో బాలామృతం ప్లస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తోంది. -
పౌష్టికాహారం పక్కదారి!
కల్వకుర్తి టౌన్ : భావిభారతమైన చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. రూ.లక్షలు వెచ్చించి సమకూరుస్తున్న ఎంతో విలువైన ’బాలామృతం’ పశువుల పాలు అవుతోంది. చిన్నారుల పోష్టికాహార లోపాన్ని తొలగించడానికి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 12రకాల పోషక పదార్థాలతో కూడిన బాలామృతంను పంపిణీ చేస్తోంది. అయితే దీన్ని ఎక్కువగా పాడిపశువులకు దాణాగా వాడుతున్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఈ బాలామృతాన్ని ప్రతి చిన్నారికి పుట్టిన ఏడవ నెల నుంచి మూడేళ్ల వరకు అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కువగా వలసలు వెళుతూ వారి పిల్లలను ముసలోళ్ల వద్ద ఇంటి వద్దే ఉంచుతున్నారు. ఆ చిన్నారులకు అత్యధిక పోషక విలువలు కలిగిన తల్లి పాలు లేకపోవడంతో వారికోసం పంపిణీ చేరాల్సిన బాలామృతం పాకెట్లు పక్కదారి పడుతున్న విషయం బయటపడింది. కార్డెన్‌సెర్చ్‌లో భాగంగా శనివారం రాత్రి కల్వకుర్తి పట్టణంలోని బలరాంనగర్ కాలనీలో పోలీసులు ఇంటింటి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలనీలోని యాదగిరి అనే వ్యక్తి ఇంట్లో భారీగా 46పాకెట్ల అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ చేసే బాలామృతం పాకెట్లు దొరికాయి. అది చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని, ఈ పాకెట్లు ఎక్కడవనే విషయంపై ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన తనిఖీల్లో గతంలో చార్మినార్ ప్రాంతంలో, తర్వాత కల్వకుర్తి పట్టణంలో బాలామృతం దొరికిందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే యాదగిరిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అంగన్వాడీ టీచర్ల నుంచే ఈ పాకెట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాకెట్లను యాదగిరి తన పొలంలోని షెడ్డులో ఉన్న పశువులకు దాణాగా వేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో చాలా ప్రాంతాల్లో బాలామృతంపాకెట్లను పాడిపశువులకు దాణాగా వేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 18 ప్రాజెక్టులు ఉండగా అందులో 4,322అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 7 ప్రాజెక్టులు ఉండగా అందులో 1,889 అంగన్వాడీ కేంద్రాల్లో 73,368మంది చిన్నారులు ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 5 ప్రాజెక్టులు ఉండగా అందులో 1,131 అంగన్వాడీ కేంద్రాల్లో 10,275 మంది చిన్నారులు ఉన్నారు. అలాగే వనపర్తి జిల్లాలో 3 ప్రాజెక్టులకు గాను 589 అంగన్వాడీ కేంద్రాల్లో 25,523 మంది చిన్నారులు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 3 ప్రాజెక్టుల పరిధిలో 713 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 24,900 మంది చిన్నారులు ఉన్నారు. ఇలా ఉమ్మడి జిల్లాతో కలుపుకొని 1,64,911మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ కలిపి ప్రతినెలా ఒక్కో చిన్నారికి 2.5 కిలోల బాలామృతాన్ని ఇస్తారు. ఇంటింటి విచారణ.. కార్డెన్ సెర్చ్‌లో దొరికిన బాలామృతం ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయమై ఐసీడీఎస్ అధికా రులు ఇంటింటి విచారణ చేపట్టారు. రాష్ట్ర పౌష్టికాహార సంస్థ ప్రతినిధి ఎలక్షన్ రెడ్డి కూడా ఈ విషయమై కల్వకుర్తి పోలీసుల నుంచి సమాచారం తీసుకున్నారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని ఐసీడీఎస్ అధికారులకు ఆదేశించారు. బలరాంనగర్ కాలనీలో మొత్తం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అందులో ఎంతమంది బాలామృతం తీసుకున్నారు, ఎవరెవరికి అందలేదో.. ఇంటింటికి వెళ్లి విచారణ చేపట్టారు. అయితే విచారణ చేస్తున్న అధికారులు అక్కడి లబ్ధిదారులు చెప్పే విషయాలు విని నివ్వెరపోతున్నారు. స్థానిక అంగన్వాడి కేంద్రానికి వెళ్లి బాలామృతం అడిగితే అసలు మీ బిడ్డపేరు రిజిస్టర్లో లేదని అంగన్వాడీ టీచర్ చెప్పినట్లు ఓ మహిళ తెలిపింది. ఐసీడీఎస్ అధికారులు రికార్డులు పరిశీలించగా.. సదరు మహిళ పేరు రిజిస్టర్లో ఉందని, బాలామృతం క్రమం తప్పకుండా తీసుకుంటున్నట్లు సంతకాలు చేసినట్లు గుర్తించారు. అలాగే కాలనీలో చాలామంది మహిళలు సంతకాలు చేసి, ప్రతినెలా బాలామృతం తీసుకున్నట్లు రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో దొంగ సంతకాలతో బాలమృతం పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని అధికారులు తెలిపారు. రిజిస్టర్లో పేరులేదని చెప్పి.. ఈమె బలరాంనగర్‌కు చెందిన అనిత. ఆమెకు 2016లో బిడ్డ పుట్టింది. అప్పుడు అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేయించుకుంది. బిడ్డ పుట్టిన ఆరు నెలల తర్వాత బాలామృతం ఇస్తారని తెలిసి.. నా బిడ్డకు ఎందుకు ఇవ్వడం లేదని అంగన్వాడీ టీచర్‌ను అడిగింది. నీ పేరు రికార్డుల నుంచి తొలగించాం అని చెబితే.. ఆమె మళ్లీ అడగలేదు. అయితే ఏడాదిగా అనిత ప్రతి నెలా సంతకం చేసి బాలామృతం తీసుకున్నట్లుగా రికార్డుల్లో నమోదు చేశారని ఐసీడీఎస్ అధికారులు వచ్చి చెబితే గానీ విషయం బయటపడలేదు. తాను ఏరోజు రికార్డుల్లో సంతకం పెట్టలేదని, బాలామృతం తీసుకోలేదని అనిత చెబుతోంది. చర్యలు తీసుకుంటాం బలరాంనగర్ కాలనీలో దొరికిన బాలామృతం పాకెట్లపై విచారణ ప్రారంభించాం. అసలు అతని దగ్గరికి అవి ఎలా చేరాయి, అంగన్వాడీ కేంద్రాల నుంచి ఎలా బయటకు వెళ్లిందనే విషయాన్ని లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి విచారణ చేస్తున్నాం. ఈ విషయాలన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయి. – చందనేశ్వరీ, కల్వకుర్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి -
అటకెక్కిన ‘బాలామృతం’
రాష్ట్ర విభజనతో పౌడర్ దిగుమతికి గండి సాక్షి, హైదరాబాద్: విభజన రాజకీయాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ సంస్థలో కొనసాగే బాలల పౌష్టికాహారం పథకం ‘బాలామృతం’ కొండెక్కింది. ప్రతి నెలా దాదా పు ఇరవై మూడు లక్షల మందికి పైగా బాలలు, బాలింతలు, గర్భిణులకు బలవర్ధక ఆహారం పంపిణీకి బ్రేక్ పడింది. ఆరోగ్య భారతం కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ పథకం అటకెక్కి రెండు నెలలు కావస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆహారం తయారు చేసి పెట్టే ఏకైక కర్మాగారంగా హైదరాబాద్‌లో ఉన్న నాచారం ఏపీ ఫుడ్స్ (ప్రస్తుతం టీఎస్ ఫుడ్స్‌గా పేరు మార్పు) ఫ్యాక్టరీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫ్యాక్టరీగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం విముఖత చూపుతోందని, తాము ఆహారం పంపిణీ చేయబోమని సదరు ఫ్యాక్టరీ తేల్చిచెప్పినట్టు ప్రచారం వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా మంకుపట్టుతో పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడంతో అంగన్వాడీ బాలలకు సాదాసీదా ఆహారం కూడా లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పౌడర్ అక్టోబర్ నెలాఖరు వరకు మాత్రమే పంపిణీ జరిగింది. ఇందుకు గాను ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి విడిపోయినప్పటి నుంచి దాదాపు రూ. 95 కోట్లు బకాయి రూపంలో చెల్లించాల్సి ఉందని ఆ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. పదో షెడ్యూల్లో ఉన్నందున ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడాల్సిన పరిశ్రమకు దాదాపు రూ. 20 కోట్లు చెల్లింపులు జరిపామని, వీలు వెంబడి మిగిలింది ఇస్తామని ఏపీ అధికారులు చెప్తున్నారు. పౌష్టికాహారం దిగుమతి గురించి మాత్రం అధికారికంగా నోరు మెదపడం లేదు. ఆ విషయం నాకు తెలియదు: మంత్రి ప్రభుత్వం అందించే బాలామృతం ఒక్కసారిగా ఆగిపోవడంతో ఏపీలో పేదబాలలు, బాలిం తలు ఉసూరుమంటున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు శనివారం సంక్షేమ విభాగాలపై సమీక్ష చేసినా ఈ అంశం చర్చకు రాలేదని, తనకైతే అసలు తెలియదని మంత్రి రావెల కిషోర్‌బాబు ‘సాక్షి’కి చెప్పారు. -
అమృతమా..విషమా?
యద్దనపూడి: కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం పేరుతో ఆరు నెలల వయస్సు నుంచి మూడేళ్లలోపు పేద పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తోంది. అయితే అధికారుల అలక్ష్యంతో గడువు మించిపోయిన పౌష్టికాహారం పంపిణీ చేస్తున్న వైనం యద్దనపూడి మండలం పూనూరులో బుధవారం వెలుగులోకి వచ్చింది. యద్దనపూడి మండలం పూనూరు సెక్టార్‌లోని 224 అంగన్వాడీ కేంద్రం పరిధిలో మంగళ, బుధవారాల్లో బాలామృతం ప్యాకెట్లు పంపిణీ చేశారు. వాటి గడువు జులై 21వ తేదీతో ముగిసిపోయింది. గడువు తీరిన ఆహారం తింటే అది విషంగా మారుతుందని తెలిసినా పసిపిల్లలకు వాటిని పంపిణీ చేయడంలో ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతోంది. ఈ విషయంపై ఐసీడీఎస్ సీడీపీవో ధనలక్ష్మి వివరణ కోరగా..విషయం తన దృష్టికి వచ్చిందని చర్యలు తీసుకుంటామన్నారు.