రాష్ట్రవ్యాప్తంగా పంపిణీలో భారీగా గోల్‌మాల్‌ | Balamrutham Not Reaching Anganwadi Centres Moving To Black Market | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ మార్కెట్‌కు బాలామృతం..!

Published Sun, Dec 22 2019 2:18 AM | Last Updated on Sun, Dec 22 2019 11:26 AM

Balamrutham Not Reaching Anganwadi Centres Moving To Black Market - Sakshi

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలోని కొత్తపల్లి గ్రామంలో ఓ రైతు తన పశువులకు దాణాగా బాలామృతాన్ని వినియోగించిన తర్వాత పొలంలో ఖాళీ ప్యాకెట్లను పారేసిన దృశ్యం

సాక్షి, హైదరాబాద్‌ : బాలల్లో పోషక సమస్యలను అధిగమించే లక్ష్యంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బాలామృతం దారి తప్పుతోంది. అధికారుల నిఘా కొరవడటం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ లోపించడంతో అంగన్‌వాడీలకు చేరుతున్న బాలామృతం లబ్ధిదారుల చెంతకు చేరకుండానే గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతోంది. 

అంగన్‌వాడీ కేంద్రాలను సకాలంలో తెరవకపోవడం, లబ్ధిదారులకు పంపిణీలో జాప్యం చేస్తుండటంతో పేరుకుపోయిన స్టాకును వెనక్కి పంపకుండా నిర్వాహకులు టోకుగా వ్యాపారులు, రైతులకు విక్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బాలామృతం పంపిణీ ప్రక్రియ తంతు ఇదే తరహాలో జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే గుడ్లు, నూనె ప్యాకెట్లు, బియ్యం కోటాను కూడా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు బ్లాక్‌ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. 

మెనూ ప్రకారం ఇవ్వాల్సి ఉన్నా... 
రాష్ట్రంలో 149 సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) ప్రాజెక్టులున్నాయి. ఇందులో 99 ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 25 ప్రాజెక్టులు పట్టణ ప్రాంతాల్లో, మరో 25 ప్రాజెక్టులు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. గత నెల గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 4,31,310 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. అలాగే ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు ఉన్న చిన్నారులు 10,42,675 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులు 6,54,165 మంది ఉన్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మెనూ ప్రకారం పాలు, గుడ్డు, భోజనంతోపాటు బాలామృతంతో చేసిన పదార్థాలను పంపిణీ చేయాలి. దీనికి అదనంగా ఇంటి వద్ద కూడా తినేందుకు వీలుగా నిర్దేశిత మొత్తాన్ని ప్యాకెట్‌ రూపంలో ఇవ్వాలి. కానీ చాలా చోట్ల బాలామృతం పంపిణీ జరగట్లేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సమయపాలన సాగకపోవడం, తెరిచిన సమయంలో పిల్లల హాజరు లేకపోవడంతో బాలామృతం పంపిణీ ఆశించిన స్థాయిలో లేదు. 

పంపిణీ కాదు... వెనక్కు రాదు... 
అంగన్‌వాడీలకు సరఫరా చేసే బాలామృతం స్టాకును చిన్నారులకు ఇవ్వడంలో అవకతవకలు జరుగుతున్న అంశంపై ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులు దాదాపు 17 లక్షల మంది నమోదైనప్పటికీ వారి హాజరు శాతం ఆధారంగా బాలామృతాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నెలకు సగటున 325 మెట్రిక్‌ టన్నుల బాలామృతాన్ని పంపుతున్నా ఇందులో సగం కూడా పిల్లలకు చేరడం లేదనే ఆరోపణలున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు హాజరయ్యే చిన్నారుల్లో మూడేళ్లలోపు వారికి రోజుకు వంద గ్రాములు, ఆరేళ్లలోపు వారికి రోజుకు 50 గ్రాముల చొప్పున బాలామృతాన్ని ఇవ్వాలి. 

వాటికి అధనంగా ప్రతిరోజూ పాలు, ఉడికించిన కోడిగుడ్డు, మినీ మీల్‌ ఇవ్వాలి. మూడేళ్లలోపు చిన్నారికి అదనంగా తల్లిపాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మెజారిటీ అంగన్‌వాడీ కేంద్రాలు సమయానికి తెరుచుకోవడం లేదు. కొన్నిచోట్ల తెరిచినప్పటికీ చిన్నారుల హాజరు శాతం ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలామృతం, ఇతర ఆహారాల పంపిణీ అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే నెలావారీగా ఈ కేంద్రాలకు ప్రభుత్వం స్టాకు పంపిణీ చేస్తున్నప్పటికీ అంతటా పూర్తిస్థాయి కోటాను లబ్ధిదారులకు ఇస్తున్నట్లు రికార్డులున్నాయి. 

ఎక్కడ కూడా స్టాకు మిగిలిందంటూ తిరిగి వెనక్కు పంపడమో లేదా తదుపరి కోటాను తగ్గించి తీసుకోవడమో చోటుచేసుకోవట్లేదు. మరి పంపిణీ కాని స్టాకు ఎక్కడికి వెళ్తోందనే దానిపై అధికారులకు సందేహాలున్నప్పటికీ ఇప్పటిదాకా చర్యలు మాత్రం లేవు. చాలాచోట్ల బాలామృతం కోటాను రైతులకు, ఇతర ఫీడ్‌ దుకాణాలకు నిర్వాహకులు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బాలామృతాన్ని పశువుల దాణాగా చాలా మంది రైతులు వినియోగిస్తున్నట్లు సమాచారం. 

బాలామృతం అంటే... 
చిన్నారులకు అత్యధిక పోషకాలు అందేందుకు వీలుగా ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారమే బాలామృతం. పాలపొడితోపాటు బియ్యం, గోదుమలు, శనగలు, చక్కెర ముడిపదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. వంద గ్రాముల బాలామృతం తినిపించే బాలలకు 11 గ్రాముల ప్రొటీన్లు, 367 మిల్లీగ్రాముల కాల్షియం అందడంతోపాటు మొత్తంగా 414 కేలరీల శక్తి లభిస్తుంది. మూడేళ్లలోపు చిన్నారులకు రోజుకు సగటున వంద గ్రాముల బాలామృతాన్ని (బాలామృతంతోపాటు తల్లిపాలు, ఘనాహారం కూడా ఇవ్వాలి) అందిస్తే సమతుల్య పోషకాహారం అందినట్లే.  

ఆకస్మిక తనిఖీలు... 
అంగన్‌వాడీల ద్వారా పిల్లలకిచ్చే పోషకాహార పంపిణీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండటంతో అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ ఎలా ఉందనే అంశంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్రాథమికంగా నిర్ణయించారు. తనిఖీలకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని, గోప్యంగా పర్యటనలు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం. తనిఖీలు ఎలా చేయాలి? తనిఖీల్లో ఎవరెవరు ఉండాలనే అంశంపై ఆ శాఖలో చర్చ జరుగుతోంది. త్వరలోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అంగన్‌వాడీ కేంద్రాల స్థితిని తేల్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. 

సెంటర్‌ తెరవరు... సరుకు ఇవ్వరు 
మా ఊర్లోని అంగన్‌వాడీ కేంద్రం ఎన్నడూ టైమ్‌కు తెరుచుకోదు. బాలామృతం, గుడ్లు, బియ్యం, నూనె ప్యాకెట్లను పంపిణీ చేయరు. ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే సరుకులు రాలేదని చెబుతున్నారు. సరుకులు వచ్చేదెన్నడో, ఇచ్చేదెన్నడో అర్థమే కాదు. అందుకే సెంటర్‌కు రావడమే మానేశాం. 
 – శ్రీనివాస్, ఓ రెండేళ్ల బాలుడి తండ్రి

పాపకు అనారోగ్యం... 
మా దగ్గరున్న అంగన్‌వాడీ సెంటర్‌లో బాలామృతం ఇస్తున్నా అది తినిపించిన వెంటనే పాపకు విరేచనాలవుతున్నాయి. నాలుగైదు సార్లు తినిపిస్తే మోషన్స్‌ కావ డంతో తినిపించడం మానేశా. బాలామృ తం బదులు ఇంటి దగ్గరే ఇతర ఆహారం తినిపిస్తున్నా.     
– స్వాతి, ఏడాదిన్నర బాలిక తల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement