Nutritional supplements
-
Telangana: మూడు నెలలుగా పాలు లేవ్..
వికారాబాద్‌లోని గరీబ్‌నగర్ అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేస్తున్న చిన్నారులు వీరు. ఇక్కడ రెండున్నర నెలలుగా చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలకు పాలు ఇవ్వడం లేదు. ఇదేమిటని అడిగితే పాలు అసలే రావడం లేదని నిర్వాహకులు చెప్తున్నారని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో పంపిణీ చేసే పౌష్టికాహారం సరఫరాపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ చేతులెత్తేసింది. దాదాపు మూడు నెలలుగా ఈ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పాలు అందడం లేదు. అంగన్వాడీల్లో నమోదైన చిన్నారులకు రోజుకు 100 మిల్లీలీటర్లు.. గర్భిణులు, బాలింతలకు రోజుకు 200 మిల్లీలీటర్ల చొప్పున పాలు సరఫరా చేయాల్సి ఉంది. వీటిని టెట్రా ప్యాకెట్ల రూపంలో లబ్ధిదారులకు అందిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నెలాఖరుతో అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా కాంట్రాక్టు ముగిసింది. ఇప్పటివరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కొత్త కాంట్రాక్టరు ఎంపిక టెండరు ఖరారు చేయలేదు. కనీసం పాత కాంట్రాక్టర్‌కే తాత్కాలికంగా పాల పంపిణీ బాధ్యతలనూ అప్పగించలేదు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు పాలు అందించడం లేదేమిటంటూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలను నిలదీస్తున్నారు. పాల బడ్జెట్ ఏటా రూ.100 కోట్లు పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని అధిగమించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాల పంపిణీ కోసం ఏటా దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రతినెలా సగటున 18.5 లక్షల లీటర్ల పాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లీటరు పాలకు సగటున రూ.43, ప్యాకింగ్, రవాణా చార్జీ కింద మరో రూ.9 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు చెల్లిస్తోంది. ఇంత కీలకమైన, ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాల్సిన రాష్ట్ర మహిళాశిశు సంక్షేమశాఖ నిర్లక్ష్యంతో పాల పంపిణీ నిలిచిపోయింది. మూడు నెలలుగా అందక.. కాంట్రాక్టు గడువు ముగిసే క్రమంలో సదరు సంస్థ అన్ని కేంద్రాలకు పాలు పంపిణీ చేసి ఆపేసింది. ఆ స్టాకు అందుబాటులో ఉన్నంత వరకు దాదాపు అక్టోబర్ రెండో వారం వరకు అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు పాల ప్యాకెట్లను లబ్ధిదారులకు సర్దుబాటు చేశారు. తర్వాత పంపిణీ నిలిచిపోయింది. 3 నెలలుగా పాలు అందకపోవడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో కాంట్రాక్టరే పాలు సరఫరా చేయడం లేదంటూ లబ్ధిదారులకు చెప్తున్నట్టు తెలిసింది. దీనిపై అధికారులను అడిగితే.. త్వరలో టెండర్లు ఖరారవుతాయని, పాల పంపిణీ మొదలవుతుందని చెప్తుండటం గమనార్హం. -
‘బ్లాక్‌మార్కెట్‌కు బాలామృతం’పై సమగ్ర విచారణ
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో చిన్నారులకు అందించే బాలామృతం పంపిణీలో అక్రమాలు జరుగుతున్న తీరుపై ‘బ్లాక్‌మార్కెట్‌కు బాలామృతం’ అనే శీర్షికతో ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. చిన్నారులకు పంపిణీ చేసే బాలామృతం కవర్లు పొలాల్లో కుప్పలుగా దొరకడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపిణీ ఎలా జరుగుతుందనే అంశంపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జగదీశ్వర్‌ను ఆదేశించారు. దీంతో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారిని విచారణ అధికారులుగా ఆయన నియమించారు. బాలామృతం ప్యాకెట్లు పంపిణీ జరిగిన తీరు, వినియోగంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. రైతు పొలంలో కుప్పలుగా ఉన్న ప్యాకెట్లు ఎక్కడివో కూడా పరిశీలించాలన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పంపిణీ, లబ్ధిదారులు, వినియోగం తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించడంతో అధికారులు సైతం హుటాహుటిన విచారణ క్రమాన్ని మొదలుపెట్టారు. మరోవైపు బాలామృతం పంపిణీపై నిఘా ఏర్పాటు చేయాలని, నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ‘బాలామృతం పక్కదారి’పై ఆరా కేశంపేట: ‘బ్లాక్ మార్కెట్‌కు బాలామృతం’శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు స్పందించారు. హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సునంద, రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ మోతీ తదితరులు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రికార్డులను, బాలామృతంను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులు బాలామృతంను సక్రమంగా తీసుకెళ్తున్నారా లేదా అని చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి ఆరా తీశారు. పొలంలో పడేసిన బాలామృతం ఖాళీ ప్యాకెట్లను పరిశీలించారు. ఎవరైనా బాలామృతం ప్యాకెట్లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొత్తపేట సర్పంచ్ కమ్లేకర్ నవీన్‌కుమార్, షాద్‌నగర్ ఐసీడీఎస్ సీడీపీఓ నాగమణి, సూపర్వైజర్లు పద్మ, విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా పంపిణీలో భారీగా గోల్మాల్
సాక్షి, హైదరాబాద్ : బాలల్లో పోషక సమస్యలను అధిగమించే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బాలామృతం దారి తప్పుతోంది. అధికారుల నిఘా కొరవడటం, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ లోపించడంతో అంగన్వాడీలకు చేరుతున్న బాలామృతం లబ్ధిదారుల చెంతకు చేరకుండానే గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతోంది. అంగన్వాడీ కేంద్రాలను సకాలంలో తెరవకపోవడం, లబ్ధిదారులకు పంపిణీలో జాప్యం చేస్తుండటంతో పేరుకుపోయిన స్టాకును వెనక్కి పంపకుండా నిర్వాహకులు టోకుగా వ్యాపారులు, రైతులకు విక్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బాలామృతం పంపిణీ ప్రక్రియ తంతు ఇదే తరహాలో జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే గుడ్లు, నూనె ప్యాకెట్లు, బియ్యం కోటాను కూడా అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. మెనూ ప్రకారం ఇవ్వాల్సి ఉన్నా... రాష్ట్రంలో 149 సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ప్రాజెక్టులున్నాయి. ఇందులో 99 ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 25 ప్రాజెక్టులు పట్టణ ప్రాంతాల్లో, మరో 25 ప్రాజెక్టులు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గత నెల గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 4,31,310 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. అలాగే ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు ఉన్న చిన్నారులు 10,42,675 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులు 6,54,165 మంది ఉన్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మెనూ ప్రకారం పాలు, గుడ్డు, భోజనంతోపాటు బాలామృతంతో చేసిన పదార్థాలను పంపిణీ చేయాలి. దీనికి అదనంగా ఇంటి వద్ద కూడా తినేందుకు వీలుగా నిర్దేశిత మొత్తాన్ని ప్యాకెట్ రూపంలో ఇవ్వాలి. కానీ చాలా చోట్ల బాలామృతం పంపిణీ జరగట్లేదు. అంగన్వాడీ కేంద్రాల్లో సమయపాలన సాగకపోవడం, తెరిచిన సమయంలో పిల్లల హాజరు లేకపోవడంతో బాలామృతం పంపిణీ ఆశించిన స్థాయిలో లేదు. పంపిణీ కాదు... వెనక్కు రాదు... అంగన్వాడీలకు సరఫరా చేసే బాలామృతం స్టాకును చిన్నారులకు ఇవ్వడంలో అవకతవకలు జరుగుతున్న అంశంపై ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులు దాదాపు 17 లక్షల మంది నమోదైనప్పటికీ వారి హాజరు శాతం ఆధారంగా బాలామృతాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నెలకు సగటున 325 మెట్రిక్ టన్నుల బాలామృతాన్ని పంపుతున్నా ఇందులో సగం కూడా పిల్లలకు చేరడం లేదనే ఆరోపణలున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు హాజరయ్యే చిన్నారుల్లో మూడేళ్లలోపు వారికి రోజుకు వంద గ్రాములు, ఆరేళ్లలోపు వారికి రోజుకు 50 గ్రాముల చొప్పున బాలామృతాన్ని ఇవ్వాలి. వాటికి అధనంగా ప్రతిరోజూ పాలు, ఉడికించిన కోడిగుడ్డు, మినీ మీల్ ఇవ్వాలి. మూడేళ్లలోపు చిన్నారికి అదనంగా తల్లిపాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మెజారిటీ అంగన్వాడీ కేంద్రాలు సమయానికి తెరుచుకోవడం లేదు. కొన్నిచోట్ల తెరిచినప్పటికీ చిన్నారుల హాజరు శాతం ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో బాలామృతం, ఇతర ఆహారాల పంపిణీ అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే నెలావారీగా ఈ కేంద్రాలకు ప్రభుత్వం స్టాకు పంపిణీ చేస్తున్నప్పటికీ అంతటా పూర్తిస్థాయి కోటాను లబ్ధిదారులకు ఇస్తున్నట్లు రికార్డులున్నాయి. ఎక్కడ కూడా స్టాకు మిగిలిందంటూ తిరిగి వెనక్కు పంపడమో లేదా తదుపరి కోటాను తగ్గించి తీసుకోవడమో చోటుచేసుకోవట్లేదు. మరి పంపిణీ కాని స్టాకు ఎక్కడికి వెళ్తోందనే దానిపై అధికారులకు సందేహాలున్నప్పటికీ ఇప్పటిదాకా చర్యలు మాత్రం లేవు. చాలాచోట్ల బాలామృతం కోటాను రైతులకు, ఇతర ఫీడ్ దుకాణాలకు నిర్వాహకులు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బాలామృతాన్ని పశువుల దాణాగా చాలా మంది రైతులు వినియోగిస్తున్నట్లు సమాచారం. బాలామృతం అంటే... చిన్నారులకు అత్యధిక పోషకాలు అందేందుకు వీలుగా ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారమే బాలామృతం. పాలపొడితోపాటు బియ్యం, గోదుమలు, శనగలు, చక్కెర ముడిపదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. వంద గ్రాముల బాలామృతం తినిపించే బాలలకు 11 గ్రాముల ప్రొటీన్లు, 367 మిల్లీగ్రాముల కాల్షియం అందడంతోపాటు మొత్తంగా 414 కేలరీల శక్తి లభిస్తుంది. మూడేళ్లలోపు చిన్నారులకు రోజుకు సగటున వంద గ్రాముల బాలామృతాన్ని (బాలామృతంతోపాటు తల్లిపాలు, ఘనాహారం కూడా ఇవ్వాలి) అందిస్తే సమతుల్య పోషకాహారం అందినట్లే. ఆకస్మిక తనిఖీలు... అంగన్వాడీల ద్వారా పిల్లలకిచ్చే పోషకాహార పంపిణీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండటంతో అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ ఎలా ఉందనే అంశంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్రాథమికంగా నిర్ణయించారు. తనిఖీలకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని, గోప్యంగా పర్యటనలు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం. తనిఖీలు ఎలా చేయాలి? తనిఖీల్లో ఎవరెవరు ఉండాలనే అంశంపై ఆ శాఖలో చర్చ జరుగుతోంది. త్వరలోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రాల స్థితిని తేల్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. సెంటర్ తెరవరు... సరుకు ఇవ్వరు మా ఊర్లోని అంగన్వాడీ కేంద్రం ఎన్నడూ టైమ్‌కు తెరుచుకోదు. బాలామృతం, గుడ్లు, బియ్యం, నూనె ప్యాకెట్లను పంపిణీ చేయరు. ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే సరుకులు రాలేదని చెబుతున్నారు. సరుకులు వచ్చేదెన్నడో, ఇచ్చేదెన్నడో అర్థమే కాదు. అందుకే సెంటర్‌కు రావడమే మానేశాం. – శ్రీనివాస్, ఓ రెండేళ్ల బాలుడి తండ్రి పాపకు అనారోగ్యం... మా దగ్గరున్న అంగన్వాడీ సెంటర్లో బాలామృతం ఇస్తున్నా అది తినిపించిన వెంటనే పాపకు విరేచనాలవుతున్నాయి. నాలుగైదు సార్లు తినిపిస్తే మోషన్స్ కావ డంతో తినిపించడం మానేశా. బాలామృ తం బదులు ఇంటి దగ్గరే ఇతర ఆహారం తినిపిస్తున్నా. – స్వాతి, ఏడాదిన్నర బాలిక తల్లి -
బాలలకు అమృతం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులపై మహిళా శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్) ప్రత్యేక దృష్టి సారించింది. వయసుకు తగిన బరువు లేకుండా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న ఎంటీఎఫ్ స్థానంలో ‘బాలామృతం’ పేరుతో అధిక పోషక విలువలు గల పౌష్టికాహారాన్ని అందిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులందరికీ రెండున్నర కేజీల బాలామృతం ప్యాకెట్లను ఈ ఏడాది మే ఒకటి నుంచి అందజేస్తోంది. జిల్లాలోని 21 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 4,094 అంగన్వాడీ కేంద్రాల్లో రెండున్నర నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు ఎంటీఎఫ్‌ను అందిస్తూ వస్తున్నారు. అయితే చిన్నారుల్లో వయసుకు తగిన బరువు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఎంటీఎఫ్ స్థానంలో బాలామృతం పేరుతో అధిక పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని చేర్చారు. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకు సరిపడే విధంగా వేరుశనగ పప్పు, వేయించిన గోదుమలు, పంచదార, పాలపొడి మిశ్రమాలతో కూడిన రెండున్నర కేజీల బాలామృతం ప్యాకెట్‌ను చిన్నారుల తల్లులకు అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో స్కేళ్లు అంగన్వాడీ కేంద్రాల్లో స్కేళ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు వీటిని నామ్‌కే వాస్తేగా వినియోగిస్తూ వచ్చారు. బాలామృతం పథకం రాకతో స్కేళ్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్రాల పరిధిలోని చిన్నారులు ఎంత ఎత్తు ఉన్నారో వారం రోజులకు ఒకసారి చూడటం, వారు ఎంత బరువు ఉన్నారో పరిశీలించడం తప్పనిసరి చేశారు. వయసుకు తగిన బరువు లేకుంటే అలాంటి చిన్నారుల విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. బాలామృతం ద్వారా తక్కువ బరువు కలిగిన చిన్నారుల్లో రాకుంటే వైద్యులకు చూపించి ఆ చిన్నారి ఆరోగ్యపరమైన సమస్యలు ముందుగానే తెలుసుకునే విధంగా తల్లులను చైతన్యపరిచేందుకు ఐసీడీఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తల్లులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తక్కువ బరువు గల చిన్నారుల్లో మార్పు వచ్చే అవకాశాలున్నాయి.