ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులపై మహిళా శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్) ప్రత్యేక దృష్టి సారించింది. వయసుకు తగిన బరువు లేకుండా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న ఎంటీఎఫ్ స్థానంలో ‘బాలామృతం’ పేరుతో అధిక పోషక విలువలు గల పౌష్టికాహారాన్ని అందిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులందరికీ రెండున్నర కేజీల బాలామృతం ప్యాకెట్లను ఈ ఏడాది మే ఒకటి నుంచి అందజేస్తోంది.
జిల్లాలోని 21 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 4,094 అంగన్‌వాడీ కేంద్రాల్లో రెండున్నర నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు ఎంటీఎఫ్‌ను అందిస్తూ వస్తున్నారు. అయితే చిన్నారుల్లో వయసుకు తగిన బరువు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఎంటీఎఫ్ స్థానంలో బాలామృతం పేరుతో అధిక పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని చేర్చారు. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకు సరిపడే విధంగా వేరుశనగ పప్పు, వేయించిన గోదుమలు, పంచదార, పాలపొడి మిశ్రమాలతో కూడిన రెండున్నర కేజీల బాలామృతం ప్యాకెట్‌ను చిన్నారుల తల్లులకు అందిస్తున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో స్కేళ్లు
అంగన్‌వాడీ కేంద్రాల్లో స్కేళ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు వీటిని నామ్‌కే వాస్తేగా వినియోగిస్తూ వచ్చారు. బాలామృతం పథకం రాకతో స్కేళ్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్రాల పరిధిలోని చిన్నారులు ఎంత ఎత్తు ఉన్నారో వారం రోజులకు ఒకసారి చూడటం, వారు ఎంత బరువు ఉన్నారో పరిశీలించడం తప్పనిసరి చేశారు. వయసుకు తగిన బరువు లేకుంటే అలాంటి చిన్నారుల విషయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. బాలామృతం ద్వారా తక్కువ బరువు కలిగిన చిన్నారుల్లో రాకుంటే వైద్యులకు చూపించి ఆ చిన్నారి ఆరోగ్యపరమైన సమస్యలు ముందుగానే తెలుసుకునే విధంగా తల్లులను చైతన్యపరిచేందుకు ఐసీడీఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తల్లులతో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలకూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తక్కువ బరువు గల చిన్నారుల్లో మార్పు వచ్చే అవకాశాలున్నాయి.
బాలలకు అమృతం
Published Mon, May 19 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement
Advertisement