కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం పేరుతో ఆరు నెలల వయస్సు నుంచి మూడేళ్లలోపు పేద పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తోంది.
యద్దనపూడి: కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం పేరుతో ఆరు నెలల వయస్సు నుంచి మూడేళ్లలోపు పేద పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తోంది. అయితే అధికారుల అలక్ష్యంతో గడువు మించిపోయిన పౌష్టికాహారం పంపిణీ చేస్తున్న వైనం యద్దనపూడి మండలం పూనూరులో బుధవారం వెలుగులోకి వచ్చింది. యద్దనపూడి మండలం పూనూరు సెక్టార్‌లోని 224 అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో మంగళ, బుధవారాల్లో బాలామృతం ప్యాకెట్లు పంపిణీ చేశారు.
వాటి గడువు జులై 21వ తేదీతో ముగిసిపోయింది. గడువు తీరిన ఆహారం తింటే అది విషంగా మారుతుందని తెలిసినా పసిపిల్లలకు వాటిని పంపిణీ చేయడంలో ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతోంది. ఈ విషయంపై ఐసీడీఎస్ సీడీపీవో ధనలక్ష్మి వివరణ కోరగా..విషయం తన దృష్టికి వచ్చిందని చర్యలు తీసుకుంటామన్నారు.