సాక్షి, అమరావతి: బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు పటిష్టంగా అమలవుతున్నాయి. గిరిజనులకు ప్రత్యేక పౌష్టికాహారం అందించేందుకు తీసుకున్న ప్రత్యేక చర్యలూ ప్రశంసలందుకుంటున్నాయి. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు బాగుందని, పౌష్టికాహారలోపం గల గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో బాగా పనిచేస్తున్నారని పోషణ్ అభియాన్ మూడో నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వివిధ రాష్ట్రాల్లో సమగ్ర శిశు అభివృద్ధి సర్వీసు–కామన్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) వినియోగంపై పోషణ్ అభియాన్ సర్వే నిర్వహించి మూడో నివేదికను గత నెలలో సమర్పించింది. ఈ నివేదికలో వివిధ రాష్ట్రాల అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై రంగాల వారీగా ర్యాంకులు ఇచ్చింది. సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపైన, గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహారలోపం మీద దృష్టి సారించిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లోనే గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంపైన దృష్టి సారించడమే కాకుండా సమీక్షలు నిర్వహించి మెనూను కూడా స్వయంగా సీఎం రూపొందించారు. దీంతో రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరులో సమూల మార్పులతోపాటు పౌష్టికాహారం అందించడంలో పురోగతి పోషణ్ అభియాన్ నివేదికలో ప్రస్ఫుటం అయ్యింది.
పోషణ్ అభియాన్ నివేదికలోని ముఖ్యాంశాలు
► 55,586 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్–సీఏఎస్ వినియోగిస్తున్నారు. ఇది 99.96 శాతం. రెండో ర్యాంకు.
► 2,210 మంది మహిళా సూపర్‌వైజర్లు సెల్‌ఫోన్ వినియోగిస్తున్నారు. ఇది 99.24 శాతం, మూడో ర్యాంకు.
► లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఇది 91.11 శాతం. రెండో ర్యాంకు.
► అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లల ఎత్తు, బరువును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇది 93.96 శాతం. రెండో ర్యాంకు.
► కమ్యూనిటీ ఈవెంట్స్‌ను 99 శాతం నిర్వహిస్తున్నారు.
► అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లల్లో 31.09 శాతం మంది ప్రీ స్కూల్స్‌కు హాజరవుతున్నారు. ఐదో ర్యాంకు.
► అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణులు, మూడునెలల నుంచి 36 నెలల పిల్లలకు ఇంటికే వెళ్లి రేషన్ అందిస్తున్నారు. ఇది 76.17 శాతం. ఆరో ర్యాంకు.
► రాష్ట్ర ప్రభుత్వం 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని దాదాపు 30.16 లక్షలమంది గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు ఏటా రూ.1,863.11 కోట్ల వ్యయంతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను అమలు చేస్తోంది. గిరిజనేతర, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తుండగా, గిరిజన ప్రాంతాల్లోని 77 మండలాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం అమలవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment