Yaddanapudi
-
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కాదనుకుని..!
సాక్షి,యద్దనపూడి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో లక్ష రూపాయల జీతంతో కూడిన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని దక్కించుకోవడమంటే ఆషామాషీ కాదు. కానీ, ఆమె మాత్రం తనను వెతుక్కుంటూ వచ్చిన ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసుకుంది. శాస్త్రీయ నృత్యంపై ఉన్న మక్కువతో ఆ దిశగా అడుగులు వేసింది. నృత్య రూపకాలపై పరిశోధన చేసి ఆధ్యాత్మిక జతులు, జావళీలకు, సామాజిక ఇతివృత్తాన్ని జోడిస్తూ నృత్య ప్రదర్శనలిస్తూ కళాభిమానుల మన్ననలు అందుకుంది. అంతటితో సరిపెట్టుకోకుండా ఆ విద్యను పదిమందికి నేర్పించేందుకు శిక్షణాలయాన్ని స్థాపించింది. ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తూ నృత్య కళాకారులుగా తీర్చిదిద్దుతోంది. వారితో కలిసి ప్రదర్శనలిస్తూ తాను ఇష్టంగా ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంది. నాట్యంపై మక్కువతో తనను వివాహం చేసుకున్న సాఫ్ట్వేర్ రంగంలో నిపుణుడైన భర్తకు సైతం గురువుగా మారి నాట్యంలో శిక్షణ ఇచ్చి అతన్ని గొప్ప కళాకారునిగా తయారు చేసింది. ఈ యువ దంపతులిద్దరూ కలిసి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నృత్య రూపకాలు ప్రదర్శిస్తూ నాట్య దాంపత్యం కొనసాగిస్తున్నారు. కళాభిమానుల ప్రశంసలు పొందుతున్నారు. వారే, యద్దనపూడి మండలం అనంతవరం గ్రామానికి చెందిన అద్దంకి ఆదిశేష వెంకటసుబ్రహ్మణ్యం, బాలత్రిపురసుందరి దంపతులు. తెనాలికి చెందిన చల్లా బాలత్రిపురసుందరికి చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యమంటే మక్కువ. దస్తగిరి, రంగనాయికి, చింతా రామనాథం, కేవీ సుబ్రహ్మణ్యం వంటి గురువుల వద్ద శాస్త్రీయ నృత్యం అభ్యసించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కూచిపూడిలో ఎంఏ కూడా చేసింది. భావితరాలకు కూచిపూడి కళను అందించాలన్న ఆకాంక్షతో మాస్టర్ ఆఫ్ పర్ఫారి్మంగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కూడా అభ్యసించింది. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కాలేజీలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఎంపికైనప్పటికీ.. నాట్యం కోసం ఆ అవకాశాన్ని కాదనుకుంది. అనంతరం కూడా నెలకు లక్ష రూపాయల వరకూ జీతమిచ్చే ఉద్యోగాలను పలు కంపెనీలు ఆఫర్ చేసినప్పటికీ నిస్సందేహంగా తిరస్కరించింది. ‘ఉద్యోగం చేస్తే బోలెడు మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లలో నేనూ ఒకదాన్నవుతా.. అదే నృత్యం చేస్తే అరుదైన కళాకారిణిగా మిగులుతా’ అనే భావనతో తాను ఎంచుకున్న మార్గం వైపే ముందుకు సాగింది. కళాకారిణిగా నృత్య ప్రదర్శనలు ఇస్తూనే.. 2010లో కల్యాణి కూచిపూడి ఆర్డ్స్ అకాడమీ పేరిట శిక్షణాలయాన్ని స్థాపించింది. శాస్త్రీయ నృత్యంలో ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మంచి కళాకారులను తయారు చేసింది. కళాభిమానిని భర్తగా పొంది.. కళాకారునిగా తీర్చిదిద్ది... యద్దనపూడి మండలం అనంతవరం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ రంగ నిపుణుడు అద్దంకి ఆదిశేష వెంకటసుబ్రహ్మణ్యానికి కూడా సంప్రదాయ నృత్యమంటే ఎంతో ఇష్టం. 2019లో పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో అతని పెద్దలు అనుకోకుండా బాలత్రిపురసుందరి సంబంధం తెచ్చారు. ఆమె గురించి తెలుసుకున్న వెంకటసుబ్రహ్మణ్యం ఆనందంతో ఎగిరి గంతేశాడు. వెంటనే ఆమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం కళావేదికలపై తన భార్య చేస్తున్న నృత్యానికి మరింత ఆకర్షితుడై ఎలాగైనా నాట్యం నేర్చుకోవాలని భావించాడు. అనుకున్నదే తడవుగా తన శ్రీమతినే గురువుగా చేసుకుని నెలల వ్యవధిలోనే ఆమె వద్ద నాట్యం నేర్చుకున్నాడు. వివిధ నృత్యరూపకాల పాత్రలకు తగిన హావభావాలు పలికించడంలోనూ నేర్పు సాధించాడు. గతేడాది తిరుమలలో జరిగిన నాదనీరాజనంలో శ్రీనివాసరూప కల్యాణాన్ని భార్యతో కలిసి ప్రదర్శించాడు. మహాశివరాత్రి వేడుకల్లో శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో నిర్వహించిన శివకల్యాణం రూపకంలోనూ ఈ దంపతులిద్దరూ శివపార్వతులుగా అభినయించి అభినందనలు అందుకున్నారు. షిరిడీలో బాలసుబ్రహ్మణ్యం ఒక్కరే బాబాగా అభినయించి అందరినీ మెప్పించాడు. భార్యభర్తలిద్దరూ కలిసి భవిష్యత్తులో మరిన్ని నృత్య ప్రదర్శనలు ఇచ్చేందుకు, తమ శిక్షణాలయం ద్వారా మరింత మందికి సంప్రదాయ నృత్యంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. కళామతల్లికి సేవలందించడమే లక్ష్యం : మా ఇద్దరికీ నాట్యమంటే ప్రాణం. రాబోయే రోజుల్లో కూడా ఇలానే మా నాట్య ప్రయాణాన్ని సాగించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. భార్యభర్తలు ఎటువంటి అరమరికలు లేకుండా ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకుంటే ఏ రంగంలోనైనా ఇద్దరూ అద్భుత విజయాలు సాధించగలరు. మా అకాడమీ ద్వారా చిన్నారులకు నృత్యం నేరి్పస్తూ కళామతల్లికి సేవలందిస్తాం. -బాలత్రిపురసుందరి, వెంకటసుబ్రహ్మణ్యం దంపతులు -
చిరు,పవన్‌ల ఎంట్రీ.. అధికార పార్టీలకే నష్టం..!
సాక్షి, వైజాగ్: సినీ నటుల రాజకీయ ప్రవేశంపై విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన మహా కామేశ్వర పీఠం అధిపతి యద్ధనపూడి అయ్యన్న పంతులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి , పవన్‌లు రాజకీయాల్లోకి రావడం అధికార పార్టీలకే నష్టమని అయ్యన్న పంతులు అన్నారు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే మరో పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కాలసర్ప దోషం ఉందని ఆయన పేర్కొన్నారు. యద్ధనపూడి అయ్యన్న పంతులు -
రాజధాని ప్రాంతంలో త్వరలో పర్యటిస్తా
రాజధాని రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా: జగన్ తాడేపల్లి వద్ద జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్న రాజధాని ప్రాంత రైతులు సాక్షి ప్రతినిధి, గుంటూరు/ఒంగోలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజధాని ప్రాంతంలో త్వరలోనే తాను పర్యటిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆ ప్రాంత రైతులు, పేదలకు తుదివరకూ అండగా ఉంటానని.. భూసమీకరణ అంశాన్ని శాసనసభలో లేవనెత్తి చర్చిస్తామని భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజవర్గానికి రోడ్డు మార్గంలో వెళ్తున్న జగన్మోహన్రెడ్డిని.. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ రోడ్డు వద్ద రాజధాని ప్రాంత రైతులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలిశారు. రాజధాని కోసం భూసేకరణ పేరుతో.. ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను ప్రభుత్వం తమ అభీష్టానికి వ్యతిరేకంగా లాగేసుకుంటోందని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం భూసేకరణ విషయమై రైతులతో సంప్రదించకుండానే సింగపూర్ ప్రతినిధుల బృందంతో ఏరియల్ సర్వే నిర్వహించడం ఎంతవరకు సమంజసమని వాపోయారు. జగన్ వారికి భరోసా ఇస్తూ.. రైతులు ఆధైర్యపడవలసిన అవసరం లేదని.. రాజధాని ప్రాంతమైన మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి మండలాల్లో తాను త్వరలో పర్యటిస్తానని చెప్పారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తి చర్చిస్తామని ధైర్యం చెప్పారు. జర్నలిస్టు హత్య కేసును అసెంబ్లీలో ప్రస్తావిస్తా... అనంతరం మార్గంలో చిలకలూరిపేటలో స్థానిక జర్నలిస్టు నాయకులు జగన్‌ను కలిసి.. 15 రోజుల కిందట హత్యకు గురైన జర్నలిస్టు శంకర్ కేసులో దోషులను ఇంతవరకూ అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసినందునే ఆయన హత్యకు గురయ్యారని.. ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే సీబీసీఐడీ దర్యాప్తు జరిపించేందుకు కృషి చేయాలని కోరారు. జగన్ మాట్లాడుతూ.. ఈ అంశాన్ని అసెంబ్లీలో లెవనెత్తుతానని హామీ ఇచ్చారు. భరత్ కుటుంబానికి అండగా ఉంటా.. ఆ తర్వాత యద్దనపూడి చేరుకున్న జగన్.. అక్కడ గొట్టిపాటి నరసయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. గొట్టిపాటి మరణించినప్పుడు తాను వచ్చాననీ అప్పుడు అమ్మ (నరసయ్య భార్య పద్మ) భరత్ బాధ్యత నీదే అందనీ అది తన గుండెను తాకిందన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు. 90 ఏళ్ల వయసులో పింఛన్ తీసేశారు..! ‘‘జగన్ బాబూ మీ నాన్న హయూంలోనే నెల నెలా పింఛన్ అందుకున్నాం. ఇప్పుడు రూ.వెయ్యకు పెంచుతామని చెప్పి ఉన్నది కూడా తీసేశారు’’ అంటూ చిలకలూరిపేట పట్టణానికి చెందిన వృద్ధులు కాటుకూరి మరియమ్మ, కంచి నాగరత్తమ్మలు జగన్‌ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ ఇంటి సమీపంలో కారు దిగిన జగన్.. నేరుగా వెళ్లి సమీపంలో ఉన్న ఈ వృద్ధులను పలకరించినపుడు వారు తమ ఆవేదన వెల్లడించారు. మరియమ్మ తనకు 90ఏళ్లని, అవసాన దశలో ఉన్న సమయంలో పింఛను తొలగించారని వాపోయారు. నాగరత్తమ్మ తన పరిస్థితి చెప్పి కంటతడిపెట్టింది. వారిని జగన్ ఓదార్చి ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పారు. జగన్‌కు జననీరాజనం జగన్మోహన్రెడ్డి గురువారం నాడు గుంటూరు జిల్లా మీదుగా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం యద్దనపూడి వెళ్లారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో కృష్ణా జిల్లా గన్నవరం చేరుకున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ఆయనకు గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. జాతీయ రహదారిపై చాలా ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా నిలుచుని ఆయనకు నీరాజనాలు పలికారు. జగన్ చిలకలూరిపేటకు చేరుకునే సమయానికి నియోజకవర్గం నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డుపైకి చేరుకొన్నారు. జగన్ రాక సందర్భంగా యద్దనపూడి గ్రామం జనసంద్రంగా మారింది. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రైతులతో ముచ్చట్లు.. జగన్ పర్యటన సమాచారం అందుకున్న గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంత రైతులు, పార్టీ కార్యకర్తలు తాడేపల్లి బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్‌ను నిలిపి ఆయనతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. జగన్‌ను కలిసిన వారిలో ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి రైతులతో పాటు, స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మర్రి నివాసంలో నేతలతో భేటీ..: ఆ తర్వాత మార్గమధ్యంలో చిలకలూరిపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నివాసంలో జగన్ కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు జగన్‌తో సమావేశమయ్యారు. గొట్టిపాటి విగ్రహావిష్కరణ.. అనంతరం జగన్ ప్రకాశం జిల్లా పర్చూరు నియోజవర్గం యద్దనపూడి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. నరసయ్య కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొట్టిపాటి భరత్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వర్ధంతి సందర్భంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం భరత్ ఇంటికి వెళ్లిన జగన్ రెండు గంటల సేపు ఆ కుటుంబ సభ్యులతో గడిపారు. -
గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
ఆ ఒక్కమాట నన్ను కదిలించి వేసింది
-
గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
యద్దనపూడి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రకాశం జిల్లా యద్దనపూడిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన ఈ సందర్భంగా నరసయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్ జగన్‌ను చూసేందుకు వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. -
అమృతమా..విషమా?
యద్దనపూడి: కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం పేరుతో ఆరు నెలల వయస్సు నుంచి మూడేళ్లలోపు పేద పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తోంది. అయితే అధికారుల అలక్ష్యంతో గడువు మించిపోయిన పౌష్టికాహారం పంపిణీ చేస్తున్న వైనం యద్దనపూడి మండలం పూనూరులో బుధవారం వెలుగులోకి వచ్చింది. యద్దనపూడి మండలం పూనూరు సెక్టార్‌లోని 224 అంగన్వాడీ కేంద్రం పరిధిలో మంగళ, బుధవారాల్లో బాలామృతం ప్యాకెట్లు పంపిణీ చేశారు. వాటి గడువు జులై 21వ తేదీతో ముగిసిపోయింది. గడువు తీరిన ఆహారం తింటే అది విషంగా మారుతుందని తెలిసినా పసిపిల్లలకు వాటిని పంపిణీ చేయడంలో ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతోంది. ఈ విషయంపై ఐసీడీఎస్ సీడీపీవో ధనలక్ష్మి వివరణ కోరగా..విషయం తన దృష్టికి వచ్చిందని చర్యలు తీసుకుంటామన్నారు. -
వర్షం మిగిల్చిన నష్టమిదీ..
యద్దనపూడి (మార్టూరు), న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు నష్టాలు మిగిల్చాయి. మండలంలో ఏ రైతును కదిలించినా..కంట నీరు తప్ప నోట మాట రావడం లేదు. పత్తి, పొగాకు రైతులు ఎక్కువగా నష్టపోయారు. మండలంలోని పోలూరు గ్రామానికి చెందిన నాగయ్య ఎకరాకు రూ 16 వేలు పెట్టి 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటికి ఎకరానికి రూ 40 వేల వరకు ఖర్చయింది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల వాగు పొంగి చేనుమీద పడింది. చేనంతా నీటిపాలై ఉరకెత్తి ఎండిపోసాగింది. దీంతో చేసేదేమీ లేక చేను పీకేశాడు. అదేవిధంగా మండలంలోని చిమటావారిపాలెం గ్రామానికి చెందిన దేవిరెడ్డి అనిల్ కుమార్ ఎకరాకు రూ 15 వేలు చొప్పున రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశాడు. ఇప్పటికే ఎకరానికి రూ 25 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. వర్షాలకు చేలో నీరు పారి, వేసిన పొగతోట కొట్టుకుపోయింది. మళ్లీ రూ 10 వేలు ఖర్చుపెట్టి నారు కొనుగోలు చేసి పంట సాగు చేసేందుకు సమాయత్తమయ్యాడు. ఇలా ఆ ఇద్దరు రైతులే కాదు..మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న రైతులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు.