రాజధాని ప్రాంతంలో త్వరలో పర్యటిస్తా | Capital Region will soon visit | Sakshi
Sakshi News home page

రాజధాని ప్రాంతంలో త్వరలో పర్యటిస్తా

Published Fri, Dec 12 2014 12:56 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

Capital Region will soon visit

  • రాజధాని రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా: జగన్
  • తాడేపల్లి వద్ద జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్న రాజధాని ప్రాంత రైతులు
  • సాక్షి ప్రతినిధి, గుంటూరు/ఒంగోలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజధాని ప్రాంతంలో త్వరలోనే తాను పర్యటిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ ప్రాంత రైతులు, పేదలకు తుదివరకూ అండగా ఉంటానని.. భూసమీకరణ అంశాన్ని శాసనసభలో లేవనెత్తి చర్చిస్తామని భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజవర్గానికి రోడ్డు మార్గంలో వెళ్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని.. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ రోడ్డు వద్ద రాజధాని ప్రాంత రైతులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలిశారు.
    రాజధాని కోసం భూసేకరణ పేరుతో.. ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను ప్రభుత్వం తమ అభీష్టానికి వ్యతిరేకంగా లాగేసుకుంటోందని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం భూసేకరణ విషయమై రైతులతో సంప్రదించకుండానే సింగపూర్ ప్రతినిధుల బృందంతో ఏరియల్ సర్వే నిర్వహించడం ఎంతవరకు సమంజసమని వాపోయారు. జగన్ వారికి భరోసా ఇస్తూ.. రైతులు ఆధైర్యపడవలసిన అవసరం లేదని.. రాజధాని ప్రాంతమైన మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి మండలాల్లో తాను త్వరలో పర్యటిస్తానని చెప్పారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తి చర్చిస్తామని ధైర్యం చెప్పారు.

    జర్నలిస్టు హత్య కేసును అసెంబ్లీలో ప్రస్తావిస్తా...

    అనంతరం మార్గంలో చిలకలూరిపేటలో స్థానిక జర్నలిస్టు నాయకులు జగన్‌ను కలిసి.. 15 రోజుల కిందట హత్యకు గురైన జర్నలిస్టు శంకర్ కేసులో దోషులను ఇంతవరకూ అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసినందునే ఆయన హత్యకు గురయ్యారని.. ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే సీబీసీఐడీ దర్యాప్తు జరిపించేందుకు కృషి చేయాలని కోరారు. జగన్ మాట్లాడుతూ..   ఈ అంశాన్ని అసెంబ్లీలో లెవనెత్తుతానని హామీ ఇచ్చారు.
     
    భరత్ కుటుంబానికి  అండగా ఉంటా..

    ఆ తర్వాత యద్దనపూడి చేరుకున్న జగన్.. అక్కడ గొట్టిపాటి నరసయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. గొట్టిపాటి మరణించినప్పుడు తాను వచ్చాననీ అప్పుడు అమ్మ (నరసయ్య భార్య పద్మ) భరత్ బాధ్యత నీదే అందనీ అది తన గుండెను తాకిందన్నారు.  ఆ కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు.
     
    90 ఏళ్ల వయసులో పింఛన్ తీసేశారు..!

     ‘‘జగన్ బాబూ మీ నాన్న హయూంలోనే నెల నెలా పింఛన్ అందుకున్నాం. ఇప్పుడు రూ.వెయ్యకు పెంచుతామని చెప్పి ఉన్నది కూడా తీసేశారు’’ అంటూ చిలకలూరిపేట పట్టణానికి చెందిన వృద్ధులు కాటుకూరి మరియమ్మ, కంచి నాగరత్తమ్మలు జగన్‌ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ ఇంటి సమీపంలో కారు దిగిన జగన్.. నేరుగా వెళ్లి సమీపంలో ఉన్న ఈ వృద్ధులను పలకరించినపుడు వారు తమ ఆవేదన వెల్లడించారు. మరియమ్మ  తనకు 90ఏళ్లని, అవసాన దశలో ఉన్న సమయంలో పింఛను తొలగించారని వాపోయారు. నాగరత్తమ్మ తన పరిస్థితి చెప్పి కంటతడిపెట్టింది. వారిని జగన్ ఓదార్చి ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పారు.
     
     జగన్‌కు జననీరాజనం

    జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నాడు గుంటూరు జిల్లా మీదుగా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం యద్దనపూడి వెళ్లారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో కృష్ణా జిల్లా గన్నవరం చేరుకున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ఆయనకు గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. జాతీయ రహదారిపై చాలా ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా నిలుచుని ఆయనకు నీరాజనాలు పలికారు. జగన్ చిలకలూరిపేటకు చేరుకునే సమయానికి నియోజకవర్గం నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డుపైకి చేరుకొన్నారు. జగన్ రాక సందర్భంగా యద్దనపూడి గ్రామం జనసంద్రంగా మారింది. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
     
     రైతులతో ముచ్చట్లు..

     జగన్ పర్యటన సమాచారం అందుకున్న గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంత రైతులు, పార్టీ కార్యకర్తలు తాడేపల్లి బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్‌ను నిలిపి ఆయనతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. జగన్‌ను కలిసిన వారిలో ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి రైతులతో పాటు, స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
     
    మర్రి నివాసంలో నేతలతో భేటీ..:

    ఆ తర్వాత మార్గమధ్యంలో చిలకలూరిపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నివాసంలో జగన్ కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు జగన్‌తో సమావేశమయ్యారు.
     
    గొట్టిపాటి విగ్రహావిష్కరణ..


    అనంతరం జగన్ ప్రకాశం జిల్లా పర్చూరు నియోజవర్గం యద్దనపూడి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. నరసయ్య కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొట్టిపాటి భరత్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వర్ధంతి సందర్భంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం భరత్ ఇంటికి వెళ్లిన జగన్ రెండు గంటల సేపు ఆ కుటుంబ సభ్యులతో గడిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement