యద్దనపూడి (మార్టూరు), న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు నష్టాలు మిగిల్చాయి. మండలంలో ఏ రైతును కదిలించినా..కంట నీరు తప్ప నోట మాట రావడం లేదు. పత్తి, పొగాకు రైతులు ఎక్కువగా నష్టపోయారు. మండలంలోని పోలూరు గ్రామానికి చెందిన నాగయ్య ఎకరాకు రూ 16 వేలు పెట్టి 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటికి ఎకరానికి రూ 40 వేల వరకు ఖర్చయింది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల వాగు పొంగి చేనుమీద పడింది. చేనంతా నీటిపాలై ఉరకెత్తి ఎండిపోసాగింది. దీంతో చేసేదేమీ లేక చేను పీకేశాడు. అదేవిధంగా మండలంలోని చిమటావారిపాలెం గ్రామానికి చెందిన దేవిరెడ్డి అనిల్ కుమార్ ఎకరాకు రూ 15 వేలు చొప్పున రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశాడు. ఇప్పటికే ఎకరానికి రూ 25 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. వర్షాలకు చేలో నీరు పారి, వేసిన పొగతోట కొట్టుకుపోయింది. మళ్లీ రూ 10 వేలు ఖర్చుపెట్టి నారు కొనుగోలు చేసి పంట సాగు చేసేందుకు సమాయత్తమయ్యాడు. ఇలా ఆ ఇద్దరు రైతులే కాదు..మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న రైతులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు.