దేవరకద్రలోని దళితవాడలో ఓ ఇంటి వద్ద కార్డెన్ సెర్చ్ చేస్తున్న ఎస్పీ అనురాధ
దేవరకద్ర: ప్రజల రక్షణ కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ బి.అనురాధ తెలిపారు. శుక్రవారం రాత్రి దేవరకద్రలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన అనంతరం దళితవాడలో ఆమె విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతలను కాపాడేందుకు నేరాలను అరికట్టడానికి కార్డెన్ సెర్చ్ ఉపయోగపడుతుందన్నారు.
అనుమానితులు, దొంగలు, పాతనేరస్థులను గుర్తించే అవకాశం ఉంటుందని.. ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచాం ఇవ్వాలని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మొద్దని కోరారు. ఎలాంటి సమస్య వచ్చిన 100కు డయల్ చేస్తే పోలీసులు రక్షణ కల్పిస్తారని తెలిపారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి
కాలనీలో కొంత ఆర్థికస్థోమత ఉన్నావారు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ఎస్పీ కోరారు. దళితవాడ ప్రజలతో ఎస్పీ ముఖాముఖి చర్చించారు. ఎంతో ఖర్చు చేసి గృహాలను నిర్మించుకుంటారు.. కొంత ఖర్చుతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే, దొంగలు, నేరస్థుల ఆట కట్టించవచ్చని తెలిపారు.
ప్రతికాలనీలో కనీసం అయిదు నుంచి ఆరు కెమెరాలను పెట్టుకోవాలని సూచించారు. పోలీసులు రాత్రివేళ పెట్రోలింగ్ చేస్తున్నారా? అని ప్రజలను అడిగారు.
యువత సమయం వృథా చేయకుండా చదువులో శద్ధచూపాలని, లేదంటే స్వయం ఉపాధి చేసుకోవాలన్నారు.
కొన్ని గృహాలను స్వయంగా తిరిగి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీతోపాటు ఏఎస్పీ వెంకటేశ్, డీఎస్పీ భాస్కర్, సీఐలు రవీందర్‌రెడ్డి, రామకృష్ణ, ఎస్‌ఐ అశోక్‌కుమార్‌తోపాటు మరో ఏడు మంది ఎస్‌ఐలు, వందమంది పోలీసులు పాల్గొన్నారు.
ఆరు వాడల్లో తనిఖీలు
దేవరకద్రలోని ఆరు వాడల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దళితవాడ, తెలుగువాడ, బండగేరి, కురువవాడ, బీసీ కాలనీ, బోయగేరి ఇంకా పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. మొత్తం 210 ఇళ్లల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 8 వాహనాలను సీజ్ చేశారు.
కొందరు అనుమానితులను గుర్తించి వివరాలు తీసుకున్నారు. కార్డెన్ సెర్చ్ ఇక్కడ మొదటిసారి నిర్వహించడంతో ప్రజలు భయపడిపోయారు. ఏం జరిగిందని ఇంతమంది పోలీసులు వచ్చారని రోడ్లపైకి వచ్చి చూశారు.
Comments
Please login to add a commentAdd a comment