సాక్షి, హైదరాబాద్ : ఏమాత్రం ఆత్మగౌరవం లేని కాంగ్రెస్ పార్టీలో కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఓ చీడపురుగని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. వంశీచంద్ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని, మంత్రి కేటీఆర్‌పై వంశీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ప్రజలకు పౌరుషం, ఆత్మగౌరవం ఉంది కాబట్టే అప్పట్లో ఎన్టీఆర్‌ను ఓడించారని, చరిత్రలోకి వెళితే కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సింది చాలా ఉంటుందన్నారు. కాంగ్రెస్ కోర్టులను నమ్ముకుందని, టీఆర్‌ఎస్ ప్రజలను నమ్ముకుందని పేర్కొన్నారు. పెద్దవాళ్ళను విమర్శిస్తే తానూ పెద్దవాడిని అవుతాననే తప్పుడు వ్యూహాంలో వంశీ వెళ్తున్నాడని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌పై విమర్శలు మానకపోతే ఆయనను స్థానిక ప్రజలే కల్వకుర్తికి రానివ్వని పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరగడాన్ని జీర్ణించుకోలేకే ఎమ్మెల్యే వంశీ విమర్శలకు దిగుతున్నారన్నారు. పొరుగు రాష్ట్రం సీఎం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రను గ్రహించే టీఆర్‌ఎస్‌లోని దళిత ఎమ్మెల్యేలమంతా ముఖ‍్యమంత్రిగా కేసీఆర్ పేరును ప్రతిపాదించామని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే దళితుడిని సీఎం చేస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ మనిషి అయిన వంశీని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించామా అని కల్వకుర్తి ప్రజలు ఇపుడు బాధపడుతున్నారని అన్నారు.
ఫార్మాసిటీ ఏర్పాటైతే స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, కానీ, కల్వకుర్తి ఎమ్మెల్యేకు అది ఇష్టంలేక అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే వంశీచంద్ వెంట ఆయన బంధువులు తప్ప చివరకు ఎవరు మిగిలే పరిస్థితి లేదని, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. మండలిలో విపక్ష నేత ప్రభుత్వాన్ని పొగుడుతుంటే తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చిన వంశీ పబ్లిసిటీ కోసం ప్రభుత్వాన్ని తిడుతున్నాడని ధ్వజమెత్తారు. కల్వకుర్తికి సాగునీరిచ్చిన ప్రభుత్వాన్ని పొగడాల్సింది పోయి వంశీ విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. కల్వకుర్తిలో కాంగ్రెస్‌కు బీటలు పడుతున్నాయనే అక్కసుతోనే ఆయన దిగజారి మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment