కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యక్తిగతంగా, సోయిలేకుండా మాట్లాడటం తగదని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వనితుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. శనివారం డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేవలం కుటుంబ సభ్యుల వ్యాపారాలు, స్వలాభం కోసమే ఆమె రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపించారు. 2014లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు పన్నారని, అయినా అక్కడి ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొందానని పేర్కొన్నారు.
2006 నుంచే ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నానని, ఆమెకు 2014 వరకు కాంగ్రెస్‌లో సభ్యత్వమే లేదన్నారు. ఎన్నో పార్టీలు మారిన డీకే అరుణ బీసీ ద్రోహి అని విమర్శించారు. తాను నాన్–లోకల్ కాదని ఉమ్మడి పాలమూరు బిడ్డనని వంశీచంద్‌రెడ్డి చెప్పారు. అప్పట్లో పాన్‌గల్ జెడ్పీటీసీ సభ్యురాలిగా కాంగ్రెస్ నుంచి డీకే అరుణ గెలుపొందినప్పుడు ఆమెకు ఈ విషయం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.
కేవలం కాంట్రాక్టులు, లిక్కర్ దందాలు, ధనార్జన కోసమే రాజకీయాల్లో ఉన్న ఆమె బండారం బయటపెడతామన్నారు. ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి ఓడిపోతాననే అక్కసుతో ఎలాంటి సోయి లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. కనీసం తన పుట్టిన ఊరు ధన్వాడ మండలానికి గానీ, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలకుగానీ అరుణ ఏమీ చేయలేకపోయారని, రాజకీయ విలువలు లేని ఆమె తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment