టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం కేసీఆర్‌ను కలిసిన ఎడ్మ కిష్టారెడ్డి
కల్వకుర్తి రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. అనూహ్య పరిణామాలతో అధికార పార్టీలో సమీకరణలు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఉనికి కోసం పాకులాడిన ఆ పార్టీ.. ప్రస్తుతం ఆశావహుల తాకిడితో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే అసమ్మతి రాజకీయాలతో కుతకుతలాడుతున్న గులాబీ శిబిరంలోకి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి రావడం కొత్త సమీకరణలకు తెరలేపింది.
ఆమనగల్లు : కల్వకుర్తి నియోజకర్గంలో టీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్యనాయకుల సంఖ్య పెరిగిపోతోంది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, సీనియర్ నేతలు గోలి శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీసింగ్, విజితారెడ్డిలతో ‘కారు’ ఓవర్‌లోడ్ కాగా.. తాజాగా ఎడ్మ కిష్టారెడ్డి రాకతో కుదుపునకు గురవుతోంది. రానున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు పాత నేతలు ప్రయత్నాలు చేస్తుండగా ఆరో కృష్ణుడి రంగప్రవేశంతో టీఆర్‌ఎస్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది.
నివురుగప్పిన నిప్పులా..
మూడు గ్రూపులు.. ఆరు వర్గాలుగా అధికారపార్టీ నిలువునా చీలిపోయింది. ఎవరికివారు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండడంతో పార్టీ కార్యకర్తల మధ్య కూడా విభజన రేఖ ఏర్పడింది. ఈ పరిణామాలను గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యనాయకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అగ్రనాయకత్వం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
టీఆర్‌ఎస్ గాలి వీచినా..
గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ హవా కొనసాగినా కల్వకుర్తిలో మాత్రం చతికిలపడింది. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్.. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి చేతిలో పరాజయం పాలై మూడో స్థానానికి పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత కసిరెడ్డి నారాయణరెడ్డి గణనీయంగా ఓట్లు సాధించారు. ఎన్నికల అనంతర పరిణామాల నేపథ్యంలో కసిరెడ్డి అధికారపార్టీ తీర్థం పుచ్చుకోవడం.. ఎమ్మెల్సీగా విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. పదవి రావడంతో విస్తృతంగా పర్యటించి నియోజకవర్గంపై పట్టు సాధించారు.
కసిరెడ్డి చేరికతో డీలా పడ్డ జైపాల్‌యాదవ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రత్యేకవర్గాన్ని తయారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇరువురు నేతల మధ్య అభిప్రాయబేధాలు పొడచూపాయి. రెండేళ్ల క్రితం ఆమనగల్లు మండలం మైసిగండిలో మండల టీఆర్‌ఎస్ ఎన్నికల సందర్భంగా రెండు గ్రూపుల నాయకులు బహిరంగంగా గొడవకు దిగారు. ఆమనగల్లులో గతేడాది టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇటీవల తలకొండపల్లి మండలం మక్తమాదారంలో జరిగిన టీఆర్‌ఎస్ సమావేశంలోనూ కీచులాడుకున్నారు. ఆఖరికి సోషల్ మీడియాలో సైతం వైరివర్గాల మధ్య ‘వాట్సప్ వార్’ కొనసాగుతోంది.
పాంచ్ పటాకా!
తొలినాళ్లలో పార్టీ కోసం పనిచేసిన నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి బాలాజీసింగ్ చివరి నిమిషంలో పార్టీలో చేరిన జైపాల్‌యాదవ్‌కు అభ్యర్థిత్వం ఖరారు కావడంతో నిరుత్సాహపడ్డప్పటికీ, పార్టీ కోసం పనిచేశారు. అదేసమయంలో కాంగ్రెస్‌ను వీడి గోలి శ్రీనివాస్‌రెడ్డి కూడా గులాబీ కండువా వేసుకున్నారు. ఈయన కూడా టికెట్టు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. అనూహ్య పరిస్థితుల్లో జైపాల్ యాదవ్ ‘బీ’ ఫారం ఎగురేసుకుపోవడంతో నీరుగారారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా.. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయలేదు. మహిళా కోటలో కల్వకుర్తి మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు ద్యాప విజితారెడ్డి కూడా కల్వకుర్తి టికెట్టుపై దృష్టిపెట్టారు. ఈ నలుగురు కూడా కదనకుతుహలం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్న కసిరెడ్డి కూడా వచ్చే శాసనసభ ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించునే దిశగా పావులు కదుపుతున్నారు.
పాత గూటికి ‘సూదిని’వర్గం..?
కల్వకుర్తి కాంగ్రెస్ టికెట్టు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ అగ్రనేత సూదిని జైపాల్‌రెడ్డి సోదరుడు సూదిని రాంరెడ్డి వర్గానికి తాజా పరిణామాలు మింగుడుపడడంలేదు. గత ఎన్నికల్లో వంశీకి సీటు దక్కడంతో నిరాశకు గురైన ఆయన స్వతంత్ర అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి అండగా నిలిచారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే, కసిరెడ్డి తమ వర్గానికి మునుపటి ప్రాధాన్యమివ్వడంలేదని కినుక వహించిన ఆయన.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల చంపాపేట్‌లో తన సన్నిహితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే జైపాల్, కసిరెడ్డితో పొసగకపోవడం.. తాజాగా మరోనేత ఎడ్మ కూడా పార్టీలోకి వస్తుండడం.. ఆయనతోను విభేదాలున్న నేపథ్యంలో పాత గూటికి చేరే అవకాశం లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది.
కిష్టారెడ్డి రాకతో...
ఎడ్మ కిష్టారెడ్డి చేరికతో కల్వకుర్తిలో టీఆర్‌ఎస్ బలపడుతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇదే అంచనాతో కిష్టారెడ్డిని మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి ఆయనను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వనించారు. అయితే కల్వకుర్తి టికెట్టును ఐదుగురు నేతలు ఆశిస్తున్న తరుణంలో ఎడ్మ కిష్టారెడ్డి రాకతో ఆశావహుల సంఖ్య ఆరుకు పెరిగింది. టికెట్ ఎవరికి వచ్చినా మరో వర్గం సహకరించే పరిస్థితి కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment