BrijeshKumar
-
విచారించే పరిధి మాకు లేదు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ గత ఏడాది ఆగస్టు 18న తెలంగాణ రాష్ట్రం జారీ చేసిన జీవో 246ను సవాలు చేస్తూ ఏపీ వేసిన కేసు (ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్)ను జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 కొట్టేసింది. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్దిష్ట జల కేటాయింపులపై కృష్ణా ట్రిబ్యునల్–2 తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ జీవో అమలును నిలిపివేసి తమ రాష్ట్రానికి మధ్యంతర ఉపశమనం కల్పించాలంటూ ఏపీ వేసిన కేసును విచారించే పరిధి తమకు లేదని పేర్కొంది. చట్టానికి లోబడి ఉపశమనం కోసం మరో వేదికను ఆశ్రయించే స్వేచ్ఛను ఏపీకి కల్పించింది. ఈ మేరకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ తలపాత్ర, జస్టిస్ రామ్మోహన్‌రెడ్డితో కూడిన కృష్ణా ట్రిబ్యునల్–2 బుధవారం కీలక తీర్పు వెలువరించింది. మరోవైపు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పాత ప్రాజెక్టేనని, ఉమ్మడి రాష్ట్రంలోనే శ్రీకారం చుట్టారని తెలంగాణ చేసిన వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. గతేడాది డిసెంబర్ 8న ఏపీ ఈ కేసును దాఖలు చేయగా, రెండు రాష్ట్రాలు దాదాపు 4 నెలల పాటు ట్రిబ్యునల్ ముందు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. ఈ జీవోతో ఏపీ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏపీ చేసిన వాదనలతో తెలంగాణ విభేదించింది. పాలమూరు కొత్త ప్రాజెక్టే.. వేటిని కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలి అన్న అంశంపై రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రూపొందించిన మార్గదర్శకాల ఆధారంగా పాలమూరుపై ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక–ఆర్థిక సాధికారతపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మదింపు జరగని ప్రాజెక్టులు, టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ ఆమోదించని ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా పరిగణిస్తారు. ఇంటేక్ పాయింట్, ప్రాజెక్టు ప్రాంతం, కాల్వలు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఆయకట్టు ప్రాంతం, నిల్వ సామర్థ్యం, నీటి వినియోగం వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నా కొత్త ప్రాజెక్టులుగానే పరిగణిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 టీఎంసీల వరద జలాలను జూరాల ప్రాజెక్టు ఫోర్‌షోర్ నుంచి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిపాదించారు. అయితే తెలంగాణ వచ్చాక ప్రతిపాదనలను సమూలంగా మార్చివేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఫోర్‌షోర్ నుంచి 70 శాతం లభ్యత ఆధారంగా 90 టీఎంసీల నికర జలాలను తరలించేలా ప్రాజెక్టును ప్రతిపాదించిన నేపథ్యంలో దీనిని కొత్త ప్రాజెక్టుగా పరిగణిస్తున్నట్టు ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. గతంలో కేటాయింపులు జరపని ప్రాజెక్టులు మా పరిధిలోకి రావు.. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 89 అమలు బాధ్యతలను కృష్ణా ట్రిబ్యునల్–2 చేపట్టిన నేపథ్యంలో.. తెలంగాణ జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉపశమనం కల్పించే అధికారం ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని ఏపీ ప్రభుత్వం చేసిన వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. గతంలో కృష్ణా ట్రిబ్యునల్–1, కృష్ణా ట్రిబ్యునల్–2 లు గంపగుత్తగా కేటాయింపులు జరిపిన ప్రాజెక్టులకు మళ్లీ నిర్దిష్ట కేటాయింపులు జరిపే అధికారాన్ని మాత్రమే రాష్ట్ర పునర్వీభజన చట్టంలోని సెక్షన్ 89 కింద తమకు కేటాయించారని తెలిపింది. గతంలో ఏ ట్రిబ్యునల్ కూడా కేటాయింపులు జరపని ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాలు తమ పరిధిలోకి రావని పేర్కొంది. పునఃకేటాయింపులూ మా పరిధిలోనిది కాదు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పునః కేటాయింపులు జరిపే అంశం తమ పరిధిలో లేదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. కేవలం రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్దిష్ట కేటాయింపులు జరపడమే తమ బాధ్యత అని పునరుద్ఘాటించింది. కాగా సెక్షన్ 89 కింద ట్రిబ్యునల్‌కు పరిమిత అధికారాలే ఉన్నాయని, ఏపీకి మధ్యంతర ఉపశమనం కల్పించే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు మాత్రమే ఉందని తెలంగాణ వాదించింది. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 11 ప్రకారం జల వివాదాల విషయంలో సుప్రీం కోర్టుకు ఉన్న న్యాయ అధికారాలన్నీ ట్రిబ్యునల్‌కు ఉంటాయని 1993లో కావేరి ట్రిబ్యునల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని ఏపీ గుర్తు చేసింది. ఈ మేరకు అధికారాలను వినియోగించి మధ్యంతర ఉపశమనం కల్పించాలని ఏపీ విజ్ఞప్తి చేసింది. అయితే తమకు అప్పగించిన బాధ్యతలకు లోబడి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర పునర్వీభజన చట్టం 2014 వచ్చిన తర్వాత చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి వంటి కొత్త ప్రాజెక్టులు సెక్షన్ 89 కింద తమ పరిధిలోకి రావని కృష్ణా ట్రిబ్యునల్–2 తేల్చి చెప్పింది. ఇలావుండగా గతంలో గంపగుత్తగా కేటాయింపులు పొందిన ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులకు సెక్షన్ 89 కింద నిర్దిష్ట కేటాయింపులు జరిపే అంశం ఇంకా ట్రిబ్యునల్‌లో విచారణ దశలోనే ఉంది. నిర్ణయం వచ్చే సరికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే గెజిట్ ప్రకటన రాలేదు
సాక్షి, న్యూఢిల్లీ: జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కృష్ణాజల వివాదాల ట్రిబ్యునల్ చేసిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారిక గెజిట్‌లో నోటిఫై చేయలేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు చెప్పారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం కింద కేంద్ర ప్రభుత్వం 2004లో జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబుగా తెలిపారు. 2010లో ఈ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా 2011లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిం దని, దీనిపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయని వివరించారు. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించేవరకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ సిఫార్సులను అధికారిక గెజిట్‌లో ప్రకటించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ట్రిబ్యునల్ సిఫార్సులను ప్రభుత్వం అధికారికంగా గెజిట్‌లో ప్రకటించలేదన్నారు. 1.15 కోట్ల గృహాలు మంజూరు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన్–అర్బన్ (పీఎంఏవై–యూ)లో 1.15 కోట్ల గృహాలు మంజూరయ్యాయని, వాటిలో 56.2 లక్షలు పూర్తయ్యాయని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. మిగిలినవి వివిధ దశలో ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆర్థిక మద్దతుపై ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి ఏపీకి ఆర్థిక మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి వైఎ స్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం మరో ఐదేళ్లపాటు పొడిగించాలన్నారు. రాజ్యసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై మాట్లాడారు. ‘దేశంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ పరిహారాన్ని ఐదేళ్ల పాటు పొడిగించాలి. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను కేంద్రం వేగవంతం చేయాలి. రాష్ట్రానికి ఆర్థిక మద్దతు అందించడానికి ఓ వ్యవస్థ రూపొందించాలి..’ అని ఆయన పేర్కొన్నారు. -
కృష్ణా జలాలపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ విషయమై ఈ నెల 12 నుంచి జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు తిరిగి విచారణ మొదలు కానుంది. గురు, శుక్రవారాల్లో రెండ్రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సమర్పించిన అఫిడవిట్‌పై క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ట్రిబ్యునల్ విచారణలో పాల్గొనేందుకు బుధవారం రాష్ట్ర నీటి పారుదలశాఖ అధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత ట్రిబ్యునల్‌పై ఉందని.. కృష్ణా జలాల్లో తమ కేటాయింపుల (299 టీఎంసీల)కు అదనంగా మరో 200 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ పేర్కొంది. రాష్ట్ర పరీవాహకం, అవసరాలు దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు పెంచాలని విన్నవించింది. అయితే తన అవసరాలపై అఫిడవిట్ సమర్పించిన ఏపీ, తమ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమని పేర్కొంది. 1976లో బచావత్ అవార్డు ప్రకారం ప్రాజెక్టుల వారీగా 811 టీఎంసీలను పంచగా, ఇందులో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు దక్కాయని, మూడేళ్లుగా ఇదే విధానం కొనసాగుతోందని తెలిపింది. ఆయకట్టు, ప్రాజెక్టుల కింది నీటి వినియోగంలో ఎలాంటి మార్పులు లేవని, నీటి వాటాల్లో మార్పులు చేస్తే ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతుందని, 150 ఏళ్లుగా ఉన్న నదీ వ్యవస్థను మార్చే పనులు చేయరాదని కోరింది. ఇదే సమయంలో తెలంగాణ గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు 214.14 టీఎంసీలను తరలిస్తోందని, ఇందులో ఏపీ వాటా ఏమిటో తేల్చాలని విన్నవించింది. ఏపీ సమర్పించిన అఫిడవిట్ అంశాలపై గురువారం నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ జరుగనుంది. -
ఏపీ అభ్యంతరాలను పట్టించుకోని ట్రిబ్యునల్
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: కృష్ణానది మిగులు జలాల పంపిణీపై శుక్రవారం బ్రిజేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని కృష్ణా ట్రిబ్యునల్ ఇ చ్చిన తుది తీర్పుతో జిల్లాలో ఎత్తిపోతల పథకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తీర్పుతో ఆయా నీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కల్వకుర్తి (మహాత్మాగాంధీ) ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలకు భవిష్యత్తులో తీవ్ర ముప్పు ఏర్పడనుంది. ఈ రెండు ఎత్తిపోతల పథకాల నిర్మాణం కోసం దాదాపు రూ.4,418 కోట్లు వ్యయం చేసినా, మిగులు జలాలపై ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడం, మనం లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకపోవడంతో పరిస్థితి తారుమారయ్యింది. ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లకపోతే భవిష్యత్తులో కల్వకుర్తి, నెట్టెంపాడు పథకాలకు నీరు అందడం గగనమే. ఈ రెండు ఎత్తిపోతల పథకాల వల్ల జిల్లాలో 5.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కృష్ణానది మిగులు జలాల్లో కూడా రాష్ట్రానికి 200 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకునేలా నిబంధనలు విధించడంతో జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. 50 టీఎంసీల నిర్ణయంతో జిల్లాలో నెట్టంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. అయితే ప్రస్తుతం రాష్ట్రానికి కేటాయించిన 200 టీఎంసీల మిగులు జలాల్లో ఈ రెండు పథకాలకు 50 టీఎంసీల నీటిని ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదు.దీంతో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయినా భవిష్యత్తులో 5.40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందడం కష్టమే. కృష్ణా నికర జలాల కింద నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండిన తర్వాతే కొత్తగా నిర్మించిన కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలకు నీటిని నింపే అవకాశం ఉంది. లేని పక్షంలో వర్షాకాలంలో కేవలం ఓవర్ ఫ్లో నీటిపైనే ఆధారపడాల్సిన దుస్ధితి నెలకొంది. 3.40 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, తదితర నియోజకవర్గాల రైతులు ప్రయోజనం కలిగేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మరోవైపు గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని రెండు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెట్టెంపాడు భారీ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికింద గుడ్డెం దొడ్డి, ర్యాలంపాడు, సంగాల, తాటికుంట, నాగర్‌దొడ్డి, ముచ్చోనిపల్లి, చిన్నోనిపల్లిలో రిజర్వాయర్లు నిర్మించారు. దాదాపు నిర్మాణపనులు పూర్తికావస్తున్న తరుణంలో రైతాంగానికి ట్రిబ్యునల్ షాకిచ్చింది. ఆర్డీఎస్ ప్రాజెక్టుకు ఊరట... ఆర్డీఎస్ కింద ఇప్పటి వరకు 15.84 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, అదనంగా మరో 4 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. ఆర్డీఎస్ కింద అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా,ఇప్పటివరకు అం దులో సగం ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు. ఆర్డీఎస్ను మున్ముందు బ్యారేజీగా మార్పు చేస్తే అదనంగా కేటాయించిన నీటి వల్ల పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందే అవకాశం ఉం ది. ఇదొక్కటే జిల్లా రైతులకు ఊరట. -
డెల్టాకు ఆల్మట్టి
వరికి ఇక ఉరే.. =బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పర్యవసానం =డెల్టా రైతన్నకు తీరని అన్యాయం =వాదనలు సమర్థంగా వినిపించ లేకపోయిన ప్రభుత్వం ఇది కృష్ణాడెల్టాకు గుండెకోత.. వరి సిరులు పండించే మాగాణులను బీళ్లుగా మార్చే తీర్పు..మన పాలకుల నేరపూరిత అసమర్థ నిర్వాకానికి తరతరాలు మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి.. అంతర్జాతీయ నదీజలాల పంపిణీకి అనుసరించే సహజ న్యాయసూత్రాలకు సమాధి కడుతూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానదీ జలాల పంపిణీపై ఇచ్చిన తీర్పు డెల్టా అన్నదాతకే కాదు ప్రతిఒక్కరికీ తీరని శాపంగా, శోకంగా మారింది. మిగులు జలాల హక్కును హరించింది. మునేరు, పాలేరు వరదనీటిని మిగులుజలాలుగా చూపి తీరని అన్యాయం చేసింది. ఆల్మట్టి ఎత్తుపెంపును సమర్థించి జనం నోటమట్టికొట్టింది. ఈ తీర్పుపై జిల్లా ఒక్కసారిగా భగ్గుమంది. సాక్షి, విజయవాడ : కృష్టాడెల్టాను ఎడారిలా మార్చే తీర్పుతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ జిల్లావాసులకు తీరని అన్యాయం చేసింది. డెల్టాలోని 13లక్షల ఎకరాల్లో వరికి ఉరి వేస్తూ అన్నదాతల తలరాతను తలకిందులు చేసేలా తయారైంది. ఈ తీర్పుపై జిల్లావాసులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ, నిర్లక్ష్యపూరిత ఉదాసీన వైఖరి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రైతు సంఘాల నేతలు, సాగునీటిరంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ తీర్పు వెలువడిన వెంటనే నిరసన వ్యక్తంచేస్తూ వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ కాళేశ్వరరావు సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనలకు సమాయత్తమవుతున్నారు. నాగార్జునసాగర్ దిగువభాగంలోని పరీవాహక ప్రాంతంలో మునేరు, పాలేరు ఉప నదుల నుంచి వచ్చే 50టీఎంసీల నీటిని నికర జలాలుగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ లెక్కగట్టడం అర్థరహితమని పలువురు రైతు నాయకులు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరదలు వచ్చే సమయంలోనే ఈ రెండు ఉపనదుల నీరు కృష్ణా నదిలోకి చేరుతుంది. అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద మూడు టీఎంసీల కన్నా ఎక్కువ నీరు నిల్వ చేసే అవకాశం లేదు. అందువల్ల ఈ రెండు ఉపనదుల నుంచి వచ్చే నీరు వృథాగా సముద్రంలోకి పోవడమే తప్ప డెల్టాకు ఏ విధంగానూ ఉపయోగపడవు. ఇప్పటి వరకూ అటువంటి దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల కృష్ణాడెల్టాకు జూన్, జూలై నెలల్లో నీరు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. దీంతో వరినాట్లు ఆలస్యమవుతాయి. ఫలితంగా నవంబరు, డిసెంబర్ నెలల్లో వచ్చే తుపాన్లకు పంట చేతికి రాకుండాపోతుంది. ఈ ఏడాది ఆలస్యంగా నీరివ్వడంతో వరినాట్లు ఆలస్యమయ్యాయి. పై-లీన్, హెలెన్, లెహర్ వరుస తుపాన్లు వచ్చి రైతన్న వెన్నువిరిచిన విషయం తెలిసిందే. మిగులు జలాలపై పూర్తిహక్కు ఉన్నప్పుడే 2002, 2003 సంవత్సరాల్లో సాగర్ ఆయకట్టు పరిధిలో 20 లక్షల ఎకరాల్లో భూములు బీళ్లుగా మారాయి. ఈ తీర్పుతో డెల్టాలో సాగు ఒకటి రెండు నెలలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల డెల్టాకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం తలె త్తుతుంది. దశాబ్దాలుగా తీరని కలగా ఉన్న పులిచింతల ప్రాజెక్టు పనులు వైఎస్ అధికారంలోకి వచ్చే వరకూ ప్రారంభం కాలేదు. ఆయన మృతితో ఆ పనులు నత్తనడక సాగుతూ ఇంకా పూర్తికాలేదు. అదే విధంగా బ్యారేజీ వద్ద మూడు టీఎంసీల నీరు కూడా ప్రస్తుతం నిల్వ ఉండడంలేదు. ఎన్టీటీపీఎస్కు నీటి సరఫరాకు బ్యారేజీలో 12 అడుగులు నిల్వ ఉంచాల్సి వస్తోంది. దీంతో బ్యారేజీలో పూడిక చేరి మట్టిదిబ్బలు ఏర్పడ్డాయి. వాటిని తొలగించకపోవడంతో ప్రస్తుతం 1.8 టీఎంసీలే నిల్వ ఉంటున్నాయి. వర్షాభావం, పైనుంచి నీరు రాకపోవడం వల్ల భూగర్బజలాలు తగ్గిపోతున్నాయి. దీంతో సముద్రపునీరు చొచ్చుకొచ్చి డెల్టాలోని చాలా భాగం ఉప్పుతేలి పంటలు పండని పరిస్థితి పొంచి ఉంది. బోర్ల కింద సాగుకు దెబ్బతింటుంది. ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల డెల్టా రైతునోట్లో మట్టికొట్టినట్లయింది. ఈ తీర్పు ఆ ఎత్తు పెంచడాన్ని సమర్థించి డెల్టా రైతుకు తీరని అన్యాయం చేసింది. 2003-04లో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితు ఏర్పడగా ఆల్మట్టిలో 137 టిఎంసీల నీరు ఉన్నా 10 టిఎంసీలు విడుదలచేయలేదు. భవిష్యత్‌లో కూడా ఇదే పరిస్థితి ఉండదని గ్యారెంటీ లేదు. 1956లో అంతరాష్ట్ర నదీజలాల చట్టం ప్రకారం ఏర్పాటుచేసిన ఈ ట్రిబ్యునల్ జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్‌కు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ 85 ఏళ్లలో ఎంత ప్రవాహం ఉందో లెక్కగట్టి 75శాతం డిపెండబులిటీని ఆధారంగా చేసుకుని మూడు రాష్ట్రాలకు నదీజలాలను పంచింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 47 ఏళ్ల ప్రవాహాన్ని గమనంలోకి తీసుకుని 65 శాతం డిపెండబులిటీని లెక్కించడం అశాస్త్రీయమనే వాదన వ్యక్తమవుతోంది. ఈ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు ఇచ్చినప్పుడు దీన్ని సమీక్షించేందుకు అలహాబాద్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు నేతృత్వంలో ఒక కమిటీని కృష్ణాడెల్టా పరిరక్షణ సమితి ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముఖ్యమంత్రి ముందుకు పలు సూచనలు చేసింది. ఉత్తరాది రాష్ట్రాలలో నీటిపంపిణీకి సంబంధించిన తీర్పులలో ప్రాజెక్టులలో సిల్ట్ మేనేజ్మెంట్ (పూడిక నిర్వహణ)అనే పద్ధతిని అవలంబిస్తున్నాయి. ప్రాజెక్టులలో పూడిక ఏర్పడటం వల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినా వాటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండదు. ఈ అంశాలన్నింటినీ రివ్యూ పిటిషన్లో చేర్చాలని నిపుణుల కమిటీ సూచించింది. దీనిపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా.. ట్రిబ్యునల్ ముందు సరైన పద్ధతిలో వాదించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని రైతు నాయకులు విమర్శిస్తున్నారు. సరైన వాదనలు వినిపించనందున నష్టం వాటిల్లిందని దుయ్యబడుతున్నారు. డెల్టా రైతాంగానికి శరాఘాతం కృష్ణా జలాలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు డెల్టా రైతాంగానికి శరాఘాతంలా ఉంది. ఈ తీర్పులో కృష్ణా మిగులు జలాలను వాడుకునే హక్కు కూడా ఆంధ్రప్రదేశ్‌కు లేదని చెప్పడం డెల్టా రైతాంగానికి గొడ్డలిపెట్టులాంటిది. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుకోవచ్చని తీర్పునివ్వడం దారుణం. ఈ తీర్పుతో అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుంది. ఈ విషయమై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిపుణులైన న్యాయవాదులను ఏర్పాటుచేసి బలమైన వాదనలు వినిపించడంవల్లే మనకు వ్యతిరేకంగా తీర్పువచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం నిపుణులైన న్యాయవాదులను నియమించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ తీర్పు వల్ల కృష్ణాడెల్టాకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. సర్ ఆర్థర్ కాటన్ ఎప్పుడో కృష్ణా డెల్టాకు సాగునీరందించేందుకు విజయవాడలో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. కృష్ణా మిగులు జలాలను వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉందనే కాటన్ బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించి తక్షణమే అఖిలపక్ష కమిటీ సమావేశాన్ని నిర్వహించి చర్చించాలి. కృష్ణా మిగులు జలాలపై మనకున్న హక్కులను కాపాడుకునేందుకు సుప్రీంకోర్టులో పోరాడాలి. నిపుణులైన న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేలా సీఎం చర్యలు తీసుకోవాలి. - వసంత నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకుడు డెల్టాకు తీరని అన్యాయం గతంలో ఇచ్చిన తీర్పునకే బ్రిజేష్ కమిటీ కట్టుబడి ఉన్నట్టుంది. డెల్టా రైతుల ఆందోళన, గోడును అసలు పరిగణనలోకి తీసుకోలేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకునేందుకు అనుమతివ్వడం డెల్టాకు మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఇప్పటికే కర్ణాటకలో రిజర్వాయర్లు నిండిన తరువాత డెల్టాకు నీరు విడుదల చేయడం వల్ల పంటల సాగుకు తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ తీర్పుతో డెల్టా భూములకు సరైన సమయంలో నీరందక సకాలంలో పంటలు వేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. డెల్టా రైతాంగం తరఫున సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసు వేసి ఉన్నాం. అక్కడైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర విభజనకు ముందే డెల్టాకు సరిగా సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. విభజన జరిగి, కమిటీ తీర్పు అమలైతే డెల్టాలో రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. - మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ కిరణ్ అసమర్థతే కారణం సీఎం కిరణ్ అసమర్థత వల్లే తెలుగు ప్రజలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రూపం లో ప్రమాదం ముంచుకొచ్చింది. గతంలో మధ్యంతర ఉత్తర్వుల్లో ఏవైతే ఆదేశాలున్నాయో దాదాపు ప్రస్తుత తీర్పులోనూ అవే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 12 సవరణలకు విజ్ఞప్తి చేస్తే ఒకదానిపై కూడా న్యాయం చేయకపోవడం దారుణం. ఆంధ్రపదేశ్ అభ్యంతరాలను పట్టించుకోకుండా కర్ణాటకకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రంలోని కృష్ణానదీ పరీవాహక ప్రాంతం మొత్తం తీవ్ర ప్రమాదంలోకి వెళ్లనుంది. ఎగువ ప్రాజెక్టులలోని నీరు దామాషా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు విడుదలయ్యేలా ఒత్తిడి తేవాల్సి ఉంది. డిపెండబిలిటీ 65 శాతం కాకుండా 75 శాతం ఉండాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి సమర్థనీయమైన లాయర్లను నియమించి మిగులు జలాల్లో న్యాయం జరిగేలా పోరాడాలి. - సామినేని ఉదయభాను, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తాం. మిగులు జలాలపై ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, నష్టం జరగనుంది. రాష్ట్రం విడిపోతే ఇలాంటి సమస్యలు అనేకం వస్తాయనే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతున్నాం. తీర్పును, జలాల సమస్యను రాజకీయం చేయవద్దు. ఆల్మట్టి నిర్మాణం ఎత్తు పెంపు, మిగుల జలాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ముడిపెడుతూ ఆరోపణలు చేయటం సరికాదు. వాస్తవాలు తెలుసుకొని ఎవరైనా మాట్లాడాలి. ట్రిబ్యునల్‌లో వాదించే న్యాయవాదులను కాంగ్రెస్ మార్చటం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించటం మంచి పద్ధతి కాదు. - కొలుసు పార్థసారథి, రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి అసమర్థ వాదన వల్లే అన్యాయం బ్రిజేష్‌కుమార్ తుది తీర్పు రైతాంగ ప్రయోజనాలను తీవ్రంగా నష్టపరిచేలా ఉంది. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం విశ్వసనీయతను ప్రామాణికంగా తీసుకున్న అంశాన్ని అలా ఉంచి కర్ణాటక రాష్ట్రానికి ఎక్కువ కేటాయించాలనే ఆలోచనతో 65 శాతం విశ్వసనీయతను తీసుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ప్రభుత్వం తరఫున నియమితులైన న్యాయవాదుల అసమర్థ వాదన కారణంగానే తీర్పులో గెలవలేకపోయాం. ఏడాది క్రితం ప్రాథమిక తీర్పు వెలువరించిన అనంతరం కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, రైతుసంఘ నాయకులం వెళ్లి ప్రభుత్వానికి సమర్థవంతమైన లాయర్లను పెట్టాలని సూచించాం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాథమిక తీర్పులో ఓడిన లాయర్లనే మళ్లీ నియమించారు. ఈ చర్య వల్లే తీర్పులో పూర్తిగా అన్యాయం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి సమర్థనీయమైన లాయర్లను నియమించి మిగులు జలాల్లో న్యాయం జరిగేలా పోరాడాలి. - వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రి మన రైతులకు ఇబ్బందే.. గతంలో మాదిరిగా మిగులు జలాలను వాడుకునే సౌకర్యం లేకపోవటం మన రైతులకు ఇబ్బందే. నికర జలాల విషయంలో కృష్ణా జలాలు 456 టీఎంసీలు మనకు వచ్చిన తరవాతే ఎగువ రాష్ట్రం వాడుకోవాలని చెప్పటం ఊరటనిచ్చే అంశం. ఆల్మట్టి ఎత్తు పెంచినప్పుడు మూడేళ్ల క్రితం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో చెప్పిన విషయాలనే మళ్లీ చెప్పటం జరిగింది. - యెర్నేని నాగేంద్రనాధ్, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు