
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ విషయమై ఈ నెల 12 నుంచి జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు తిరిగి విచారణ మొదలు కానుంది. గురు, శుక్రవారాల్లో రెండ్రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సమర్పించిన అఫిడవిట్‌పై క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ట్రిబ్యునల్ విచారణలో పాల్గొనేందుకు బుధవారం రాష్ట్ర నీటి పారుదలశాఖ అధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత ట్రిబ్యునల్‌పై ఉందని.. కృష్ణా జలాల్లో తమ కేటాయింపుల (299 టీఎంసీల)కు అదనంగా మరో 200 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ పేర్కొంది. రాష్ట్ర పరీవాహకం, అవసరాలు దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు పెంచాలని విన్నవించింది. అయితే తన అవసరాలపై అఫిడవిట్ సమర్పించిన ఏపీ, తమ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమని పేర్కొంది.
1976లో బచావత్ అవార్డు ప్రకారం ప్రాజెక్టుల వారీగా 811 టీఎంసీలను పంచగా, ఇందులో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు దక్కాయని, మూడేళ్లుగా ఇదే విధానం కొనసాగుతోందని తెలిపింది. ఆయకట్టు, ప్రాజెక్టుల కింది నీటి వినియోగంలో ఎలాంటి మార్పులు లేవని, నీటి వాటాల్లో మార్పులు చేస్తే ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతుందని, 150 ఏళ్లుగా ఉన్న నదీ వ్యవస్థను మార్చే పనులు చేయరాదని కోరింది. ఇదే సమయంలో తెలంగాణ గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు 214.14 టీఎంసీలను తరలిస్తోందని, ఇందులో ఏపీ వాటా ఏమిటో తేల్చాలని విన్నవించింది. ఏపీ సమర్పించిన అఫిడవిట్ అంశాలపై గురువారం నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment